‘స్పేస్ ప్రైవేటైజేషన్’.. అంతరిక్షయానం.. సామాన్యుల కల నెరవేరబోతుందా?! 

  • Publish Date - June 25, 2020 / 04:29 PM IST

ఇప్పుడు కోట్లాది డాలర్ల రాబడినిచ్చే కమర్షియల్ శాటిలైట్ లాంచింగ్స్, కాసుల వాన కురిపించే స్పేస్ టూరిజం, అంతరిక్షంలో తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత బంగారం, ప్లాటినం’ ఆలోచనతో తెరపైకొస్తున్న ఆస్టరాయిడ్ మైనింగ్, త్వరలో చంద్రుడు, అంగారక గ్రహాలపై జనావాసాల నిర్మాణం… ఇలా అంశమేదైనా ‘స్పేస్ ప్రైవేటైజేషన్’ మాత్రం జోరు మీదుంది! అంతరిక్షయానం.. ఇన్నాళ్లు అదో కలకలం ప్రపంచం. దేశాల ప్రభుత్వాల సంస్థలతోనే అంతరిక్షంలోకి వెళ్లాల్సి ఉంటుంది.

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇప్పటికే అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేటు సంస్థలు భాగస్వాములుగా వచ్చి చేరాయి. ఓ ప్రైవేట్ కంపెనీ స్పేస్ ఎక్స్ పేరుతో ప్రపంచంలోనే తొలిసారి ప్రైవేటు అంతరిక్షయానాన్ని చేపట్టింది. రాబోయే రోజుల్లో అంతరిక్ష ప్రయోగాల్లో పెట్టుబడులు విస్తరించేందుకు.. కొత్త అన్వేషణలు చేసేందుకు.. సామాన్యులు సైతం విమానమెక్కినట్టు అంతరిక్షంలోకి వెళ్లగలిగేందుకు ఈ ఘట్టం దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థ వ్యవస్థాపకులు ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఈ తొలి ప్రైవేటు అంతరిక్ష యాత్ర చేపట్టింది. క్రూ డ్రాగన్ అనే మానవ సహిత క్యాప్సూల్‌ను ప్రయోగించారు. ఇందులో ఇద్దరు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించారు. 

మొదటి ప్రైవేటు సంస్థగా స్పేస్ ఎక్స్ :
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.  స్పేస్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడంలో బాగంగా నాసా ఈ ప్రైవేట్ కంపెనీలకు అవకాశం ఇచ్చింది. స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన వాహన నౌక భూ వాతావరణాన్ని దాటి అంతరిక్షంలోకి చేరడానికి 12 నిమిషాల సమయం పట్టింది. ఆ గడువు విజయవంతంగా ముగియడంతో అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన మొదటి ప్రైవేటు సంస్థగా స్పేస్ ఎక్స్ నిలిచింది. వీరి ప్రయాణానికి దాదాపు 19 గంటలు పట్టింది. ఇప్పుడు స్పేస్ లోకి.. ఆ తర్వాత రాబోయే రోజుల్లో చంద్రుడిపైకి.. ఆ తర్వాత మార్స్ పైకి వెళ్లేందుకు స్పేస్ ఎక్స్ ప్రణాళికలు చేస్తోంది.

స్పేస్ ఎక్స్‌కు, ఇస్రో ఒకేలా :
స్పేస్ ఎక్స్‌కు, ఇస్రోకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. రెండూ ఏకీకృత వ్యవస్థను కలిగి ఉన్నాయి. వాణిజ్యపరంగా లభించే చాలా చిన్న వస్తువులు లేదా భాగాలు మాత్రమే ఉపయోగిస్తాయి. ఇన్నేళ్లుగా ఇస్రో అనుసరిస్తున్నది ఇదే. నాసా మోడల్తో పోల్చితే ఖర్చు తగ్గింపునకు దారితీసిన ఏకైక అంశం ఇదేనని స్పేస్-ఎక్స్ పేర్కొంది. స్పేస్-ఎక్స్ దాదాపు 800 మిలియన్లను అభివృద్ధి వ్యయంగా ఖర్చు చేసింది. కిలోకు 11,000 డాలర్ల చొప్పున ఖర్చు చేసింది. భారతదేశంలో GSLV Mk-3 ఒకే తరగతికి చెందినది. స్పేస్ ఎక్స్ అభివృద్ధి వ్యయం సుమారు 300 మిలియన్ డాలర్లు. పేలోడ్ డెలివరీ ఖర్చు కిలోకు 5,000 డాలర్లు. ఇది అమెరికాలో ఇతర పోటీదారులు గానీ, నాసా ఖర్చుతోగానీ పోల్చి చూస్తూ సగం కంటే తక్కువ అని స్పేస్ ఎక్స్ చెబుతోంది. ఇప్పటికే స్పేస్ ఎక్స్ ఒక బిలియన్ డాలర్ల ఆర్డర్లు సంపాదించుకుంది. 

