Solar Storm : భూమివైపు దూసుకొస్తున్న సౌర తుపాను.. నేడు విద్యుత్, ఇంటర్నెట్ సేవలకు ముప్పు ఉందా? అంతరిక్షంలో కలకలం..
Solar Storm : సూర్యుడిలో సంభవించిన రెండు భారీ విస్ఫోటాలు కారణంగా ఆదివారం భూమిని శక్తిమంతమైన సౌర తుపాను తాకనుంది. దీని ప్రభావంతో భూమి అయస్కాంత క్షేత్రంలో మార్పులు చోటుచేసుకోవచ్చని అంచనా.
- Harish Thanniru
- Published on- October 11, 2026 / 07:40 AM IST
Solar Storm
Solar Storm October 11 : భూమివైపు దూసుకొస్తున్న సౌర తుఫాను శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ రేపుతోంది. అక్టోబర్ 11న (ఆదివారం) ఈ తుఫాను భూమిని తాకే అవకాశం ఉండటంతో అంతరిక్ష వాతావరణంపై నిఘా పెరిగింది. దీని ప్రభావంతో భూమి అయస్కాంత క్షేతరంలో మార్పులు సంభవించే అవకాశముంది. ఉపగ్రహాలు, జీపీఎస్, రేడియో సమాచార వ్యవస్థలపై ప్రభావం పడుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఈ సౌర తుఫాను ఎంత ప్రమాదకరం? భూమిపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయి? తెలుసుకుందాం.
Also Read : AP Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ..
సూర్యుడిలో సంభవించిన రెండు భారీ విస్ఫోటాలు కారణంగా ఆదివారం భూమిని శక్తిమంతమైన సౌర తుపాను తాకనుంది. దీని ప్రభావంతో భూమి అయస్కాంత క్షేత్రంలో మార్పులు చోటుచేసుకోవచ్చని, ఉపగ్రహ సేవలు, రేడియో సమాచార వ్యవస్థలు, నావిగేషన్ వ్యవస్థలపై స్వల్ప ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, దీనివల్ల భారీ అంతరాయాలు తప్పవని ఇప్పుడే చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల సూర్యుడిపై రెండు భారీ సౌర తుపాన్లు చోటుచేసుకున్నాయి. ఫలితంగా అక్టోబర్ 7, 8 తేదీల్లో సూర్యుడి నుంచి రెండు భారీ అయస్కాంత క్షేత్రాలు, విద్యుదావేశిత కణాలతో కూడిన పదార్థ మేఘాలు (సౌర జ్వాలలు) అంతరిక్షంలోకి విడుదలయ్యాయి. వీటిని శాస్త్రీయంగా కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (CMEs) అంటారు. ఈ రెండు సౌర జ్వాలలు తమ ప్రయాణంలో ఒకదానితో మరొకటి కలిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇవి భూమిని చేరినప్పుడు గ్రహం చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేయవచ్చు. వీటిలో రెండో వేగంగా భూమి వైపు దూసుకొస్తోంది. అయితే, భూమిని తాకేలోగా అది మొదటి జ్వాలతో విలీనమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ సౌర తుఫాను ప్రభావంతో ఆకాశంలో రంగురంగుల కాంతులు కనిపించే అవకాశం ఉంది. వీటిని అరోరాలు అంటారు. సూర్యుడి నుంచి వచ్చిన సౌర జ్వాలలు భూమి పై వాతావరణంలోని వాయువులతో చర్య జరిపినప్పుడు ఈ కాంతులు ఏర్పడతాయి. సాధారణంగా ధ్రువ ప్రాంతాల్లో కనిపించే ఈ కాంతులు, తుఫాను తీవ్రతను బట్టి ఇతర ప్రాంతాల్లోనూ కనిపించవచ్చు. మరోవైపు, ఉపగ్రహాల పనితీరు, రేడియో సంకేతాలు, ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ ఖచ్చితత్వంపై ప్రభావం పడే అవకాశం ఉంది. బలమైన భూ అయస్కాంత తుఫానులు విద్యుత్ ప్రసార వ్యవస్థల్లోనూ సమస్యలు సృష్టించవచ్చు. అయితే, ప్రతి సౌర తుఫానూ ఇలాంటి అంతరాయాలకు కారణం కాదు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం.. అక్టోబర్ 11న (ఆదివారం) మధ్యస్థాయి G2 భూ అయస్కాంత తుఫాను సంభవించే అవకాశం ఉందని అమెరికా వాతావరణ సంస్థ (నోవా) పేర్కొంది. అయితే, ఇది ఒక ముందస్తు హెచ్చరిక మాత్రమే. తుఫాను వాస్తవ తీవ్రత, భూమి అయస్కాంత క్షేత్రంతో సౌర పదార్థం ఎలా పరస్పర చర్య జరుపుతుందనే అంశాలపై ప్రభావాలు ఆధారపడి ఉంటాయి.
భూమిని శక్తిమంతమైన సౌర తుపాను తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో.. భారతదేశంలో భారీ విద్యుత్ కోతలు లేదా కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోతాయని చెప్పడానికి ప్రస్తుతం ఆధారాలు లేవు. భూమి వాతావరణం, అయస్కాంత క్షేత్రం మనకు సహజ రక్షణ కల్పిస్తాయి. కాబట్టి ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. శాస్త్రవేత్తలు మాత్రం సూర్యుడి నుంచి వస్తున్న పదార్థాన్ని, దాని ప్రభావాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
