Rewind 2025: డొనాల్డ్ ట్రంప్ నుండి శుభాంషు శుక్లా వరకు.. 2025లో వార్తల్లో నిలిచిన టాప్ 10 ప్రముఖులు వీరే..

భారత సైన్యంలో సీనియర్ అధికారి. కల్నల్ హోదాలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్‌లో భారతీయ బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందారు.

Rewind 2025: డొనాల్డ్ ట్రంప్ నుండి శుభాంషు శుక్లా వరకు.. 2025లో వార్తల్లో నిలిచిన టాప్ 10 ప్రముఖులు వీరే..

Updated On : December 18, 2025 / 4:39 PM IST

Rewind 2025: మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రాబోతోంది. 2025 ముగియబోతోంది. 2025 సంవత్సరం అనేక పెద్ద సంఘటనలు, వివాదాలతో నిండిపోయింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కేంద్ర బిందువుగా నిలిచారు. 2025 సంవత్సరంలో వార్తల్లో ప్రముఖంగా నిలిచిన 10 మంది వ్యక్తుల ఎవరెవరో తెలుసుకుందాం.

2025లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టి, ఇతర దేశాలపై అధిక సుంకాలను విధించ ద్వారా హైలైట్ అయ్యారు. శుభాంషు శుక్లా యాక్సియమ్ మిషన్ 4లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను సందర్శించిన రెండవ భారతీయ వ్యోమగామిగా నిలిచారు. భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ బ్రీఫింగ్‌కు సహ-నాయకత్వం వహించిన సోఫియా ఖురేషి, వ్యోమిక సింగ్ అనే ఇద్దరు మహిళా అధికారులు కూడా వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.

డొనాల్డ్ ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరిలో వైట్ హౌస్‌కు తిరిగి వచ్చినప్పటి నుండి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నారు. 78 ఏళ్ల ఈ రిపబ్లికన్ నాయకుడు పెద్ద ఎత్తున బహిష్కరణలను అమలు చేశారు. రష్యా నుండి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ సహా అనేక దేశాలపై శిక్షాత్మక సుంకాలను విధించారు. వెనిజులా డ్రగ్ పడవలపై దాడులకు ఆదేశించారు. రష్యా-యుక్రెయిన్ యుద్ధం, భారత్-పాకిస్తాన్ వివాదంతో సహా 8 ప్రపంచ సంఘర్షణలకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చినట్లు ట్రంప్ స్వయంగా చెప్పుకుంటారు.

ఎలాన్ మస్క్..
బిలియనీర్ ఎలాన్ మస్క్ తన వ్యాపారాలతోనే కాదు రాజకీయ వ్యాఖ్యానాలు, చట్టపరమైన వివాదాలు, వివాదాస్పద బహిరంగ ప్రకటనల కారణంగా నిరంతరం వార్తల్లో నిలిచారు. ట్రంప్ పరిపాలనలో కొత్త విభాగమైన DOGEకు నియమితులు కావడంతో మస్క్ ఈ సంవత్సరం ప్రారంభంలో వెలుగులోకి వచ్చారు. అయితే, ఆ పదవి తనకు చాలా నష్టాన్ని కలిగిస్తోందని, తన వ్యక్తిగత వ్యాపారాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి, మే నెలలో ఆయన ఆకస్మికంగా ఆ పదవి నుండి వైదొలిగారు.

మరియా కొరినా మచాడో..
మరియా కొరినా మచాడో.. ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కించుకున్నారు. వెనిజులా పార్లమెంట్ సభ్యురాలు మరియా.. దేశ ప్రజల హక్కుల కోసం చేసిన అవిశ్రాంత పోరాటం ఫలితంగానే ఆమెకు ఈ నోబెల్ బహుమతి దక్కింది. వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషి.. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత పరివర్తన కోసం ఆమె చేసిన పోరాటానికి గాను ఈ అరుదైన గౌరవం లభించింది. ఇక మరియా కొరినా మచాడోను వెనిజులా ఉక్కు మహిళ అని కూడా పిలుచుకుంటారు. వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో ఈ సంవత్సరం ప్రధాన వ్యక్తిగా నిలిచారు. ఆమె విజయం దేశంలో కొనసాగుతున్న సంక్షోభాన్ని వెలుగులోకి తెచ్చింది. నిరంకుశత్వం, మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రజాస్వామ్య తిరోగమనంపై అంతర్జాతీయ పరిశీలనను పునరుద్ధరించింది.

షేక్ హసీనా..

