Narendra Modi, Vladimir Putin, Donald Trump
Donald Trump: రష్యా నుంచి చమురు కొనొద్దన్న తన హెచ్చరికలను పట్టించుకోని భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు. భారత్ దిగుమతులపై ఇప్పటికే 25శాతం సుంకాలు విధించిన ట్రంప్.. తాజాగా.. దానిని 50శాతానికి పెంచారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. అయితే, గతంలో విధించిన 25శాతం సుంకాలు ఆగస్టు 7నుంచి అమల్లోకిరాగా.. అదనంగా పెంచిన 25శాతం సుంకాలు ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని ట్రంప్ ప్రకటించారు. అయితే, యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ఆపేస్తే భారత్ పై సుంకాలు తగ్గిస్తారా అని మీడియా ప్రశ్నించగా.. ట్రంప్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని కొనసాగించడానికి భారత్ కారణమంటూ కొద్దిరోజులుగా డొనాల్డ్ ట్రంప్ అర్ధంపర్ధంలేని వాదన చేస్తున్న విషయం తెలిసిందే. రష్యా నుంచి పెద్దమొత్తంలో భారత్ చమురు నిల్వలు దిగుమతి చేసుకుంటుండంటం వల్లనే ఇలా జరుగుతుందని, భారత్ చమురు నిల్వలను దిగుమతి చేసుకోవటం నిలిపివేయాలంటూ ట్రంప్ హెచ్చరికలు చేశారు. అయితే, ట్రంప్ హెచ్చరికలను భారత్ పట్టించుకోకపోవడంతో భారత్ దిగుమతులపై భారీ సంకాలను విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది.
బుధవారం వైట్ హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. వ్లాదిమిర్ పుతిన్‌తో త్వరలో భేటీ కాబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే యుక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధాన్ని ముగించే ప్రణాళికతో ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ మాస్కోలో ఆ దేశ అధికారులతో సుమారు మూడు గంటలపాటు చర్చలు జరిపారు. చర్చలు సానుకూలంగా జరిగినట్లు ప్రకటించారు. ట్రంప్ కూడా ట్రూత్ సోషల్‌లో ట్వీట్ చేశారు. గొప్ప పురోగతి సాధించాం. ఈ యుద్ధం ఇక ముగించాల్సిందే అంటూ పేర్కొన్నాడు.
వచ్చే వారంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీతో డొనాల్డ్ ట్రంప్ భేటీ అవుతారని వైట్ హౌస్ ప్రకటించింది. పుతిన్ తో చర్చించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలీన్ లివిట్ పేర్కొన్నారు. ట్రంప్‌తో పుతిన్ భేటీ తరువాత యుక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం ముగింపుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తే భారత్‌పై విధించిన సుంకాలు తగ్గుతాయా? అని ట్రంప్‌ను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. దీనికి ట్రంప్ బదులిస్తూ.. అలా జరిగే అవకాశం ఉందని సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే, దీనిపై తాము తర్వాత నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికైతే భారత్ 50శాతం సుంకాలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.