New Income Tax Rules : టాక్స్ పేయర్లు జాగ్రత్త! 11 కొత్త పన్ను నిబంధనలివే.. ఒక్క తప్పు చేసినా భారీ జరిమానా తప్పదు!
New Income Tax Rules 2026 : ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. 1961 నాటి ప్రస్తుత చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం 2026 కూడా అమల్లోకి వచ్చింది. మొత్తం పన్ను నిబంధనల్లో 11 కీలక మార్పులు చోటచేసుకున్నాయి.. అవేంటో ఓసారి వివరంగా చూద్దాం..
New Income Tax Rules 2026
- కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి
- ఐటీఆర్ దాఖలు, సవరించిన రిటర్న్ తేదీలు పొడిగింపు
- టీసీఎస్ తగ్గింపు, కొన్ని సందర్భాల్లో టీడీఎస్‌కు మినహాయింపు
- స్టాక్ మార్కెట్లో STT, బైబ్యాక్‌పై పన్ను, SGB పెరిగాయి
New Income Tax Rules 2026 : పన్నుచెల్లింపుదారులకు బిగ్ అప్ డేట్.. 2026లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది. టాక్స్ పేయర్లంతా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కొత్త చట్టంలో పన్ను నిబంధనలను సులభతరం చేయగా, ఇప్పటికీ ఏమైనా తప్పులు జరిగితే భారీ జరిమానాలు తప్పవు.
ప్రతి ఆదాయానికి సరైన రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ వివరాలను సరిగా వాడుకోవడం ముఖ్యం. స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్లపై పన్ను చెల్లింపులో కూడా కొత్త రూల్స్ కచ్చితంగా పాటించాలి. పన్ను రూల్స్ మరింత కఠినతరం అయ్యాయి.
ప్రతి పన్నుచెల్లింపుదారుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారొచ్చు. అందుకే ఈ కొత్త ఆర్థిక చట్టాన్ని పూర్తిగా అవగాహనతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ 11 పన్ను సంబంధిత కీలక మార్పులతో ఎవరిపై ఎంత ప్రభావం ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
1. ఇక పన్ను సంవత్సరం (టాక్స్ ఇయర్) :
ఇప్పటివరకు మీ ITR ఫైల్ చేసేటప్పుడు అసెస్మెంట్ సంవత్సరం కనిపించేది. కానీ ఇకపై, అసెస్మెంట్ సంవత్సరం స్థానంలో పన్ను సంవత్సరం (టాక్స్ ఇయర్) అని కనిపిస్తుంది. పన్ను చెల్లింపుదారులకు అర్థమయ్యేలా రూపొందించింది కేంద్రం.
2. ఐటీఆర్ దాఖలు గడువు తేదీ పొడిగింపు :
ITR-1, ITR-2 కింద ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులు మునుపటిలాగే జూలై 31 వరకు తమ రిటర్న్‌లను దాఖలు చేయవచ్చు. ITR-3, ITR-4 కింద తమ ఐటీఆర్ దాఖలు చేసే నాన్-ఆడిట్ పన్ను చెల్లింపుదారులకు ఇప్పుడు ఆగస్టు 31 వరకు సమయం ఉంది.
3. సవరించిన రిటర్న్ తేదీ మార్పు :
సవరించిన రిటర్న్‌లను దాఖలు చేసేందుకు గడువును మార్చి 31 వరకు పొడిగించారు. పన్ను చెల్లింపుదారులు జరిమానాకు లోబడి మార్చి 31 వరకు తమ ఐటీఆర్ దాఖలు చేసుకోవచ్చు.
4. టీసీఎస్ తగ్గింపు :
సరళీకృత చెల్లింపుల పథకం (TCS) కింద రూ. 10 లక్షలకు మించిన విద్య, వైద్య చెల్లింపులపై పన్నును ఇప్పుడు 5 శాతం నుంచి 2శాతాకి తగ్గించారు. విదేశీ పర్యాటక ప్యాకేజీలపై టీసీఎస్‌ను కూడా 2 శాతానికి తగ్గించారు. ఇతర రెమిటెన్స్‌లపై మునుపటిలాగే 20శాతం టీసీఎస్ కొనసాగుతుంది.
