Rewind 2025 Crimes: బ్లూ డ్రమ్ మర్డర్ నుంచి ఇరాన్ బ్లాక్ విడో వరకు.. 2025లో ప్రపంచాన్ని కుదిపేసిన టాప్-5 నేరాలు, ఘోరాలు..

పోలీసుల విచారణలో షాకింగ్ విషయం బయటపడింది. అసూయతోనే విధిని మేనత్త సోనమ్ హత్య చేసినట్లు తేలింది.

Rewind 2025 Crimes: బ్లూ డ్రమ్ మర్డర్ నుంచి ఇరాన్ బ్లాక్ విడో వరకు.. 2025లో ప్రపంచాన్ని కుదిపేసిన టాప్-5 నేరాలు, ఘోరాలు..

Updated On : December 18, 2025 / 12:11 AM IST

Rewind 2025 Crimes: మరికొన్ని రోజుల్లో 2025 సంవత్సరం ముగియనుంది. కొత్త ఏడాదిలోకి వెళ్లబోతున్నాం. 2026 రాబోతోంది. కాగా, 2025 ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ ఏడాదిలో చోటు చేసుకున్న కొన్ని క్రైమ్ ఇన్సిడెంట్లు యావత్ ప్రపంచాన్ని కుదిపేశాయి. ప్రజలకు ఉలిక్కిపడేలా చేశాయి.

మేఘాలయలో హనీమూన్ సమయంలో జరిగిన హత్య, మీరట్‌లో బ్లూ (నీలి రంగు) డ్రమ్ములో మృతదేహాన్ని సీల్ చేయడం, లూవర్‌లో జరిగిన 102 మిలియన్ డాలర్ల దోపిడీ… ఇలా 2025లో అత్యంత దిగ్భ్రాంతికరమైన కొన్ని నేరాలు చోటు చేసుకున్నాయి. ఈ సంవత్సరం వార్తల్లో నిలిచిన ఐదు కేసుల వివరాలు తెలుసుకుందాం..

బ్లూ డ్రమ్ మర్డర్..

మీరట్‌లో అత్యంత భయంకరమైన క్రైమ్ ఇన్సిడెంట్.. బ్లూ డ్రమ్ లో మృతదేహాన్ని సీల్ చేయడం. పుట్టినరోజు వేడుక కోసం ఇంటికి వచ్చిన నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్.. భార్య చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.

సౌరభ్.. 2016లో ముస్కాన్ రాస్తోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెతో ఎక్కువ సమయం గడపడానికి అతను తన ఉద్యోగాన్ని కూడా వదిలేశారు. ఆ తర్వాత తన చిన్న కుమార్తెను పోషించడానికి మళ్లీ నేవీలో చేరారు. ఆ సమయంలో ముస్కాన్.. సౌరభ్ స్నేహితుడు సాహిల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఫిబ్రవరిలో తన కుమార్తె 6వ పుట్టినరోజు వేడుక జరుపుకోవడానికి సౌరభ్ ఇంటికి వచ్చాడు. ఇదే అదనుగా సాహిల్, ముస్కాన్ అతన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. మార్చి 4న రాత్రి.. సౌరభ్ భోజనంలో నిద్రమాత్రలు కలిపింది ముస్కాన్. అతను స్పృహ కోల్పోయిన తర్వాత, ఆమె సాహిల్ కలిసి సౌరభ్ ను కత్తితో పొడిచి చంపారు. శరీరాన్ని ముక్కలుగా నరికారు. వాటిని ఒక బ్లూ డ్రమ్ములో పెట్టి సిమెంటుతో మూసేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, వారు సౌరభ్ ఫోన్‌తో మనాలికి ప్రయాణించి, అతను ఇంకా బతికే ఉన్నట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశారు.

కాగా, తన తండ్రి డ్రమ్‌లో ఉన్నాడని సౌరభ్ కూతురు ఇరుగు పొరుగు వారికి చెబుతూ ఉండేది. దీంతో ఆ చిన్నారికి సౌరభ్ హత్య గురించి తెలిసి ఉండొచ్చని తెలుస్తోంది. ఇక, ముస్కాన్ తల్లి పోలీసులను ఆశ్రయించింది. తన కుమార్తె సౌరభ్‌ను చంపినట్లు తమతో ఒప్పుకుందని చెప్పడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో ముస్కాన్, సాహిల్ నేరాన్ని అంగీకరించారు. ఆ డ్రమ్‌ను వారు ఎంత గట్టిగా సీల్ చేశారంటే.. దాన్ని తెరవడానికి మార్చురీ సిబ్బంది ఇండస్ట్రియల్ (పారిశ్రామిక) డ్రిల్స్ ఉపయోగించాల్సి వచ్చింది.

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు..

పెళ్లయిన 12 రోజులకే.. హనీమూర్ పేరుతో తీసుకెళ్లి భర్తను భార్య చంపిన ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 30 ఏళ్ల రాజా రఘువంశీ తన భార్య సోనమ్‌తో కలిసి హనీమూన్ కోసం విమానంలో బయలుదేరాడు. అది వారిద్దరి ప్రశాంతమైన జీవితానికి నాంది కావాల్సింది. కానీ, అతను దారుణ హత్యకు గురయ్యాడు.