వైజ్ఞానిక ప్రపంచంలో ప్రగతిశీల పరిణామాలు సంభవించినప్పుడు ఆహ్వానించాల్సిందే. మేడిన్ ఇండియా స్పేస్ షటిల్‌కు శైశవ దశ లాంటి రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్‌ను ఇస్రో విజయవంతంగా పరీక్షించడం భారతీయులు గర్వించదగ్గ విషయం. ఈ స్వదేశీ పునర్వినియోగ వాహకనౌక పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరో దశాబ్దం పడుతుంది. ఇదే సమయంలో రీయూజబుల్ రాకెట్ సైన్స్ లో అమెరికా కేంద్రంగా వస్తున్న వినూత్న మార్పులు ఇస్రోకు గట్టి సవాళ్లు విసరబోతున్నాయి. ఏరోస్పేస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌కు నిధుల కేటాయింపు పరంగా నేడు పెద్ద దేశాల ప్రభుత్వాలు సైతం వెనక్కు తగ్గుతున్నాయి. 

గ్లోబల్ స్పేస్ ఇండస్ట్రీ కోసం ప్రైవేటు సంస్థల పోటీ :
మరోవైపు భారీ పెట్టుబడులు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌తో గ్లోబల్ స్పేస్ ఇండస్ట్రీని ఏలడానికి ప్రైవేటు సంస్థలు పోటీ పడుతున్నాయి. కోట్లాది డాలర్ల రాబడినిచ్చే కమర్షియల్ శాటిలైట్ లాంచింగ్స్, కాసుల వాన కురిపించే స్పేస్టూరిజం వైపు ఆ సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, హబుల్ స్పేస్ టెలిస్కోపుల వంటివి దిగువ కక్ష్య నుంచి, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు భూ స్థిర కక్ష్య నుంచి సేవలందిస్తున్నాయి. కార్గో, వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి, ఉపగ్రహాల్ని రకరకాల కక్ష్యలకు చేర్చాలన్నా, గ్రహాంతర పరిశోధనల కోసం ల్యాండర్లు, రోవర్లు, ఇతర ప్రోబ్స్ను ప్రయోగించాలన్నా.. కార్మన్ లైన్ దాటాలి. భూమ్యాకర్షణ శక్తిని ఛేదిస్తూ వినువీధికి దూసుకెళ్ల గల ప్రచోదన శక్తి రాకెట్లకే సాధ్యం. 

ఇస్రో ఉపయోగిస్తున్న పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, అమెరికన్ అట్లాస్, డెల్టా.. రష్యన్ సోయజ్, ప్రోటాన్… యూరోపియన్ ఏరియన్, చైనీస్ లాంగ్ మార్చ్.. ఇలా ఇవాళ ఉన్నవన్నీ ఎక్స్పెండబుల్ రాకెట్లే. ఒకసారి ప్రయోగానంతరం ఇవి మళ్లీ పనికి రాకుండా కూలిపోతాయి. దీంతో బోలెడు సొమ్ము వృథా అవుతోంది. పదే పదే వినియోగించగల రాకెట్ల తయారీతో ఈ వ్యయాన్ని తగ్గించి చౌకగా రోదసిని అందుకునే ఉద్దేశంతో పునర్వినియోగ వాహక నౌకల టెక్నాలజీ ఆవిర్భవించింది. ఇక రాబోయే ఆర్ఎల్వీల జాబితా చాలా ఎక్కువగానే ఉంది. 

