×
Ad

Super Typhoon : వణికిస్తున్న సూపర్ టైపూన్.. 230కి.మీ వేగంతో ప్రచండ గాలుల విధ్వంసం.. మెరుపు వరదలు.. ఎక్కడికక్కడ కుప్పకూలిన..

Super Typhoon : ఫిలిప్పీన్స్ దేశాన్ని ‘పుంగ్ - వాంగ్’ సూపర్ టైపూన్ వణికిస్తోంది. తుపాను దాటికి అక్కడి ప్రజలు హడలెత్తిపోతున్నారు.

Super Typhoon

Super Typhoon : ఫిలిప్పీన్స్ దేశాన్ని ‘పుంగ్ – వాంగ్’ సూపర్ టైపూన్ వణికిస్తోంది. తుపాను దాటికి అక్కడి ప్రజలు హడలెత్తిపోతున్నారు. అతి తీవ్ర తుపాను కారణంగా గంటకు గరిష్ఠంగా 230 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటం, ఐదు మీటర్ల ఎత్తువరకు అలలు ఎగిసిపడే ప్రమాదం పొంచి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సుమారు 10లక్షల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

దేశంలో అత్యధిక జనాభా కలిగిన లూజాన్ ద్వీపంలోని అరోరా ప్రావిన్స్ లో ఈ భయంకరమైన తుపాను తీరాన్ని తాకిందని అధికారులు తెలిపారు. స్థానికంగా ఉవాన్ అని పిలుస్తున్న ఈ తుపాను 18వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నట్లు చెప్పారు. కటండువానెస్ ప్రావిన్సులో మెరుపు వరదల సంభవించాయి. భారీ వర్షాల కారణంగా బికోల్, తూర్పు విసాయాస్ లను వరదలు ముంచెత్తాయి. కటండువానెస్ లోని గిగ్మోట్, ఇసాబెలాలోని డైనపిగ్ వంటి తీర ప్రాంతాల్లో రాకసి అలలు విరుచుకుపడ్డాయి. వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అనేక చోట్ల చెట్లు కూలిపోయాయి. ఇళ్లు దెబ్బతిన్నాయి.

Also Read: Weather Alert : భయంకర కోల్డ్ వేవ్.. వచ్చే మూడ్రోజులు జాగ్రత్త.. ఆ జిల్లాల్లోని ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ..

ఫిలిప్పీన్స్ తూర్పు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచే భారీ వర్షాలు, ప్రచండ గాలులు వీచడం ప్రారంభించాయని వాతావరణ అధికారులు తెలిపారు. బికోల్ ప్రాంతానికి తూర్పున ఉన్న కాటాండువాన్స్ అనే ద్వీపంలోని నివాసితులు, అదేవిధంగా ఇతర లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల్లోని నివాసితులు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

పౌర విమానయాన నియంత్రణ సంస్థ అనేక విమానాశ్రయాలను మూసివేసింది. దీంతో దాదాపు 380కుపైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. ఉత్తర ప్రావిన్సుల్లోని విద్యా సంస్థలు, కార్యాలయాలకు సోమ, మంగళవారాల్లో సెలవు ప్రకటించారు.


పసిఫిక్ మహాసముద్ర ఉష్ణమండల వాతావరణ వ్యవస్థలు ఏర్పడే ప్రాంతానికి సమీపంలో ఉన్న ఫిలిప్పీన్స్, తుఫానులకు ప్రపంచంలోనే అత్యంత హాని కలిగించే దేశాలలో ఒకటి. ఈ ఏడాది ఫిలిప్పీన్స్ ను తాకిన 21వ తుపాను ఇది. ఇటీవలే స్థానికంగా కల్మేగీ తుపాను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. దాదాపు 224 మంది మరణించారు.