Rewind 2025: 2025లో విపరీతంగా వైరలైన 10 ఫొటోలు ఇవే..

దేశ, విదేశాల్లో కీలక ఘటనలు చోటుచేసుకున్నాయి.

Rewind 2025: 2025లో విపరీతంగా వైరలైన 10 ఫొటోలు ఇవే..

Updated On : December 17, 2025 / 12:20 PM IST

Rewind 2025: కొన్ని రోజుల్లో న్యూ ఇయర్‌ రాబోతుంది. 2025 ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ప్రపంచంలో ఎన్నో ఊహించని ఘటనలు చోటుచేసుకున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. ఇటువంటి టాప్-10 ఫొటోలను చూద్దాం..

పహల్గాం దాడి


ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగింది. ఉగ్రవాదులు బయసరణ్ లోయలోకి ప్రవేశించి పర్యాటకులను మతం అడిగి కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది మరణించారు. నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మృతదేహం పక్కన ఆయన భార్య హిమాన్షి నర్వాల్ నిశబ్దంగా కూర్చున్న ఫొటో బాగా వైరల్ అయింది.

ఆపరేషన్ సిందూర్.. ఇద్దరు మహిళా అధికారుల ఫొటోలు


పహల్గాం దాడికి ప్రతిగా పాక్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయటానికి భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ ప్రెస్ బ్రీఫింగ్ ప్రత్యేకంగా నిలిచింది. ఆర్మీకి చెందిన కర్నల్ సోఫియా ఖురేషి, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రపంచానికి ఈ ఆపరేషన్ గురించి వివరించారు.

శుభాంశు శుక్లా ఫొటో


భారత వైమానిక దళ టెస్ట్ పైలట్ శుభాంశు శుక్లా.. ఆక్సియమ్ మిషన్ 4లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా నిలిచారు. రాకేశ్ శర్మ (1984లో) తరువాత అంతరిక్షానికి వెళ్లిన రెండో భారత పౌరుడిగా ఆయన గుర్తింపు పొందారు.

వైట్‌హౌస్‌లో ట్రంప్‌, జెలెన్‌స్కీ 

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనిపై 2025 మార్చి 1న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వైట్ హౌస్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు నేతలు మీడియా ముందే మాటామాటా అనుకున్నారు.

భారత మహిళా క్రికెట్ జట్టు


భారత మహిళా క్రికెట్ జట్టు తొలి మహిళా ప్రపంచ కప్ కల నెరవేరింది. నవంబర్ 2న డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి కప్ సాధించింది. ఈ విజయం భారత మహిళా జట్టు దిగిన ఫొటో వైరల్ అయింది.

హ్యాండ్‌కఫ్స్‌తో అమెరికా నుంచి సొంత దేశానికి..


డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో జనవరిలో అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ వలసలపై కఠిన వైఖరి అవలంబించారు. అరెస్టయిన అక్రమ వలసదారులను స్వదేశాలకు భారీ స్థాయిలో పంపించారు. వారిని హ్యాండ్‌కఫ్స్‌తో సైనిక కార్గో విమానాల్లో తరలించారు.

జెన్ జీ ఉద్యమంతో నేపాల్ ప్రభుత్వ పతనం


సామాజిక మాధ్యమాలపై సంపూర్ణ నిషేధం విధించిన నేపథ్యంలో సెప్టెంబర్‌లో నేపాల్ అంతటా అవినీతి వ్యతిరేక నిరసనలు చెలరేగాయి. ఈ ఉద్యమాన్ని ప్రధానంగా జెన్ జెడ్ విద్యార్థులు, యువత నిర్వహించారు. హింసాత్మకంగా మారిన ఈ ఆందోళనల్లో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 9న అప్పటి ప్రధాని కేపీ ఒలీ శర్మ, పలువురు మంత్రులు రాజీనామా చేశారు. మూడు రోజుల తరువాత మాజీ న్యాయవాది సుషీలా కార్కి తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమితులయ్యారు.

హాంకాంగ్ అపార్ట్‌మెంట్లలో అగ్నిప్రమాదం


నవంబర్‌లో హాంకాంగ్‌లోని ఒక ఎత్తయిన భవన సముదాయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 159 మంది మరణించారు, వేలాది మంది నివాసాలు కోల్పోయారు. ఎనిమిది బ్లాకుల్లో సుమారు 2,000 అపార్ట్‌మెంట్లలో 4,600 మంది నివసించేవారు. పునరుద్ధరణ పనుల్లో వాడిన నెట్టింగ్ అగ్ని నిరోధక ప్రమాణాలు తీరకపోవటం ఒక కారణంగా పేర్కొన్నారు.

ఎయిర్ ఇండియా 171 విమాన ప్రమాదం


అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్‌కు జూన్ 12న వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171.. టేకాఫ్ అయిన 32 సెకన్లకే కూలిపోయింది. విమానంలో ఉన్న 230 మంది ప్రయాణికులు, 12 సిబ్బందిలో ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే బతికి బయటపడ్డాడు. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై పడింది. నేలపై మరో 19 మంది మరణించారు. 67 మంది తీవ్రంగా గాయపడ్డారు.

కరవు, ఆకలి.. గాజా దుస్థితి


ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం 2023 అక్టోబర్ 7న ప్రారంభమైంది. దశాబ్దాలుగా పరిష్కారంకాని ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య కారణంగా కొనసాగిన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ పరిస్థితులు.. గాజా ప్రాంతాన్ని ఈ సంవత్సరం ఆకలి సంక్షోభంలోకి నెట్టాయి.