South Korean President arrested
South Korean: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్ట్ అయ్యాడు. బుధవారం తెల్లవారు జామున పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. నివేదిక ప్రకారం.. బుధవారం ఉదయం వందలాది మంది పోలీసులు అధ్యక్షుడు యోల్ నివాసానికి చేరుకున్నారు. అతను కొన్ని వారాలుగా తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో ఇక్కడే ఉంటున్నాడు. అయితే, పోలీసులను ఇంట్లోకి వెళ్లకుండా యున్ సుక్ యోల్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీనికితోడు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకోవటంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులు నిచ్చెన ఉపయోగించి యోల్ నివాసంలోకి ప్రవేశించి అతన్ని అరెస్టు చేశారు.
పోలీసులు అరెస్టు చేసిన తరువాత ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. తనపై ప్రారంభించిన దర్యాప్తు చట్టవిరుద్ధమని, అక్రమ విచారణ అయినప్పటికీ పోలీసుల ఎదుట హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఘర్షణలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని యూన్ సుక్ యోల్ తెలిపారు. ఇదిలాఉంటే. గతంలో యోల్ ను అరెస్టు చేసేందుకు ఓసారి ప్రయత్నం జరిగింది. దీంతో పెద్దెత్తున ఉద్రిక్తతలు చోటుచేసుకోవటంతో ఆయన్ను అరెస్టు చేయలేక పోయారు. అయితే, ఈసారి కూడా ఆయన నివాసం వద్దకు మద్దతుదారులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు లోపలికి వెళ్లి ఆయన్ను అరెస్టు చేశారు. అనంతరం భారీ భద్రత నడుమ ఆయన్ను అక్కడి నుంచి తీసుకెళ్లారు.
అరెస్ట్ ఎందుకంటే?
ప్రతిక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ గతేడాది డిసెంబర్ నెలలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీ మార్షల్ లా విధించారు. అయితే, దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తన ప్రకటనను యోల్ విరమించుకున్నాడు. కానీ, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే, మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని, ఆయన వెంటనే అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు జాతీయ అసెంబ్లీలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి.
అభిశంసన తీర్మాణానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా.. 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన అభిశంసనకు గురై అధ్యక్ష అధికారులను కోల్పోయారు. మరోవైపు ఎమర్జెన్సీ మార్షల్ లా విధించడంపై విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో దర్యాప్తు అధికారులు పలుసార్లు యూన్ సుక్ యోల్ కు సమన్లు జారీ చేశారు. వాటికి ఆయన స్పందించలేదు. దీంతో దర్యాప్తు అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఆ తరువాత అరెస్టు వారెంట్ జారీ అయింది. ఈ నేపథ్యంలో ఆయన్ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.