Pakistan Tomato Prices
Pakistan Tomato Prices: పాకిస్థాన్ – అఫ్గానిస్తాన్ దేశాల సరిహద్దుల్లో కొద్దిరోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గానిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణ నెలకొంది.
ఈ కారణంగా అక్టోబర్ 11 నుంచి ఇరు దేశాల సరిహద్దులు మూసివేశారు. ఈ పరిణామాలు ఇరు దేశాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బోర్డర్ మూసివేత వల్ల ఇరు దేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుములు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య ప్రతీ సంవత్సరం 2.3 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో పాక్- అఫ్గాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ మాట్లాడుతూ.. రెండు దేశా మధ్య రోజుకు దాదాపు 1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.8కోట్లు) నష్టం వాటిల్లుతుందని అన్నారు. ప్రతిరోజు గడిచే కొద్దీ నష్టాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే వస్తువులు రవాణా పూర్తిగా నిలిచిపోయింది.
అఫ్గాన్ నుంచి పాకిస్థాన్‌కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కూరగాయలు పాడైనట్లు ఆయన తెలిపారు. మరోవైపు.. సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5వేల కంటైనర్లు నిలిచిపోయాయని పాకిస్థాన్ దేశంలోని ప్రధాన టోర్ఖామ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద ఉన్న ఓ అధికారి పేర్కొన్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
అదేవిధంగా ఉల్లిపాయలు కిలో రూ.120, బఠానీలు కిలో రూ.500కి రిటైల్ అవుతున్నాయి. దోసకాయలు కిలో రూ.150కి, స్థానిక ఎర్ర క్యారెట్లు కిలో రూ.200కి లభిస్తున్నాయి. స్థానిక నిమ్మకాయలు కిలో రూ.300కి లభిస్తుండగా, గతంలో ఉచితంగా ఇచ్చే కొత్తిమీర ఇప్పుడు చిన్న కట్టకు రూ.50 ఖర్చవుతుంది.
ఇరు దేశాల మధ్య వాణిజ్య రవాణాకు అంతరాయం ఏర్పడడంతో మార్కెట్లో టమోటా, ఆపిల్స్, ద్రాక్షాల కొరత తీవ్రంగా ఉంది. పాకిస్థానీయులు వంటల్లో ఎక్కువగా వినియోగించే ప్రధానమైన టమోటాలు ఇప్పుడు 400శాతం పెరిగాయి. ఫలితంగా అక్కడ కిలో టమాటా 700 పాకిస్థానీ రూపాయలకు చేరుకుంది. కొన్ని వారాల కిందట వరకు కిలో టమాటో ధర రూ.100గా ఉండేది. ప్రస్తుతం ఆ ధర కాస్తా కొండెక్కి కూర్చొంది. కిలో టమాటో ధర భారీగా పెరగడంతో వీటిని కొనుగోలు చేసేందుకు పాకిస్థానీయులు జంకుతున్నారు.