Russian Airplane : సముద్రంలో కూలిపోయిన రష్యా విమానం

ప్రయాణికులతో వెళ్తున్న విమానం సముద్రంలో కూలిపోయిన ఘటన మంగళవారం రష్యాలో చోటుచేసుకుంది.

Russian Airplane ప్రయాణికులతో వెళ్తున్న విమానం సముద్రంలో కూలిపోయిన ఘటన మంగళవారం రష్యాలో చోటుచేసుకుంది. రష్యా తూర్పు ప్రాంతం పెట్రోపవ్లోస్క్‌-కామ్‌ చట్‌స్కీ నుంచి పలానాకు బయల్దేరిన AN-26 విమానానికి ల్యాండింగ్ సమయంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థతో సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానం పలానాలో షెడ్యూల్‌ ప్రకారం ల్యాండింగ్‌ జరగలేదు. దీంతో అప్రమత్తమైన అధికారులు,సైన్యం రంగంలోకి దిగి తప్పిపోయిన విమానం కోసం గాలించారు. చివరికి విమానం కాంచక్తా ద్వీపంలో సముద్రంలో కూలిపోయినట్లు గుర్తించారు.

ఈ విమానంలో 22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 28 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో కొందరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విమానం క్రాష్ అయిన చోటుకి పలు షిప్ లు,సహాయక సిబ్బంది బయల్దేరి వెళ్తున్నట్లు రష్యా ఎమర్జెన్సీ సర్వీసెస్ మంత్రిత్వశాఖ తెలిపింది. మరోవైపు, ఘటన సమయంలో ఆకాశంలో దట్టమైన మేఘాలు అలముకున్నాయని, వాతావరణం బాగాలేదని అధికారులు చెబుతున్నారు.

కాగా, ఒకప్పుడు విమాన ప్రమాదాలు ఎక్కువగా జరిగే రష్యాలో గత కొన్నేళ్లుగా ఆ పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఎయిర్ ట్రాఫిక్ సేఫ్టీని ఆ దేశ ప్రభుత్వం పటిష్ఠపరిచింది. అయితే, విమానాల నిర్వహణలో లోపాలు, అత్యంత హీన స్థితిలో భద్రతా ప్రమాణాలున్నాయన్న విమర్శలున్నాయి. రష్యాలోని క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు కూడా విమాన ప్రమాదాలకు కారణమవుతుంటుంటాయి.

ట్రెండింగ్ వార్తలు