Tariff Warning: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగ్గేదేలే అంటున్నాడు. టారిఫ్ బాంబ్ పేరుతో హడావుడి చేస్తున్నాడు. మొబైల్ ఉత్పత్తుల తయారీ సంస్థలకు వరుసగా వార్నింగ్ లు ఇచ్చేస్తున్నాడు ట్రంప్. ఐఫోన్లు అమెరికాలోనే తయారు చేయాలి, అలా కాదంటే యాపిల్ కంపెనీపై 25శాతం సుంకాన్ని విధిస్తామని ట్రంప్ ఇదివరకే వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా టారిఫ్ బాంబ్‌ను మరో దిగ్గజ మొబైల్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ పైనా విసిరాడు ట్రంప్. ఇప్పుడీ టారిఫ్ రూల్ శాంసంగ్ సహా ఇతర అన్ని స్మార్ట్‌ఫోన్ సంస్థలకు వర్తిస్తుందని ట్రంప్ వెల్లడించాడు.
‘‘యాపిల్ ఒక్కటే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి. శాంసంగ్ అయినా మరో సంస్థ అయినా తమ ఉత్పత్తులను అమెరికాలోనే తయారు చేయాలి. ఇక్కడ ప్లాంట్ నిర్మిస్తే వారికి ఎలాంటి టారిఫ్‌లు ఉండవు. అలా కాకుండా ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసినవి తీసుకొస్తే మాత్రం అది న్యాయమైన ప్రక్రియ కాదు. అమెరికా విధించే సుంకాల ప్రభావం ఉండకూడదనుకుంటే.. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఇక్కడే ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవాలి. అలా కాకుండా భారత్ లో లేదా ఇతర ఏ దేశంలోనో తయారు చేసిన ఫోన్లను అమెరికాకు దిగుమతి చేసుకుంటే.. 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని” అని తేల్చి చెప్పాడు ట్రంప్.
Also Read: ఆపిల్ లవర్స్ మీకోసమే.. కొత్త ఐఫోన్ 17 ఎయిర్ వస్తోందోచ్.. కెమెరా, ధర, డిజైన్ లీక్..!
శాంసంగ్.. సౌత్ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ సంస్థ. అమెరికా మార్కెట్ లో అత్యధిక అమ్మకాలు కలిగున్న రెండో మొబైల్ కంపెనీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఏటా 220 మిలియన్ ఫోన్లను విక్రయిస్తుండగా.. ఇందులో 60శాతం మొబైల్స్ వియత్నాంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడి నుంచే ఎక్కువగా అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఇకపై ఈ విధానంతో అమెరికాకు శాంసంగ్ ఫోన్స్ తీసుకొస్తే.. సుంకాలు చెల్లించక తప్పని పరిస్థితి.
చైనాపై ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దేశంపై భారీగా సంకాలు విధించాడు. దీంతో ఐఫోన్ తయారీని భారత్‌లో పెంచేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో యాపిల్ కు వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. అమెరికాలో విక్రయమయ్యే ఐఫోన్లన్నీ అమెరికాలోనే తయారు కావాలన్నాడు. భారత్‌లోనో మరో దేశంలోనో కాదన్నాడు. ఒకవేళ అమెరికాలో తయారీకి సిద్ధం కాకుంటే, దిగుమతి చేసుకునే ఫోన్లపై యాపిల్ కనీసం 25శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ తేల్చి చెప్పాడు.