Donald Trump
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఖతార్ భారీ బహుమతిని ఇచ్చేందుకు సిద్ధమైంది. ట్రంప్ ఈ వారంలో మధ్యప్రాచ్య పర్యటనకు వెళ్లనున్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ లో పర్యటించనున్నారు. ఖతార్ లో పర్యటన సందర్భంగా ఖతార్ పాలన కుటుంబం నుంచి విలాసవంతమైన 747-8 జంబో జెట్ విమానాన్ని బహుమతిగా స్వీకరించనున్నట్లు సమాచారం. అయితే, ఖతార్ ప్రభుత్వం ఈ విషయంపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.
అమెరికా అధికారులు దీనికి అధ్యక్ష విమానానికి (ఎయిర్ ఫోర్స్ వన్) తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. 2029 జనవరి పదవీ విరమణ చేసే వరకు ఈ విమానాన్ని ట్రంప్ ‘ఎయిర్‌ఫోర్స్ వన్’కు కొత్త వెర్షన్ గా ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఒక విదేశీ ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద కానుకను అమెరికా అధ్యక్షుడు స్వీకరించడం, దాని చట్టబద్ధతపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అమెరికా రాజ్యాంగం ప్రకారం.. విదేశీ దేశాల నుంచి బహుమతులను స్వీకరించడం నిషేధం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అమెరికన్ డెమోక్రాట్లు ట్రంప్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఈ విమానం రక్షణ శాఖకు తాత్కాలిక బహుమతి అని ట్రంప్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఖతార్ గురించి ప్రస్తావించకుండా సోషల్ మీడియాలో డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ పెట్టారు. ఆ విమానం రక్షణ శాఖకు వెళ్లే తాత్కాలిక “బహుమతి” అని, నాలుగు దశాబ్దాల నాటి మోడల్‌ను అది భర్తీ చేస్తుందని చెప్పుకొచ్చారు.
అమెరికా రాజ్యాంగంలోని జీతాల నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ పదవిలో ఉన్న ఎవరైనా కాంగ్రెస్ అనుమతి లేకుండా ఏదైనా రాజు, యురాజు, విదేశీ రాష్ట్రం నుంచి ఏదైనా బహుమతి, జీతం, కార్యాలయం లేదా బిరుదును స్వీకరించడాన్ని నిషేధిస్తుంది. లూరా లూమర్ మాట్లాడుతూ.. ఖతార్ విమానాన్ని స్వీకరిండం ట్రంప్ పరిపాలనపై కళంకం అవుతుందని అన్నారు.
ట్రంప్ వ్యక్తిగత ఆర్థిక లాభంకోసం వైట్ హౌస్ ను ఉపయోగించుకుంటున్నాడని ఈ చర్య ద్వారా అర్ధమవుతుందని డెమోక్రటిక్ నేషన్ కమిటీ విమర్శించింది. అనేక మంది డెమోక్రటిక్ చట్ట సభ సభ్యులు ఖతార్ బహుమతి ట్రంప్ స్వీకరించేందుకు సిద్ధమవడంపై తప్పుబడుతున్నారు. అయితే, ట్రంప్ అందుకోబోతున్న కొత్త బోయింగ్ 747-8 ధర దాదాపు 400 మిలియన్ డాలర్లు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.