SpaceX : అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతం.. భూమిపై ల్యాండ్ అవ్వకుండానే రాకెట్ క్యాచ్.. వీడియో వైరల్
SpaceX Starship Midair Catch : వాస్తవానికి.. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన భారీ రాకెట్ తిరిగి భూమిపైకి వస్తుంది. కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రాకెట్ కిందకు దూసుకొచ్చి నేలను తాకకుండానే గాల్లో ఆగిపోయింది.
- Harish Thanniru
- Published on- November 15, 2026 / 11:31 AM IST
SpaceX Starship Midair Catch
SpaceX Starship Midair Catch : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అసాధ్యమనుకున్న ప్రయోగాన్ని సుసాధ్యం చేసింది. తద్వారా అంతరిక్ష ప్రయాణ చరిత్రలో సంచలనం సృష్టించింది.
Also Read : Madurai Gold Heist : సోషల్ మీడియాలో స్టార్.. స్నేహితుడికోసం భారీ దొంగతనం.. చివరికి దిమ్మతిరిగే ట్విస్ట్..
వాస్తవానికి.. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన భారీ రాకెట్ తిరిగి భూమిపైకి వస్తుంది. కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రాకెట్ కిందకు దూసుకొచ్చి నేలను తాకకుండానే గాల్లో ఆగిపోయింది. ఏదో అద్భుతం జరిగినట్లు రెండు భారీ యాంత్రిక చేతులు ఆ రాకెట్‌ను అమాంతం పట్టుకున్నాయి. చూస్తున్నవారిని విస్మయానికి గురిచేసే ఈ దృశ్యం నిజంగానే ఆవిష్కృతమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను స్పేస్ ఎక్స్ సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ అభివృద్ధి చేస్తున్న స్టార్‌షిప్ అంతరిక్ష నౌక నవంబర్ 14న చారిత్రాత్మక ఘనత సాధించింది. టెక్సాస్‌లోని స్పేస్‌ఎక్స్ స్టార్‌బేస్ కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ నౌక సుమారు 22 గంటలపాటు అంతరిక్షంలో ప్రయాణించి తిరిగి అదే ప్రయోగ కేంద్రానికి చేరుకుంది. ఈ క్రమంలో నేలపై దిగేందుకు బదులుగా ప్రయోగ వేదికపై ఏర్పాటు చేసిన భారీ యాంత్రిక చేతులు (మెకానికల్ ఆర్మ్స్) దాన్ని గాల్లోనే పట్టుకున్నాయి. స్పేస్‌ఎక్స్ ఈ అద్భుత దృశ్యాలను వీడియో రూపంలో విడుదల చేసింది. సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తన బృందాన్ని అభినందించారు. నాసా అధిపతి జారెడ్ ఐజాక్‌మన్ సైతం ఈ విజయంపై స్పందిస్తూ.. ఇది దాదాపు మాయాజాలంలా ఉందని ప్రశంసించారు.
ఈ ప్రయోగంలో స్టార్‌షిప్ మరో కీలక ఘనతను సాధించింది. భూమికి సుమారు 260 నుంచి 265 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ 14 సార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టింది. ఈ ప్రయాణంలో 26 అధునాతన స్టార్‌లింక్ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి విడుదల చేసింది. గత ప్రయోగంలో ఒకటి లేదా రెండు ప్రదక్షిణలు మాత్రమే చేసిన స్టార్‌షిప్.. ఈసారి 14 ప్రదక్షిణలు పూర్తి చేయడం విశేషం. అంతేకాకుండా అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే సమయంలో అత్యంత కీలకమైన హీట్ షీల్డ్ పనితీరు కూడా మెరుగ్గా ఉన్నట్లు స్పేస్‌ఎక్స్ తెలిపింది.
అయితే ఈ ప్రయోగంలో స్పేస్‌ఎక్స్ అనుకున్న రెండు విజయాలు ఒకేసారి సాధ్యం కాలేదు. స్టార్‌షిప్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన సూపర్ హెవీ బూస్టర్ తిరిగి వచ్చే క్రమంలో సమస్య ఎదురైంది. ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే దాని ఇంజిన్లు ముందుగానే పనిచేయడం ఆగిపోయాయి. దీంతో సరైన మార్గంలో తిరిగి రాలేకపోయిన బూస్టర్‌ను సముద్రం వైపు మళ్లించారు. అనంతరం అది గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పేలిపోయింది. ఈ ఘటనకు గల కారణాలను స్పేస్‌ఎక్స్ నిపుణులు పరిశీలిస్తున్నారు.
