చావు అలా వచ్చింది : సర్కస్ నుంచి తప్పించుకున్న పులి

  • Publish Date - September 10, 2019 / 11:00 AM IST

పాపం అలా రాసి పెట్టి ఉంది.. ఏం చేస్తాం మరి.. అనుకునేలా జరిగింది ఓ పెద్దపులి విషయంలో. సర్కస్ లో పులి చేసే విన్యాసాలను చూసి చిన్నా పెద్దా కేరింతలు కొడుతున్న సమయంలో అది తప్పించుకుంది. అలా తప్పించుకున్న ఆ పులి ప్రమాదవశాత్తు చనిపోయింది. చైనాలో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకుంటే పాపం పులి అనుకుంటున్నారు అంతా. సర్కస్ లోనే ఉంటే అలా జరిగి ఉండేది కాదేమో అనిపిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.,. 

చైనాలోని క్సియాన్‌క్సింగ్‌ సిటీ. సర్కస్ షో జరుగుతోంది. సెప్టెంబర్ 6వ తేదీ స్కూల్‌ టీచర్స్‌, విద్యార్థులు సర్కస్‌కు వచ్చారు. రింగ్ మాస్టర్ సర్కస్‌లో పులిని ఆడిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే రింగ్ లో నుంచి ఇనుప కడ్డీలపైకి ఎక్కింది. అక్కడి నుంచి ఒక్క దూకు దూకి తప్పించుకుంది పులి. అలా తప్పించుకోవటంతో భయాందోళనలకు గురైన టీచర్లు, విద్యార్థులు ప్రాణాలను కాపాడుకునేందుకు ఉరుకులు, పరుగులు పెట్టారు. 

పులి తప్పించుకుందనే సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు హుటాహుటిన సర్కస్ జరిగే ప్రాంతానికి వచ్చారు. ఆ రోజు రాత్రి పులి ఆచూకీ కోసం గాలించి.. ఎట్టకేలకు మరుసటి రోజు పులి ఎక్కడుందో కనిపెట్టారు. పట్టుకునేందుకు దానికి మత్తు మందు ఇచ్చి జూపార్కుకు తరలిస్తుండగా పులి చనిపోయింది. పులి తప్పించుకుని పారిపోతున్న సమయంలో కారు ఢీకొట్టిందని, దీంతో పులి శరీరంలో అవయవాలు దెబ్బతినడంతోనే అది మృతి చెందినట్లు దర్యాప్తులో తేలింది. జంతువులను హింసించటం నేరమనీ.. సర్కస్‌ నిర్వహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దపులి చావు విషాదంగా మారటం అందర్నీ కలిచివేసింది.