cargo ship
Ship carrying thousands of sheep capsizes in Red Sea: ఎర్ర సముద్రంలో వేలాది గొర్రెలను తీసుకెళ్తున్న కార్గో షిప్ బోల్తా పడింది. దీంతో అందులోని గొర్రెలు సముద్రంలో పడిపోయాయి. ప్రాణాలు కాపాడుకొనేందుకు అవి సముద్రంలో ఈదుతూ కనిపించాయి. దీనిని గమనించి స్థానిక మత్స్యకారులు చిన్న బోట్లలో వేగంగా ప్రమాద స్థలికి చేరుకొని వాటిని కాపాడే ప్రయత్నం చేశారు.
సుమారు 14వేల గొర్రెలతో కార్గో షిప్ జిబౌటికి వెళ్తుండగా బోల్తా పడింది. యెమెన్ లోని లాజ్ ప్రావిన్స్ లోని రాస్ అల్-అరా తీరంలో ఈ ప్రమాదం సంభవించడంతో యెమెన్ మత్స్యకారులు గొర్రెలను ప్రాణాలతో కాపాడే ప్రయత్నం చేశారు. అయితే, 160 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సముద్రంలో షిప్ ముగినిపోవడం.. గొర్రెలు సముద్రంలో ఈదుతున్న దృశ్యాలు.. వాటిని స్థానిక మత్స్యకారులు కాపాడుతున్న దృశ్యాలు వీడియో ఉన్నాయి. బోల్తా పడిన కార్గో షిప్ తలక్రిందులుగా కనిపిస్తుంది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. గొర్రెలు మునిగిపోకుండా వాటి ప్రాణాలను కాపాడిన మత్స్యకారులను అభినందిస్తున్నారు. మరికొందరు ఇది హృదయ విదారకం అని పేర్కొన్నారు.