ఎన్ని యుద్ధాలు జరిగితే అమెరికాకు అంత లాభమా? యూఎస్ ఎకానమీని కాపాడుతోంది అదేనా?

ఆయుధాల ఎగుమతుల్లో యూఎస్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

World Wide Wars : ప్రతీ యుద్ధంలో స్వార్ధం ఉంది. స్వార్ధం ఎప్పుడూ యుద్ధం తాలూకు మారణహోమం ఆగకూడదనే కోరుకుంటుంది. అమెరికా తీరుకు పర్ ఫెక్ట్ గా సరిపోయే మాటలు ఇవి. దశాబ్దాల కష్టం తర్వాత ప్రపంచానికి తనను తాను పెద్దన్నగా పరిచయం చేసుకున్న అమెరికా.. ప్రతీ దేశపు వివాదంలో తల దూరుస్తుంది. వాటి మధ్య వైరాన్ని ఎగదోస్తూ ఉంటుంది. చాలా దేశాలు అలా అల్లాడుతుంటే.. యుద్ధపు మంటల్లో చలి కాచుకుంటున్నట్లు అమెరికా తన లాభాలను లెక్కలేసుకుంటోంది.

మారణాయుధాలను తాము ఎగుమతి చేయొచ్చు కానీ, వేరే వాళ్లు చేస్తే మాత్రం తప్పు అన్నట్లు అమెరికా తీరు కనిపిస్తోంది. యూఎస్ వైఖరి కరెక్టేనా? అసలు రష్యా-యుక్రెయిన్ యుద్ధం నుంచి అమెరికా ఎలా, ఎంత లాభం పొందింది? అమెరికా ఆర్థిక వ్యవస్థ నిలబడుతోంది అంటే.. అది డిఫెన్స్ రంగం వల్లేనా? ఆయుధాల విక్రయాలే ఎకానమీని కాపాడుతున్నాయా? ఆయుధాల విక్రయాల లెక్కలు చెబుతోంది అదేనా?

రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత యూరోపియన్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఓ టెన్షన్ కనిపించింది. ప్రతీ దేశం తమ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోడం స్టార్ట్ చేసింది. అది అమెరికాకు వరమైంది. ఆయుధాల ఎగుమతుల్లో యూఎస్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 2022లో 205 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయుధాల విక్రయాలు, 2023లో 238 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే దాదాపుగా 16శాతం పెరిగింది. అమెరికా సర్కార్ డైరెక్ట్ గా 2023లో 81 బిలియన్ డాలర్ల ఆయుధాలను విక్రయించింది. 2022తో పోలిస్తే ఇది 56శాతం ఎక్కువ. ప్రపంచంలోని టాప్ 100 ఆయుధ కర్మాగారాల్లో సగానికి పైగా అమెరికాలోనే ఉన్నాయి.

రేతియన్, బోయింగ్, లౌకీద్ మార్టిన్, నార్త్ రోప్ గ్రూమన్, జనరల్ డైనమిక్స్.. యూఎస్ లో 5 అతిపెద్ద ఆయుధ ఉత్పత్తిదారులు. రష్యాతో యుద్ధంలో ఈ 5 కంపెనీలు యుక్రెయిన్ కు కాస్ట్ లీ ఆయుధాలను విక్రయించాయి. దీంతో ఈ కంపెనీల స్టాక్ వ్యాల్యూ భారీగా పెరిగింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత పదిలం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతీచోట ఘర్షణ వాతావరణమే కనిపిస్తోంది. దీంతో అమెరికా పంట పండుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 39శాతం దేశాలు అమెరికా నుంచే ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాయి. ఆయుధాల ఉత్పత్తిలో, ఉత్పత్తి చేసిన ఆయుధాలను మిగతా దేశాలకు విక్రయించడంలో అమెరికా 60ఏళ్లుగా టాప్ లో ఉంది. ఆ దేశపు మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఆయుధాల ఉత్పత్తే ముఖ్య భాగం. అమెరికాలోని ఆయుధ కంపెనీలు, రక్షణ రంగ సేవల సంస్థలు అంతర్జాతీయ ఆయుధ అమ్మకాల్లో 37శాతం వాటా కలిగి ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

 

Also Read : వార్‌కు రెడీ..! ఏ క్షణమైనా దాడులకు దిగుతామంటూ ఇజ్రాయెల్‌, అమెరికాకు ఇరాన్ వార్నింగ్..!