5. ఇక వీటికి TDS వర్తించదు :
కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రిబ్యునల్, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్, మోటార్ ప్రమాద కేసులకు నష్టపరిహారాన్ని మంజూరు చేస్తుంది. నష్టపరిహారం చెల్లించడంలో ఆలస్యమైతే వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీపై ఇక నుంచి టీడీఎస్ (TDS) వర్తించదు. ఉద్యోగులకు ఇంటికి వెళ్లి వచ్చేందుకు అయ్యే ప్రయాణ ఖర్చులను తిరిగి చెల్లించాలి. దీనిపై కూడా ఇక టీడీఎస్ వర్తించదు.
6. TAN రద్దు :
ఇప్పటి నుంచి నివాసేతరులు ఆస్తి కొనుగోళ్లపై TDS చెల్లించేటప్పుడు TAN అవసరం లేదు. వారు తమ PANతో చలాన్ ద్వారా TDS చెల్లించవచ్చు. తద్వారా పన్ను చెల్లింపు సులభం అవుతుంది.
7. పింఛనుపై పన్ను మినహాయింపు నిబంధనలలో మార్పు :
ఇప్పటివరకు సాయుధ దళాల పింఛన్లు అందరికీ పన్ను రహితంగా ఉండేవి. కానీ, ఇకపై శారీరక వైకల్యాల కారణంగా సర్వీసు నుంచి వైదొలిగిన వారికి మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది.
8. మినహాయింపులలో పెరుగుదల :
విద్యా పరీక్ష రుసుమును ఒక్కో విద్యార్థికి రూ. 3000కి పెంచారు. హాస్టల్ మినహాయింపును ఒక్కో విద్యార్థికి రూ. 9000కి పెంచారు. షేర్ మార్కెట్ పన్ను నిబంధనలలో ఏయే మార్పులు చేశారంటే?
9. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై STT పెంపు :
ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై STTని 0.02శాతం నుంచి 0.05 శాతానికి పెంచారు. అదేవిధంగా, ఆప్షన్ ప్రీమియంపై ఎస్ఎస్టీని 0.10శాతం నుంచి 0.15 శాతానికి పెంచారు. ఆప్షన్ వినియోగంపై 0.15 శాతం ఎస్ఎస్టీ కూడా వర్తిస్తుంది.
10. బైబ్యాక్ మరింత ప్రియం :
ఒక కంపెనీ తన వాటాదారుల నుంచి షేర్లను అధిక ధరకు తిరిగి కొనుగోలు చేయడాన్నే బైబ్యాక్ అంటారు. అయితే, ఈ బైబ్యాక్ పెట్టుబడిదారులకు, కంపెనీకి కూడా ఖర్చుతో కూడుకున్నది. ఈ బైబ్యాక్ ద్వారా పెట్టుబడిదారులు లాభం పొందితే వారు క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా, ఒక కంపెనీ ప్రమోటర్ బైబ్యాక్ నిర్వహిస్తే.. వారు 30శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఒక కంపెనీ బైబ్యాక్ నిర్వహిస్తే.. వారు 22శాతం పన్ను చెల్లించాల్సిందే.
11. SGBకి కూడా పన్ను వర్తింపు :
సావరిన్ గోల్డ్ బాండ్లు అనేది ప్రభుత్వ పథకం. ఈ పథకంలో పన్ను లేకపోవడం ఒకప్పుడు పెట్టుబడిదారులకు వరం. అయితే, ప్రారంభం నుంచి ఇందులో పెట్టుబడి పెట్టని లేదా ప్రారంభం నుంచి బాండ్లు లేని పెట్టుబడిదారులు ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
