South Africa Mass Shootings : దక్షిణాఫ్రికాలో మారణహోమం.. రెండు చోట్ల కాల్పులు.. 27 మంది మృతి

South Africa Mass Shootings : దక్షిణాఫ్రికాలో మరోసారి భారీ కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. రెండు ప్రాంతాల్లో జరిపిన కాల్పుల్లో 27మంది మరణించారు.

South Africa Mass Shootings

South Africa Mass Shootings : దక్షిణాఫ్రికాలో మరోసారి భారీ కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. దేశంలోని రెండు ప్రధాన నగరాలైన జోహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్ సమీపంలో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది గాయపడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also Read : KTR : రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది.. అందరి లెక్కలు తేల్చుతాం.. కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

జోహన్నెస్‌బర్గ్‌కు నైరుతి దిశలోని వెడెలా టౌన్‌షిప్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. సుమారు రాత్రి 9.30 గంటల సమయంలో ఎనిమిది మంది సాయుధులు ఏకే-47 రైఫిళ్లు, పిస్టళ్లతో ఓ బార్‌లోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. మొదట బార్ బయట కూర్చున్న వారిపై కాల్పులు జరిపిన దుండగులు.. ఆ తర్వాత లోపలికి వెళ్లి కూడా కాల్పులు కొనసాగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది పురుషులు, నలుగురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కాల్పుల అనంతరం దుండగులు కొంతమంది బాధితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్లు తీసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం రెండు గుర్తుతెలియని వాహనాల్లో అక్కడి నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు. వెళ్లే ముందు ఆ వాహనాలకు నిప్పు పెట్టినట్లు సమాచారం.

జోహన్నెస్‌బర్గ్ ఘటన జరిగిన కొన్ని గంటలకే కేప్‌టౌన్ సమీపంలోని లాండ్లే టౌన్‌షిప్‌లో మరో భారీ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో ఓ వినోద కేంద్రం/స్టోర్ వద్ద దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలోనూ పలువురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అయితే, రెండు కాల్పుల ఘటనల్లో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. వరుస కాల్పుల నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.