2024 జూలైలో బంగ్లాదేశ్‌లో చెలరేగిన విద్యార్థుల తిరుగుబాటును అణచివేసేందుకు.. మారణాయుధాలను ఉపయోగించి విద్యార్థి నిరసనకారులను చంపడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ట్రైబ్యునల్ మరణశిక్ష విధించింది. ఇది ఆమె అవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి దారితీసింది. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ హసీనాను మూడు అభియోగాలపై దోషిగా నిర్ధారించింది. ప్రేరేపించడం, చంపడానికి ఆదేశించడం, రాగతాలను నివారించడానికి చర్య తీసుకోకపోవడం. ఆమెను పరారీలో ఉన్న మహిళగా కూడా ప్రకటించారు. 78ఏళ్ల మాజీ ప్రధానమంత్రి హసీనా.. ఆగస్టు 5, 2024 నుండి భారత్ లో తలదాచుకుంటున్నారు. వేలాది మంది నిరసనకారులు ఢాకాలోని ఆమె నివాసం వైపు కవాతు చేసి ఆమెను పదవీచ్యుతురాలిని చేశారు. అలా ఆమె 15 సంవత్సరాల సుదీర్ఘ పదవీకాలం ముగిసింది.

సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్..
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరిగిన ఖచ్చితమైన సైనిక దాడి.. ‘ఆపరేషన్ సిందూర్’పై భారత్ నిర్వహించిన మొదటి బ్రీఫింగ్‌కు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అనే ఇద్దరు మహిళా అధికారులు సహ నాయకత్వం వహించారు.

వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో విశిష్ట హెలికాప్టర్ పైలట్. ఆమె నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో చేరారు. ఇంజనీరింగ్ పూర్తి చేశారు. డిసెంబర్ 18, 2019న వింగ్ కమాండర్ సింగ్ ఫ్లయింగ్ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్ పొందారు.

సోఫియా ఖురేషి భారత సైన్యంలో సీనియర్ అధికారి. కల్నల్ హోదాలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్‌లో భారతీయ బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందారు.

శుభాంషు శుక్లా..
1984లో రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి ప్రయాణించిన రెండవ భారతీయుడిగా నిలిచిన వ్యోమగామి శుభాంషు శుక్లా ఈ సంవత్సరం అత్యంత ప్రముఖ వార్తా వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. యాక్సియమ్ మిషన్ 4 గ్రూప్ కెప్టెన్‌గా..అంతతరిక్ష జీవశాస్త్రం, ఆరోగ్యం, సుస్థిరతపై దృష్టి సారించి అనేక ప్రయోగాలను నిర్వహించారు.

అక్టోబర్‌లో జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా సనాయ్ తకైచి చరిత్ర సృష్టించారు. అయితే, ఆశ్చర్యకరంగా పురుషాధిక్యత ఉన్న మంత్రివర్గం ​​లింగ సమానత్వంలో వెనుకబడి ఉన్న ఆ దేశంలోని కొంతమంది మహిళలను సందిగ్ధంలో పడేసింది. దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, రక్షణ వంటి ప్రధాన సమస్యలపై చర్చలు, నిర్ణయాలకు దూరంగా ఉన్నప్పుడు, తకైచి హెవీ మెటల్ డ్రమ్స్ వాయిస్తారు. ప్రజా జీవితంలోని ఒత్తిళ్లు అధికమైనప్పుడు, ఉపశమనం పొందడానికి ఆమె తన ఇంట్లోని ఎలక్ట్రానిక్ డ్రమ్ కిట్‌ను ఉపయోగిస్తారు.

పోప్ లియో- XIV..

రోమన్ కాథలిక్ చర్చికి కొత్త పోప్‌ గా అమెరికాకు చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్ ఎన్నికయ్యారు. అమెరికా నుండి పోప్‌గా ఎన్నికైన తొలి వ్యక్తిగా రాబర్ట్ ప్రాన్సిస్‌ రికార్డ్ సృష్టించారు. కొత్తగా ఎన్నికైన పోప్‌కు.. పోప్ లియో- XIVగా నామకరణం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ మరణానంతరం ఆయన ఎన్నికయ్యారు.

సమయ్ రైనా..
ఈ సంవత్సరం ప్రారంభంలో హాస్యనటుడు సమయ్ రైనా ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. అతడిపై అనేక ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. పోలీసులు, సైబర్‌సెల్ సమన్లు ​​జారీ చేయడంతో అది పెద్ద వివాదానికి కేంద్రంగా మారడంతో వార్తల్లో నిలిచాడు. ఫలితంగా అతను తన యూట్యూబ్ ఛానెల్ నుండి ఆ షో కు సంబంధించిన అన్ని ఎపిసోడ్‌లను తొలగించాడు.

టేలర్ స్విఫ్ట్..

గాయని టేలర్ స్విఫ్ట్ ఎరాస్ టూర్ అధికారికంగా అత్యధిక వసూళ్లు చేసిన కచేరీ టూర్‌గా ప్రకటించబడింది. ఆమెను 2025లో అతిపెద్ద వార్తల్లోని ప్రముఖ వ్యక్తిని చేసింది. ఈ పర్యటనలో ఐదు ఖండాలలో 149 ప్రదర్శనలు ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులను ఆకర్షించింది. దాదాపు 2 బిలియన్ల డాలర్లు వసూలు చేసింది.

Also Read: బ్లూ డ్రమ్ మర్డర్ నుంచి ఇరాన్ బ్లాక్ విడో వరకు.. 2025లో ప్రపంచాన్ని కుదిపేసిన టాప్-5 నేరాలు, ఘోరాలు..