ఇండోర్‌కు చెందిన ముగ్గురు సోదరులలో చిన్నవాడైన రాజా.. బస్ ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ చేసేవాడు. సోనమ్ ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చింది. వీరి పెళ్లిని పెద్దలు కుదిర్చారు. అయితే, పెళ్లికి ముందే సోనమ్ కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తన కుటుంబ వ్యాపారంలో మాజీ ఉద్యోగి అయిన రాజ్ కుష్వాహాతో రిలేషన్ పెట్టుకుంది. పెళ్లి తర్వాత కూడా రిలేషన్ కొనసాగించింది. అయితే, పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంతో రాజాను వివాహం చేసుకుంది. రాజాను వివాహం చేసుకున్నా ఆమె మనసులో రాజ్ అలానే ఉన్నాడు. దాంతో ఆమె తన ప్రియుడితో కలిసి భర్త మర్డర్‌కు ప్లాన్ చేసింది. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లింది. అక్కడ భర్తను చంపి, దాన్ని ఒక ప్రమాదంలా చిత్రీకరించడానికి సోనమ్, రాజ్ ప్రణాళిక వేశారు.

ముందుగా షిల్లాంగ్‌లో మర్డర్ చేసేందుకు ప్రయత్నించారు. అది ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత సోహ్రాలో ప్రయత్నించి విఫలమయ్యారు. మే 23న నాలుగో ప్రయత్నం ఫలించింది. ముగ్గురు కిరాయి హంతకులు వెయ్ సావ్‌డాంగ్ జలపాతం సమీపంలో రాజాపై కత్తులతో దాడి చేశారు. అతని మృతదేహాన్ని ఒక లోయలోకి విసిరేశారు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. రాజా హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత, సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని ఒక దాబాలో కనిపించగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కుష్వాహా, కిరాయి హంతకులను కూడా అరెస్ట్ చేశారు.

ఇరాన్ ‘బ్లాక్ విడో’..

కొంతమంది సీరియల్ కిల్లర్లు త్వరగా పట్టుబడతారు, మరికొందరు సంవత్సరాల తరబడి రహస్యంగా తమ నేరాలను కొనసాగిస్తారు. ఇది అలాంటి కేసే. వృద్ధులైన ఒంటరి పురుషులను వివాహం చేసుకుని వారిని హత్య చేసింది 56 ఏళ్ల కుల్తుమ్ అక్బరీ. అలా 22 సంవత్సరాలు తప్పించుకుని తిరిగింది. కనీసం 15 మర్డర్లు చేసింది. కానీ, ఎలాంటి అనుమానం రానివ్వలేదు. అవన్నీ సహజ మరణాలే అనుకున్నారు. వృద్ధాప్యం, మధుమేహం, అధిక రక్తపోటు వల్ల చనిపోయి ఉండొచ్చని అంతా భావించారు.

అక్బరీ ఆ పురుషులకు మధుమేహం మందుల్లో విషమిచ్చేది. అది పనిచేయకపోతే టవల్స్‌తో వారిని ఊపిరాడకుండా చేసి చంపేది. ప్రతి మరణం తర్వాత, వారి ఆస్తిని పొందేది. 82 ఏళ్ల ఘోలమ్రెజా బాబాయ్ మరణం తర్వాత ఆమె నేరాలు వెలుగులోకి వచ్చాయి. తన స్నేహితుడి తండ్రి కూడా అదే మహిళను వివాహం చేసుకుని, విషప్రయోగ ప్రయత్నం నుండి బయటపడ్డాడని అతని కొడుకు తెలుసుకున్నాడు. విచారణలో, అక్బరీ, “నేను ఎంతమందిని చంపానో నాకు తెలియదు. బహుశా అది 13 లేదా 15 మంది కావొచ్చు” అని ఒప్పుకుంది. ఇరానియన్ మీడియా ఆమెకు “బ్లాక్ విడో” అని పేరు పెట్టింది. ఆమె తన శిక్ష కోసం ఎదురుచూస్తోంది. ఉరిశిక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది.

నిమిషాల వ్యవధిలో రూ.895 కోట్ల విలువైన నగలు చోరీ..

పారిస్‌లోని ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో అక్టోబర్‌లో భారీ దోపిడీ జరిగింది. ముసుగు ధరించిన నలుగురు వ్యక్తులు.. నిచ్చెన ఉపయోగించి, 2వ అంతస్తు బాల్కనీలోకి చొరబడి, కిటికీ కత్తిరించి లోనికి వెళ్లారు. 7 నిమిషాల వ్యవధిలో దాదాపు 102 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.895 కోట్లు) విలువైన వస్తువులు దొంగిలించారు. ఇందులో నెపోలియన్‌ కాలంనాటి తొమ్మిది వస్తువులు, ఆభరణాలు ఉన్నాయి. ఎంప్రెస్ యూజీని వజ్రాలు పొదిగిన కిరీటం, క్వీన్ మేరీ-అమెలీ ధరించిన నీలమణి, నెపోలియన్ I తన యువ వధువుకు ఇచ్చిన ఆభరణాలున్నాయి. చోరీ జరిగిన నెల రోజుల్లోనే అనుమానితులను అరెస్ట్ చేశారు, కానీ ఆభరణాలు ఇప్పటికీ కనిపించలేదు.