Santander Bank
Bank Mistake: క్రిస్మస్ రోజున శాంతా గిఫ్ట్‌లు ఇవ్వడం మామూలే కదా? అలాగే శాంటాడర్ అనే బ్రిటీష్ బ్యాంకు కూడా దాదాపు 75వేల అకౌంట్లకు డబ్బులు పంపించింది. అయితే, గిఫ్ట్‌లుగా ఆ డబ్బును పంపలేదు.. పొరపాటున మాత్రమే ఆ బ్యాంకు డబ్బులను పంపింది.
పంపిన డబ్బు ఏదో కొంత కాదు.. 130మిలియన్ పౌండ్లు.. అంటే మన రూపాయల్లో దాదాపు రూ. 1307కోట్లు అన్నమాట. మొత్తం 75వేల కార్పోరేట్, కమర్షియల్ అకౌంట్లకు ఈ డబ్బును పంపించింది బ్యాంకు.. ఓ టెక్నికల్ ఎర్రర్ కారణంగా ఈ పొరపాటు జరిగినట్లు బ్యాంకు చెబుతోంది.
అయితే, ఇతర బ్యాంకులకు చెందిన అకౌంట్ హోల్డర్స్ నుంచి మాత్రం డబ్బును తిరిగి పొందడానికి బ్యాంకు తీవ్రంగా కష్టపడుతుంది. ఇతర బ్యాంకులకు చెందిన కస్టమర్లు కొంతమంది ఇప్పటికే క్రెడిట్ అయిన డబ్బును ఖర్చు చేసి ఉండడంతో ఓవర్‌డ్రాఫ్ట్ చేస్తే డబ్బులు తిరిగి రాకపోవచ్చునని భావిస్తోంది.
ఈ క్రమంలో శాంటాండర్ ప్రతి కస్టమర్‌ను వ్యక్తిగతంగా సంప్రదించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే శాంటండర్ డబ్బులు వేసిన కస్టమర్లకు ప్రత్యేకంగా ఈ-మెయిళ్లను కూడా రాసింది. “టెక్నికల్ సమస్య కారణంగా, మా కార్పొరేట్ క్లయింట్‌ల నుంచి కొన్ని ట్రాన్సాక్షన్లు తప్పుగా పడ్డాయి. అందుకు మమ్మల్ని క్షమించండి.. రాబోయే రోజుల్లో ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాము.” అంటూ ఆ మెయిల్‌లో ఉంది.
ఇక తప్పు శాంటాండర్‌దే అయినా.. చట్టప్రకారం తప్పుగా క్రెడిట్ అయిన డబ్బును ఉంచుకోవడం.. వాడుకోవడం నేరం.. వారికి దొంగతనం చట్టం 1968 ప్రకారం గరిష్టంగా పదేళ్ల వరకు శిక్ష ఉంటుందని, డబ్బును తిరిగి చెల్లించాలని కూడా కోరుతోంది బ్యాంకు.