Russia Ukraine War: ఒక యుద్ధం ఆగుతుందనుకునే టైమ్ లో ఇంకో యుద్ధం స్టార్ట్?

రష్యా ఆక్రమిత తూర్పు యుక్రెయిన్‌లో జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించిన తర్వాత కీవ్ నగరంపై భారీ బాంబుల వర్షం కురిసింది.

  • Published on- May 24, 2026 / 06:43 PM IST

Russia Ukraine War: మూడు నెలలకు పైగా సాగిన పశ్చిమాసియా యుద్ధానికి ఎండ్ కార్డ్ పడనుందనే వార్తలు వస్తున్నాయి. ఇంతకాలం యురేనియం విషయంలో పట్టువీడని ఇరాన్.. ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. తన దగ్గరున్న యురేనియం నిల్వలను వదులుకోవడానికి ఇరాన్ సిద్ధమైందని తెలుస్తోంది. మరోవైపు యుద్ధం ముగింపునకు సంబంధించి మార్కో రుబియో కూడా దాదాపు గుడ్ న్యూస్ వస్తుందని చెప్పాడు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రపంచ దేశాలు.. ఈ పరిణామాలతో కాస్త రిలీఫ్ గా ఫీల్ అయ్యాయి. ఇంతలోనే మరో షాక్ తగిలింది. ఒక యుద్ధం ఆగుతుందనుకునే టైమ్ లో ఇంకో యుద్ధం స్టార్ట్ అయ్యిందా అనే భయాలు మొదలయ్యాయి. దీనికి కారణం.. ఇప్పుడు రష్యా మళ్లీ యుక్రెయిన్ మీద దాడులు స్టార్ట్ చేయడమే.

రష్యా ఆక్రమిత తూర్పు యుక్రెయిన్‌లో జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించిన తర్వాత కీవ్ నగరంపై భారీ బాంబుల వర్షం కురిసింది. ఇటీవలి వారాల్లో జరిగిన అత్యంత తీవ్రమైన రష్యన్ దాడుల్లో ఇదొకటి. రాత్రికి రాత్రే ఆ నగరం విధ్వంసకర దృశ్యాలకు సాక్ష్యంగా నిలిచింది.

ఒక క్రూయిజ్ క్షిపణి కీవ్ నగరం మధ్య భాగాన్ని తాకింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫుటేజీలో, క్షిపణి తాకిన క్షణంలో అకస్మాత్తుగా తీవ్రమైన కాంతి మెరుపు కనిపించడంతో పాటు, శక్తివంతమైన పేలుడు కూడా సంభవిస్తుంది.

600 డ్రోన్ లు, 90 క్షిపణులతో అటాక్..

ఈ దాడిలో సుమారు 600 డ్రోన్‌లు, 90 క్షిపణులను ప్రయోగించినట్లు యుక్రెయిన్ అధికారులు తెలిపారు. వాయు రక్షణ వ్యవస్థలు వాటిలో చాలా వాటిని కూల్చివేయగలిగాయని వెల్లడించింది.

యూరోమైడాన్ ప్రెస్ ప్రకారం ఈ దాడిలో లుకియానివాస్ కా మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఒక వ్యాపార కేంద్రం, దగ్గరలోని మార్కెట్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. దెబ్బతిన్న ప్రదేశాలలో ఒక చిన్న కేఫ్ కూడా ఉంది. దీనిని గతంలో జరిగిన రష్యన్ దాడుల తర్వాత ఇప్పటికే ఆరుసార్లు పునర్ నిర్మించి తిరిగి తెరిచారు.

ఈ దాడిలో నలుగురు మరణించారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. రాజధాని, ఇతర ప్రాంతాల వ్యాప్తంగా ఇళ్లు, పాఠశాలలు, మార్కెట్లు, వ్యాపార భవనాలు దెబ్బతిన్నాయి. కీవ్‌లో రాత్రంతా పేలుడు శబ్దాలు వినిపించాయి. క్షిపణులు, డ్రోన్‌లు నగరంపై దాడి చేయడంతో నివాసితులు ప్రాణరక్షణ కోసం మెట్రో స్టేషన్లకు, భూగర్భ ఆశ్రయాలకు పరుగులు తీశారు.

రష్యా దాడిపై యుక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ సిబిహా X లో తీవ్రంగా స్పందించారు. ఈ దాడి సైనిక లక్ష్యాల కోసం కాదని, పౌరులకు హాని కలిగించడానికే జరిగిందని అన్నారు. కీవ్, చెర్కాసీ, ఖార్కివ్, క్రోపివ్నిట్స్ కై, ఒడెస్సా, పోల్టావా, సుమీ, ఝైటోమిర్ సహా అనేక ఇతర యుక్రేనియన్ ప్రాంతాలపై రష్యా రాత్రికి రాత్రే అతి పెద్ద దాడులలో ఒకటి చేసిందన్నారు. ఈ దాడి ద్వారా పుతిన తన బలం చూపించాలని అనుకున్నారు, కానీ ఆయన బలహీనతను చాటుకున్నారు అని విమర్శించారు.

రష్యా కూడా ఒరేశ్నిక్ హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణి అనే శక్తివంతమైన ఆయుధాన్ని ఉపయోగించిందని యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ అన్నారు. ఒరేశ్నిక్ అనేది ధ్వని వేగం కంటే పది రెట్లు వేగంతో ప్రయాణించగల ఒక హైపర్‌సోనిక్ క్షిపణి. దీనిని “మూడు, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ అంతస్తుల లోతులో” ఉన్న భూగర్భ బంకర్లను ధ్వంసం చేయడానికి రూపొందించారు.

రష్యా మొట్టమొదటిసారిగా 2024 నవంబర్‌లో యుక్రెయిన్‌లోని ద్నీప్రో నగరంపై బహుళ-వార్‌హెడ్‌ల ఒరేశ్నిక్‌ను ప్రయోగించింది. జనవరిలో పశ్చిమ ల్వివ్ ప్రాంతంలో దీనిని రెండవసారి ప్రయోగించినట్లు సమాచారం. ఈ దాడిని జెలెన్ స్కీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి సాధారణ పౌరులను, అలాగే మార్కెట్లు, పాఠశాలలు, నీటి సౌకర్యాలతో సహా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుందని అన్నారు

యుక్రెయిన్‌లోని “సైనిక కమాండ్ నియంత్రణ కేంద్రాలు,” వైమానిక స్థావరాలు సైనిక-పారిశ్రామిక సంస్థలపై దాడికి ఒరేశ్నిక్‌తో పాటు ఇతర క్షిపణి వ్యవస్థలను ఉపయోగించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ధృవీకరించింది. అయితే లక్ష్యాల స్థానాలను మాత్రం పేర్కొనలేదు. రష్యా నియంత్రణలో ఉన్న ప్రాంతాలపై యుక్రెయిన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని రష్యా వెల్లడించింది.

Also Read: అమెరికాతో యుద్ధం.. ఇరాన్ సంచలన ప్రకటన..