US Flight Disruptions : అమెరికాలో విమానాలన్నీ బంద్.. ఒక్కసారిగా నిలిచిపోయిన వేలాది సర్వీసులు.. కారణాలివే..
US Flight Disruptions : అగ్రరాజ్యం అమెరికాలో విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
US Flight Disruptions
US Flight Disruptions : అగ్రరాజ్యం అమెరికాలో విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమాన రాకపోకలను నియంత్రించే వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. విమానాలు రద్దు కావడం, ఆలస్యంగా నడవడం, ఇతర విమానాశ్రయాలకు మళ్లించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read : Telangana Govt : తెలంగాణలోని రైతులకు శుభవార్త.. రూ.20 లక్షల వరకు సబ్సిడీ.. ఇక ఆ ఇబ్బందులకు చెక్..
అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) పరిధిలోని 22 ప్రాంతీయ విమాన రాకపోకల నియంత్రణ కేంద్రాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలో సమస్య ఏర్పడింది. విమానాశ్రయాల మధ్య ప్రయాణించే విమానాలను ఈ కేంద్రాలే పర్యవేక్షిస్తుంటాయి. అయితే టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లో అంతరాయం ఏర్పడటంతో విమానాల రాకపోకలకు అవసరమైన సమాచారం సక్రమంగా అందలేదు. దీంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎఫ్ఏఏ దేశవ్యాప్తంగా విమానాల బయలుదేరడంపై ఆంక్షలు విధించింది. అప్పటికే గాల్లో ఉన్న విమానాలను మాత్రం సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు అనుమతించారు.
ఈ అంతరాయం కారణంగా సుమారు 15 లక్షల మంది ప్రయాణికుల ప్రయాణ ప్రణాళికలు ప్రభావితమైనట్లు అంచనా. కనీసం 827 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించినట్లు సమాచారం. వీటిలో 670 విమానాలు తిరిగి బయలుదేరిన విమానాశ్రయాలకే చేరుకోగా.. మరో 157 విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. వేలాది విమానాలు రద్దు కావడం, ఆలస్యం కావడంతో విమానాశ్రయాల్లో రద్దీ పెరిగింది.
శుక్రవారం రాత్రి 8.15 గంటలకు (అమెరికా కాలమానం) ఎఫ్ఏఏ విమానాల బయలుదేరడంపై విధించిన దేశవ్యాప్త ఆంక్షలను ఎత్తివేసింది. అయితే విమాన సర్వీసులు వెంటనే సాధారణ స్థితికి రాలేదు. రద్దయిన విమానాలు, ఆలస్యమైన సర్వీసుల కారణంగా శనివారం కూడా ప్రయాణికులకు ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఈ ఘటనపై అమెరికా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నెట్వర్క్ రౌటర్లపై అధిక సమాచారం ఒత్తిడి ఏర్పడటంతో వ్యవస్థలో సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇది సైబర్ దాడి వల్ల జరిగినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు. అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ మాట్లాడుతూ.. కాలం చెల్లిన టెలికమ్యూనికేషనల్ మౌలిక సదుపాయాలు, ఓవర్లోడ్ స్విచ్లు, రూటర్ల కారణంగా సాంకేతిక వైఫల్యం నెలకొన్నట్లు తెలిపారు. విమాన రాకపోకల నియంత్రణ వ్యవస్థలోని పాత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునికీకరించాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైన నిధులు కేటాయించకపోతే భవిష్యత్తులోనూ ఇలాంటి అంతరాయాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
