స్మోకింగ్ అలవాటుందా? మీకు కరోనాతో రెండింతలు రిస్క్

  • Publish Date - July 14, 2020 / 11:44 AM IST

స్మోకింగ్ అలవాటు ఉన్న యువతకు కరోనా ముప్పు పొంచి ఉందా? ధూమపానం చేసే యువకులకు ఎక్కువగా కోవిడ్ సోకుతుందా? స్మోకింగ్ కారణంగా కరోనా బారిన పడే అబ్బాయిలు, అమ్మాయిల సంఖ్య రెట్టింపు కానుందా? తాజా అధ్యయనం అవుననే అంటోంది. స్మోకింగ్ కారణంగా కరోనా బారిన పడుతున్న యువకుల సంఖ్య డబుల్ అవుతున్నట్టు అధ్యయనంలో తేలింది. శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా యూనివర్సీటికి చెందిన పరిశోధకులు 8వేల 405 మందిపై పరిశోధన జరిపారు. వారంతా 18 నుంచి 25 ఏళ్లలోపు వయసు వారే. 8వేల 405 మందిలో 32శాతం మందికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. దానికి ప్రధాన కారణం ధూమపానం అలవాటే. గత 30 రోజుల నుంచి స్మోకింగ్ చేస్తున్న వారిని కూడా కరోనా అటాక్ చేసే రిస్క్ ఎక్కువగా ఉంది. స్మోకింగ్ చేయడం మానేస్తే కరోనా సోకే రిస్క్ శాతం 30 నుంచి 16కి పడిపోయినట్టు పరిశోధకులు గుర్తించారు.

స్మోకింగ్ అలవాటున్న యువతకు రిస్క్ ఎక్కువ:
”కరోనాకి స్మోకింగ్ కి రిలేషన్ ఉంది. ధూమపానం అలవాటు ఉన్నవారికి కరోనా సోకితే తీవ్ర అస్వస్థతకు గురవుతారు. ఐసీయూలో చికిత్స అందించాల్సి ఉంటుంది. మరణం సంభవించే చాన్స్ ఎక్కువ” అని రీసెర్చర్ ఆడమ్స్ తెలిపారు. అమెరికాలో చూస్తే కరోనా బారిన పడే వారిలో యువత సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దానికి కారణం స్మోకింగ్ అని పరిశోధకులు అంటున్నారు.

పెరిగిన కరోనా బారినపడ్డ యువత సంఖ్య:
”ప్రస్తుతం 65ఏళ్లకు పైబడిన వారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, చనిపోతున్నారు. కానీ, ఇటీవల కరోనా బారిన పడుతున్న యువత సంఖ్య, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఖ్యా పెరుగుతోంది. మే 2 నుండి జూలై 4 వరకు చూస్తే 18 నుంచి 29 ఏళ్ల వయసున్న యువత ఆసుపత్రిలో చేరే శాతం 3 రెట్లు పెరిగింది. అదే 65 ఏళ్లు పైబడిన వారి శాతం రెట్టింపు అయ్యింది” అని పరిశోధకులు వివరించారు.

ఈ-సిగరెట్ తాగినా ప్రమాదమే:
ధూమపానం కారణంగా ఎక్కువమంది యువత కరోనా బారిన పడుతుండగా, ఆ తర్వాత ఆస్తమా కారణంగా ఎక్కువమంది యువత కోవిడ్ బారిన పడుతున్న వారిలో ఉన్నారని పరిశోధకులు తెలిపారు. గత నెల రోజుల లెక్కలు విశ్లేషిస్తే స్మోకింగ్ కారణంగా 20శాతం యువత కరోనా బారిన పడింది. పొగాకు, సిగార్స్ తాగే అలవాటు ఉన్నవారే కాదు ఈ-సిగరెట్లు తాగే అలవాటు ఉన్నవారు కూడా ప్రమాదంలో ఉన్నట్టే అని పరిశోధకులు చెప్పారు. వీటి కారణంగా శ్వాస కోశ వ్యవస్థ దెబ్బతింటుందని, కరోనా వైరస్ దాడి చేసేందుకు అవకాశాలు పెరుగుతాయన్నారు.

అబ్బాయిలకే కాదు స్మోకింగ్ చేసే అమ్మాయిలకూ కరోనా ముప్పు:
స్టడీలో మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. స్మోకింగ్ అలవాటున్న అబ్బాయిలే కాదు అమ్మాయిలకు కూడా కరోనా ముప్పు పొంచి ఉంది. అబ్బాయిలంత ఎక్కువగా సిగరెట్లు కాల్చకపోయినా వారికీ కరోనా డేంజర్ ఉంది. అబ్బాయిల్లో 33 శాతం మందికి కరోనా ముప్పు ఉంచి ఉంటే, అమ్మాయిలో 30శాతం మంది కరోనా ముప్పు పొంచి ఉంది.

ట్రెండింగ్ వార్తలు