Turkey and Armenia
Turkey-Armenia Border : టర్కీ, అర్మేనియా దేశాల మధ్య 35 ఏళ్లుగా మూసివేసిన సరిహద్దును ఎట్టకేలకు ఓపెన్ చేశారు. దీంతో ఫస్ట్ బోర్డర్ పాయింట్ నుంచి ఇరు దేశాల మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, నీళ్లు, ఔషధాలు ఇతర సామాగ్రి చేరవేసేందుకు అర్మేనియాకు చెందిన 5 ట్రక్కులు అలికోమ్ సరిహద్దు ప్రాంతం నుంచి టర్కీలోకి ప్రవేశించాయి. అర్మేనియాకు టర్కీ ప్రత్యేక ప్రతినిధి కిలిక్కు ఈ మేరకు ట్వీట్ చేశారు. సహాయానికి ధన్యవాదాలు తెలిపారు.
1988లో అర్మేనియాలో భారీ భూకంపం సంభవించింది. దాదాపు 25 వేల నుంచి 30 వేల మంది మృతి చెందారు. ఆ విపత్కర సమయంలో బాధిత దేశానికి తుర్కియో సాయం అందించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సరిహద్దు పాయింట్ ను తెరవడం ఇదే మొదటిసారి. టర్కీ, అర్మేనియాలు ఎప్పుడూ అధికారిక దౌత్య సంబంధాలను ఏర్పరచుకోలేదు. 1990 నాటి నుంచి వారి ఉమ్మడి సరిహద్దు మూసి ఉంది.
ఒట్టోమాన్ సామ్రాజ్యంలో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అర్మేనియన్ల ఊచకోతతో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఈ ఆరోపణలను టర్కీ కొట్టిపారేస్తూవస్తోంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను పునురుద్ధరించుకునేందుకు వీలుగా 2021లో రెండు దేశాలూ ప్రత్యేక దూతలను నియమించాయి. అప్పటి నుంచి ఇరు దేశాలు బార్డర్లు ఎప్పుడూ మూసే ఉంటాయి. అయితే, టర్కీలో సంభవించిన భూకంపం నేపథ్యంలో ఆర్మేనియా బార్డర్ ను ఓపెన్ చేసి సైన్యాన్ని సహాయక చర్యల కోసం పంపించారు.