Oracle LayOffs: ఐటీ ఉద్యోగులకు ఒరాకిల్ బిగ్ షాక్.. 30వేల మంది తొలగింపు..! ఒక్క ఇండియాలోనే..

భారీ లేఆఫ్స్ ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఎప్పుడు ఏ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందో అర్థం కాని పరిస్థితి. ఏ క్షణంలో తమకు కంపెనీ నుంచి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు మెయిల్ వస్తుందోనని ఐటీ ఉద్యోగులు కంగారు పడుతున్నారు.

  • Published On : April 1, 2026 / 07:59 PM IST

Oracle LayOffs: అమెరికా బేస్డ్ టెక్ దిగ్గజం ఒరాకిల్ తన ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోంది. ఏకంగా 30వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెడుతున్న సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్.. ఉద్యోగుల తొలగింపుపై దృష్టి సారించింది.

తమకు లేఆఫ్స్ మెయిల్స్ వచ్చినట్లు పలువురు ఉద్యోగులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ కంపెనీకి భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 1,62,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 30వేల మందిని తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. భారత్ విషయానికి వస్తే సుమారు 12వేల మంది ఉద్యోగులను ఒరాకిల్ తొలగించింది. కాగా, 2023 నుంచి పలుమార్లు ఒరాకిల్ లేఆఫ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలకు మరిన్ని నిధులు సమకూర్చడంపై ఒరాకిల్ ఫోకస్ పెట్టింది. ఈ ప్రయత్నంలో భాగంగా తన ఉద్యోగుల్లో వేలాది మందిని తొలగిస్తోంది. ఈ భారీ ఉద్యోగ కోతల వల్ల ప్రపంచవ్యాప్తంగా 30వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడిందని నివేదికలు చెబుతున్నాయి. అమెరికా, భారత్, కెనడా, మెక్సికో ఇతర దేశాలలోని ఉద్యోగులకు మంగళవారం ఉదయం నుంచి ఉద్యోగ తొలగింపు మెయిల్స్ రావడం మొదలైంది. ఇది కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగ కోతకు దారితీసింది.

అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఒరాకిల్ తొలగించిన 30వేల మందిలో భారత్ లో సుమారు 12వేల మంది ఉద్యోగులు ఉన్నారని సమాచారం. కాగా, నెల రోజుల్లోగా మరో విడత ఉద్యోగ కోతలు ఉండనున్నాయని సమాచారం.

”ఆస్టిన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికన్ బహుళజాతి టెక్నాలజీ కంపెనీ ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇండియాలో సుమారు 12వేల మంది ఉద్యోగులను తొలగించింది. నెల రోజుల్లోగా మరో భారీ తొలగింపునకు కంపెనీ ప్రణాళిక వేస్తోంది” అని ఈ తొలగింపుల వల్ల ప్రభావితమైన ఇద్దరు వ్యక్తులు చెప్పారు. వీరిలో కంపెనీ మానవ వనరుల విభాగానికి చెందిన ఒకరు ఉన్నారు.

ఒరాకిల్ చేపట్టిన భారీ ఉద్యోగ కోతల వల్ల సుమారు 30వేల ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం. “మార్పుల కారణంగా, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఒక నిర్ణయం తీసుకున్నాము. దాని ఫలితంగా దురదృష్టవశాత్తు మీరు ప్రస్తుతం నిర్వహిస్తున్న పదవి రద్దు చేయబడుతుంది” అని తమకు మెయిల్స్ వచ్చినట్లు ఉద్యోగులు తెలిపారు.

ఇండియాలో ఒక సంవత్సరం సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగికి, ఉద్యోగ విరమణ తేదీ వరకు ఒక నెల చెల్లించని వేతనాలతో పాటు, 15 రోజుల జీతం, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, అర్హత ఆధారంగా గ్రాట్యుటీ, ఒక నెల నోటీస్ పీరియడ్‌కు చెల్లింపును కంపెనీ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఒరాకిల్ అదనంగా రెండు నెలల జీతాన్ని కూడా ఆఫర్ చేసింది. అయితే, కంపెనీ నుండి స్వచ్ఛందంగా, స్నేహపూర్వకంగా రాజీనామా చేసే వారికి మాత్రమే సెవరెన్స్ ప్యాకేజీకి అర్హత ఉంటుందని సమాచారం.

భారీ లేఆఫ్స్ ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఎప్పుడు ఏ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందో అర్థం కాని పరిస్థితి. ఏ క్షణంలో తమకు కంపెనీ నుంచి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు మెయిల్ వస్తుందోనని ఐటీ ఉద్యోగులు కంగారు పడుతున్నారు. జాబ్ టెన్షన్ తో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఏఐ వచ్చాక ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు.

Also Read: టాక్స్ పేయర్లు జాగ్రత్త! 11 కొత్త పన్ను నిబంధనలివే.. ఒక్క తప్పు చేసినా భారీ జరిమానా తప్పదు!