నాసా ప్రభుత్వపరమైన ఉపగ్రహ ప్రయోగాలను, అంతరిక్ష కేంద్రానికి ఆస్ట్రోనాట్స్ను పంపే కాంట్రాక్టుల్ని ప్రైవేటు సంస్థలకు అప్పజెబుతోంది. రష్యా విషయానికొస్తే కొన్ని దశాబ్దాలుగా చెప్పుకోదగ్గ టెక్నలాజికల్ అప్డేట్స్ లేవు. నాసా స్పేస్ షటిల్స్ రిటైరయ్యాక తన సోయజ్ నౌకల్లో అంతరిక్ష కేంద్రానికి కార్గో, వ్యోమగాముల్ని పంపడానికే డబ్బు లేక రష్యా దిక్కులు చూస్తోంది. 22 యూరప్ దేశాలు ఉమ్మడిగా నెలకొల్పిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా నిధుల కోసం వెంపర్లాడుతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు సిలికన్ వ్యాలీ డాట్ కామ్ టెకీలు పునర్వినియోగ వాహక నౌక చరిత్రను తిరగరాశారు.

ఈ ఇద్దరే సమర్థులు : 
నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన రాకెట్‌ను మళ్లీ అదే తీరున నేలకు దింపి లాంచ్ప్యాడ్ గీసిన గిరిలో నిలబెట్టగల సమర్థులు. ఒకరు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ అధిపతి ఎలాన్ మస్క్ కాగా, రెండో వ్యక్తి ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్రీ బిజోస్. 2002లో కాలిఫోర్నియా కేంద్రంగా స్పేస్ ఎక్స్ను నెలకొల్పాడు మస్క్. 2040 నాటికి అంగారకుడిపై మానవ కాలనీల నిర్మాణం మస్క్ లక్ష్యం. సొంత రాకెట్ ఫాల్కన్ -9తో వాణిజ్యపరమైన ఉపగ్రహ ప్రయోగాలు స్పేస్ ఎక్స్ సంస్థ చేపడుతోంది. అలాగే నాసా కాంట్రాక్టులు పొంది తన ఫాల్కన్- 9, డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ సాయంతో అంతరిక్ష కేంద్రానికి సరుకులు చేరవేస్తోంది. 

 స్పేస్ఎక్స్‌కు స్పేస్ క్రాఫ్ట్‌ కాంట్రాక్టు : 
2017 నుంచి తమ వ్యోమగాముల్ని ఇదే రాకెట్.. స్పేస్ క్రాఫ్ట్‌ను తీర్చిదిద్దే కాంట్రాక్టును అది స్పేస్ఎక్స్‌కు కట్టబెట్టింది. ప్రయోగానంతరం భూమికి తిరిగొచ్చి లాంచ్ప్యాడ్పై నిట్టనిలువుగా దిగడం ఫాల్కన్-9 ప్రత్యేకత. నాసా అండదండలు పుష్కలంగా లభిస్తున్న ఈ సంస్థకు ప్రస్తుతం 70 కోట్ల డాలర్ల విలువైన 60 లాంచ్ కాంట్రాక్టులు చేతిలో ఉన్నాయి. 2015లో గూగుల్, ఫైడెలిటీ సంస్థలు స్పేస్ ఎక్స్ లో 100 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి 8 శాతం వాటా పొందాయి. అమెరికన్ మిలిటరీ నిఘా ఉపగ్రహాల లాంచింగ్ కాంట్రాక్టులు కూడా స్పేస్ ఎక్స్ ఖాతాలోనే పడుతున్నాయి.

యునైటెడ్ లాంచ్ అలయెన్స్, ఏరియన్ స్పేస్, ఇంటర్నేషనల్ లాంచ్ సర్వీసెస్… ఇవి ఇప్పటి దాకా గ్లోబల్ కమర్షియల్ స్పేస్ లాంచ్ మార్కెట్ను తమ గుప్పెట్లో బంధించిన మూడు శక్తిమంతమైన కన్సార్టియంలు. ఇప్పుడు ప్రపంచవ్యాప్త లాంచ్ మార్కెట్ను స్పేస్ ఎక్స్ కొల్లగొడుతున్న తీరు వీటి గుండెల్లో గుబులు రేపుతోంది. తమ కొత్త రాకెట్ ఫాల్కన్ హెవీ అందుబాటులోకొస్తే 6 మిలియన్ డాలర్లకే శాటిలైట్లను దిగువ కక్ష్యకు పంపుతామంటూ స్పేస్ ఎక్స్ సంస్థ ప్రకటిస్తోంది.