ఆకాశం నుంచి 13,000 ఏళ్లుగా “బ్లాక్ నైట్” అనే శాటిలైట్‌తో ఏలియన్స్ భూమిపై నిఘా పెట్టారని ఎన్నో దశాబ్దాలుగా ప్రచారం జరుగుతోంది. “బ్లాక్ నైట్ ఉపగ్రహం” గురించి ఎన్నో కథలు, సిద్ధాంతాలు ఇప్పటికీ వస్తున్నాయి. 13,000 ఏళ్లుగా భూమికి దగ్గరగా కక్ష్యలో “బ్లాక్ నైట్ ఉపగ్రహం” తిరుగుతోందని, అది ఏలియన్ శాటిలైట్ అంటూ ప్రచారం జరుగుతోంది.
గతంలో ఇటువంటి కథనాలు బాగా ప్రచారమయ్యాయి. కొన్ని ఫొటోలను, రేడియో సిగ్నల్స్‌ను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అటువంటి ప్రచారం జరిగింది. “బ్లాక్ నైట్ ఉపగ్రహం” గురించి దాదాపు వందేళ్ల ముందు నుంచి కథనాలు వస్తున్నాయి.
అది “ఏలియన్ శాటిలైట్” అని ఎవరెవరు అన్నారు?
సెర్బియన్-అమెరికన్ ఇంజనీర్ నికోలా టెస్లా మొట్టమొదటిసారిగా “బ్లాక్ నైట్ ఉపగ్రహం” గురించి చెప్పారు. టెస్లా 1899లో కొలరాడో స్ప్రింగ్స్‌లోని ప్రయోగాల్లో భాగంగా రేడియో సిగ్నల్స్ గుర్తించారు. దీంతో కొంత మంది వాటిని ఏలియన్ ట్రాన్స్‌మిషన్‌గా భావించారు. అయితే, నేటి శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. అవి సహజ రేడియో తరంగాలే.
ఇంగ్లాండ్‌కు చెందిన రేడియో ఆపరేటర్ జోర్గెన్ హల్స్ 1927లో రేడియో ద్వారా పంపిన సంకేతాలు చాలా సేపటి తర్వాత తిరిగి వినిపించాయి. ఇది అతడికి విచిత్రంగా అనిపించింది. అప్పట్లోనూ ఏలియన్ శాటిలైట్ వల్లే ఇలా జరుగుతోందని అనుకున్నారు. అయితే, ఇది భూమిపై జరిగే సహజమైన విధానమే. దీనికి ఇతర గ్రహవాసులతో సంబంధం లేదు.
ఆ తర్వాత 1954లో డొనాల్డ్ కీహో అనే యూఎఫ్‌వో ప్రమోటర్ అమెరికా ఎయిర్ ఫోర్స్ రెండు ఉపగ్రహాలను గుర్తించిందని ప్రకటించారు. అప్పుడు కూడా ఏలియన్ శాటిలైట్లనే గుర్తించారంటూ ప్రచారం జరిగింది. అయితే, 1960లో నేవీ ఒక నల్లటి వస్తువును గుర్తించి, తర్వాత ఆ వస్తువును అమెరికా ఉపగ్రహ శిధిలాలుగా నిర్ధారించింది.
అనంతరం 1960లో టైమ్ మ్యాగజైన్ “డార్క్ ఆబ్జెక్ట్” అనే పేరుతో ఓ స్టోరీని ప్రచురించింది. అదే సమయంలో, ఆ “డార్క్ ఆబ్జెక్ట్”ను అమెరికా డిస్కవర్ స్పై శాటిలైట్ నుంచి వచ్చిన చెత్త అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
ఆ తర్వాత చాలా కాలానికి 1998లో ఇటువంటి కథలు మళ్లీ మొదలయ్యాయి. STS-88 అనే స్పేస్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలో పని చేస్తున్న వ్యోమగాములు భూమి బ్యాక్‌డ్రాప్‌పై ఒక విచిత్రమైన నలుపు వస్తువును ఫొటోలు తీశారు.
నాసా డాక్యుమెంట్స్ ప్రకారం అదే వస్తువును 025570 అనే నంబర్‌తో రిజిస్టర్ చేశారు. కొన్ని రోజుల్లోనే అది భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. దీంతో అది ఏలియన్ శాటిలైట్ కాదని తేలింది.
ఏలియన్స్‌కు ఇంటెలిజెన్స్ బాగా ఉంటుందని, వాటి గురించి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని చెబుతుంటే మనకు ఆసక్తి పెరుగుతుంది. మనకు ఉండే ఆసక్తికి తగ్గట్లే చాలా మంది ఏలియన్స్ గురించి సరైన ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
అలీస్ గోర్మన్ అనే స్పేస్ ఆర్కియాలజిస్టు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “అటువంటి వస్తువులకు క్యాటలాగ్ నంబర్లు ఉంటాయి. కానీ వాటిని నిజంగా మనం గుర్తించలేము.. చాలాసార్లు అవి ఆప్టికల్ ఇల్యూషన్ అయ్యే అవకాశం ఉంది” అని తెలిపారు. 13,000 ఏళ్లుగా ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా అంత శక్తితో కూడిన శాటిలైట్ పని చేయటం అసాధ్యమని ఆమె అన్నారు. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో కూడా ఇది సాధ్యపడదని స్పష్టం చేశారు.