శ్రీలంకలో పేలుళ్లు : భారతీయురాలు మృతి

  • Publish Date - April 21, 2019 / 01:05 PM IST

శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. రక్తపుటేరులు పారించారు. వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చిగురుటాకులా వణికిపోయింది. బాంబు పేలుళ్లలో 300మంది చనిపోయారు. 600మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో 35మంది విదేశీయులు ఉన్నారు. పేలుళ్ల మృతుల్లో ఒక భారతీయురాలు ఉన్నారు. కేరళ రాష్ట్రం కసర్ గడ్ కు చెందిన రసీనాగా గుర్తించారు. ఈ విషయాన్ని కేరళ సీఎంవో సిబ్బంది ధృవీకరించారు. కొలంబోలోని చర్చిలో జరిగిన పేలుడులో రసీనా చనిపోయిందన్నారు. కొలంబోలో నివాసం ఉంటున్న బంధువుల ఇంటికి రసీనా వెళ్లింది. రసీనా మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఆమె స్వస్థలం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కేరళ అధికారులు తెలిపారు.

ఆదివారం (ఏప్రిల్ 21, 2019) ఈస్టర్ పండుగ. దీంతో ప్రత్యేక ప్రార్థనల కోసం క్రిస్టియన్లు చర్చిలకు వచ్చారు. ఇదే అదనుగా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. చర్చిలు, హోటళ్లు టార్గెట్ గా దాడులకు తెగబడ్డారు. గంటల వ్యవధిలో 9 చోట్ల బాంబులు పేలాయి. 11 చోట్ల బాంబులు పేలుతాయని ముందే ఇంటెలిజెన్స్ హెచ్చరించినా భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ఘోరం జరిగింది. ఇప్పటివరకు 9 చోట్ల బాంబులు పేలాయి. ఇంకా 2 బాంబులు ఎక్కడ పేలుతాయోనని అధికారులు, ప్రజలు టెన్షన్ పడుతున్నారు. బట్టికలోవా, కోచికడే, సెయింట్ సెబాస్టియన్ చర్చిలు.. సినామోన్ గ్రాండ్, షాంగ్రిల్లా, కింగ్స్ బరీ హోటల్స్‌లో పేలుళ్లు జరిగాయి. 2 చోట్ల ఆత్మాహుతి దాడులు జరిగినట్టు ప్రభుత్వం ప్రకటించింది.