US Immigration Rules: భారతీయ ఐటీ నిపుణులకు US బిగ్ షాక్.. హెచ్-1బీ నిబంధనలు కఠినతరం.. ఎల్-1, ఓ-1 వీసాలు సేఫ్ ఏనా?
అమెరికా ఇమ్మిగ్రేషన్ (US Immigration Rules)నిబంధనలను కఠినతరం చేస్తుండటంతో, ఐటీ సంస్థలు, భారతీయ ఐటీ నిపుణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
US h1b visa restrictions tighten l1 o1 visas alternative options for indian professionals
US Immigration Rules: అమెరికాలో ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను రోజురోజుకూ మరింత కఠినతరం చేస్తుండటంతో, ఐటీ సంస్థలు, భారతీయ ఐటీ నిపుణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ Vance సాంకేతిక రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలు హెచ్-1బీ (US Immigration Rules) వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహా పలు సంస్థలపై పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) ప్రోగ్రామ్‌ను నిలిపివేయడంతో, భారతీయులు ఇప్పుడు అమెరికాలో పనిచేసేందుకు ఇతర ప్రత్యామ్నాయ వీసా మార్గాలైన ఎల్-1, ఓ-1 ల వైపు దృష్టి సారిస్తున్నారు.
ఎల్-1 వీసా.. మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగులకు అంతర్గత బదిలీల అవకాశం:
బహుళజాతి సంస్థల్లో పనిచేసే అర్హులైన ఉద్యోగులను అమెరికాలోని తమ అనుబంధ కార్యాలయాలకు బదిలీ చేసేందుకు ఎల్-1 వీసా ఉపయోగపడుతుంది. ఇందులో ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్ల కోసం ఎల్-1ఏ, ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కోసం ఎల్-1బీ కేటగిరీలు ఉన్నాయి. అయితే ఇది కేవలం సదరు బహుళజాతి సంస్థల్లో అంతర్గత బదిలీల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి అందరు ఉద్యోగులకు ఇది వర్తించదు.
ఓ-1 వీసా.. అత్యున్నత ప్రతిభావంతులకు మాత్రమే సొంతం:
మరోవైపు ఓ-1 వీసా అనేది సైన్స్, విద్య, బిజినెస్, కళలు వంటి రంగాలలో అసాధారణమైన ప్రతిభ, ప్రత్యేక రికార్డులను నిరూపించుకున్న నిపుణులకు మాత్రమే లభిస్తుంది. దీనికి ఏ కంపెనీ అంతర్గత బదిలీతో పనిలేనప్పటికీ, అర్హత ప్రమాణాలు చాలా కఠినంగా ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఓ-1 వీసా పొందే స్థాయిలో అత్యుత్తమ ప్రొఫెషనల్ రికార్డు ఉన్నవారు చాలా తక్కువ మందే ఉంటారు.
కేవలం వీసా మాత్రమే కాదు.. కెరీర్ ప్రణాళికే కీలకం:
ఈ రెండు వీసాలూ హెచ్-1బీకి పూర్తి ప్రత్యామ్నాయాలు లేదా సులువైన షార్ట్కట్లు కావని విద్యా, ఇమ్మిగ్రేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం వీసా పొందడమే కాకుండా అమెరికాలో హోదా, జీతం, జీవన వ్యయం, దీర్ఘకాలిక ఇమ్మిగ్రేషన్ భవిష్యత్తును బేరీజు వేసుకోవాలని వారు సూచిస్తున్నారు. సరైన అర్హతలు, ప్రణాళిక ఉన్నవారికే ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ప్రయోజనకరంగా మారతాయని స్పష్టమవుతోంది.
