Pakistan : పాకిస్థాన్‌లో విషాదం.. శాంతి ర్యాలీలో ఆత్మాహుతి దాడి.. 14మంది మృతి..
Pakistan : పాకిస్థాన్ దేశంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శాంతి ర్యాలీలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడగా.. 14మంది మరణించారు.
- Harish Thanniru
- Published on- August 2, 2026 / 10:47 PM IST
suicide bombing at peace rally in northwest Pakistan
Pakistan : పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన శాంతి ర్యాలీపై ఆత్మాహుతి బాంబు దాడి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్వాత్ జిల్లాలోని కబల్ పట్టణంలో నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక శాంతి ర్యాలీని లక్ష్యంగా చేసుకుని దాడి జరగ్గా.. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు పోలీసులు, సాధారణ పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 20 మందికిపైగా గాయపడ్డారు.
స్థానికుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో వందలాది మంది పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో మిలిటెంట్ కార్యకలాపాలను అరికట్టాలని, శాంతి భద్రతలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సమీపంలోకి వచ్చిన ఓ ఆత్మాహుతి దాడిదారు తన వద్ద ఉన్న పేలుడు పదార్థాలను పేల్చుకోవడంతో భారీ పేలుడు సంభవించింది.
పేలుడు అనంతరం పోలీసులు, సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దాడి వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ అధికారికంగా బాధ్యత స్వీకరించలేదు.
ఈ ఘటనను పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు.
