Russia Earthquake : వామ్మో.. రష్యాను వణికించిన భారీ భూకంపం.. ఊగిపోయిన భవనాలు.. వీడియోలు వైరల్.. సునామీ హెచ్చరికలు జారీ..

రష్యాలో భారీ భూకంపం సంభవించింది. పెట్రోపావ్లోవ్స్‌-కామ్చాట్‌స్కీ రీజియన్‌లో శుక్రవారం తెల్లవారు జామున ప్రకంపనలు వచ్చాయి.

Russia Earthquake

Russia Earthquake : రష్యాలోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారు జామున పెట్రోపావ్లోవ్స్‌-కామ్చాట్‌స్కీ రీజియన్లో రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. భూకంప కేంద్రంను 10 కిలోమీటర్ల (6.2 మైళ్లు) లోతులో గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

Also Read: Hyderabad Rain: హైదరాబాద్‌లో మరోసారి వాన బీభత్సం.. 2గంటలు దంచికొట్టిన వర్షం.. నదుల్లా రోడ్లు.. భారీగా ట్రాఫిక్ జామ్..

భారీ భూకంపం సంభవించిన కొద్దిసేపటికే 5.8 తీవ్రతతో పలు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో సమీపంలోని తీర ప్రాంతాల్లో ప్రమాదకరమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని అమెరికా పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
రష్యన్ సోషల్ మీడియాలో పోస్టు చేయబడిన వీడియోల్లో ఇళ్లలోని ఫర్నీచర్, లైట్ ఫిక్చర్‌లు ఊగుతున్నట్లు కనిపించాయి. మరో వీడియోలో పార్కు చేసిన కారు వీధిలో ముందుకు వెనుకకు ఊగుతున్నట్లు కనిపించింది.

తాజా నివేదికల ప్రకారం.. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇదిలాఉంటే.. ఆ ప్రాంత గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ టెలిగ్రామ్‌లో భూకంపం గురించి ప్రస్తావించారు. ఈ ఉదయం సంభవించిన భూకంపం కారణంగా ప్రస్తుతం నష్టం జరిగినట్లు ఎటువంటి నివేదికలు లేవు. అందరూ ప్రశాంతంగా ఉండాలని నేను కోరుతున్నాను. ద్వీపకల్పంలోని తూర్పు తీరానికి సునామీ హెచ్చరిక జారీ చేయబడింది. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు.. ఇండోనేషియాలోనూ భూప్రకంపనలు సంభవించాయి. సెంట్రల్ పపువా ప్రావిన్స్ లో శుక్రవారం తెల్లవారు జామున 6.1 తీవ్రతతో భూమి కంపించింది. 28కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.