20 ఏళ్లు తిరుగులేకుండా బంగ్లాను ఏలిన ఐరన్‌లేడీ.. తండ్రి తెచ్చిన రిజర్వేషన్లతోనే తనయకు సమస్యలు!

వకార్‌ ఉజ్‌ జమాన్‌ గురించి హసీనాను భారత్‌ ఏడాది ముందే హెచ్చరించినట్లు తెలుస్తోంది.

తిరుగులేని నాయకురాలిగా ఎదిగి.. ఎగిసిపడిన కెరటం అయ్యారు బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా. ఎక్కడైతే తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారో అక్కడే పొలిటికల్ కెరీర్ ముగించాల్సి వచ్చింది. ఒకప్పుడు దేశంలో ప్రజాస్వామ్య స్థాపన కోసం సైనికులతో పోరాడారు. ఇప్పుడు అప్పటి ప్రజానాయకురాలు.. నియంతగా పేరు తెచ్చుకున్న.. సైనిక పాలనకు కారణమై దేశాన్ని విడిచివచ్చారు.

1972లో హసీనా తండ్రి షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్‌ సివిల్‌ సర్వీసుల్లో రిజర్వేషన్లు అమలు చేశారు. స్వాతంత్య్ర సమరయోధులకు 30 శాతం, విమోచన యుద్ధంలో శత్రుసేనల చేతుల్లో అకృత్యాలకు గురైన మహిళలకు10శాతం రిజర్వేషన్‌ కల్పించారు. స్వాతంత్య్ర సమరయోధుల సంఖ్య తగ్గిపోవడంతో 1996 తర్వాత ఆ కోటాను వారి పిల్లలకు వర్తింపజేశారు.

2009 నుంచి స్వాతంత్య్ర సమరయోధుల మనవళ్లు, మనవరాళ్లకూ రిజర్వేషన్లు ఇచ్చారు. 2013లో బంగ్లాదేశ్‌ సివిల్ సర్వీస్‌ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన కొన్ని వందల మంది ఉద్యోగార్థులు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు. 2018లో 30శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది హసీనా సర్కారు.

రిజర్వేషన్లను తగ్గించినా ఆందోళనలు
రిజర్వేషన్‌ కల్పించకపోవడంపై 2021లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు బంగ్లాదేశ్‌ హైకోర్టుకు వెళ్లాయి. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు రిజర్వేషన్‌ను పూర్తిగా రద్దు చేయడం చట్టవిరుద్ధమంటూ 2024 జూన్‌ 5న కోర్టు తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్‌ కోటాను తిరిగి కొనసాగించారు. దాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు స్టార్ట్ అయ్యాయి. తర్వాత కోర్టు రిజర్వేషన్లను తగ్గించినా ఆందోళనలు కంటిన్యూ అయ్యాయి.

అయితే రిజర్వేషన్ల కోసం జరిగిన నిరసనలు..అల్లకల్లోలంగా మారడం వెనుక ఆర్మీ చీఫ్‌ పాత్ర ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. హసీనా రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లిన తర్వాత..ఆమెకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి, మాజీ ప్రధాని ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేస్తూ అధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరుగుతోన్న డెవలప్‌మెంట్స్‌ చూస్తుంటే రిజర్వేషన్లపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను హసీనా ప్రత్యర్థులు తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది. BNP, దాని మిత్రపక్షమైన జమాత్‌-ఎ-ఇస్లామీ వంటి పార్టీలు ఈ ఆందోళనల వెనుక ఉన్నట్లు తెలుస్తోంది.

గద్దెదింపి పాలనా పగ్గాలు
ఈ ఏడాది జూన్‌ 23న వకార్‌-ఉజ్‌-జమాన్‌ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌గా చార్జ్ తీసుకున్నారు. అతను బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే హసీనాను గద్దెదింపి పాలనా పగ్గాలు అందుకున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..మాజీ సైన్యాధిపతి ముస్తఫిజుర్‌ రెహమాన్‌ కూతురును జమాన్‌ పెండ్లి చేసుకున్నారు. షేక్‌ హసీనాకు ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌ వరుసకు మామయ్య అవుతారు.

అయితే వకార్‌ ఉజ్‌ జమాన్‌ గురించి హసీనాను భారత్‌ ఏడాది ముందే హెచ్చరించినట్లు తెలుస్తోంది. జమాన్‌ చైనా అనుకూల వ్యక్తి అని, అతడితో జాగ్రత్తగా ఉండాలని భారత జాతీయ భద్రతా మండలికి చెందిన కొందరు ఉన్నతాధికారులు హసీనాను అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ హసీనా ప్రభుత్వం అతడి నియమించింది. చివరకు ఆర్మీ చీఫే ఆమెను నట్టేట ముంచాడు.

అలా షేక్ హసీనా రాజకీయ సుధీర్ఘ ప్రస్థానం..నమ్మిన వ్యక్తి చేతిలో మోసపోయింది. రిజర్వేషన్ల అంశం కాస్త ఆమె మెడకు చుట్టుకుని..దేశాన్ని విడిచి రాజకీయ ప్రస్థానం ముగించేలా చేసింది.

Also Read: భారత్‌ సన్నిహిత దేశాల్లోనే సమస్యలు ఎందుకు? ఆ దేశాల్లో చైనా పెట్టుబడులు పెరగడానికి కారణాలేంటి?

ట్రెండింగ్ వార్తలు