Taliban : వీళ్లు మారలే..పాత మొఖాలతో అఫ్ఘాన్ లో తాలిబన్ ప్రభుత్వం..పాలనపై కీలక ప్రకటన

అఫ్ఘానిస్తాన్ లో ఇస్లామిక్ ఎమిరేట్​ పేరుతో మంగళవారం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు తాలిబన్లు.

T

Afghanistan అఫ్ఘానిస్తాన్ లో ఇస్లామిక్ ఎమిరేట్​ పేరుతో మంగళవారం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు తాలిబన్లు. షరియా చట్టానికి అనుగుణంగా దేశాన్ని పాలిస్తామని తాలిబన్లు తేల్చి చెప్పారు.
అయితే తాము గతంలోలా లేము..  మారిపోయాము..  మహిళలకు అన్ని హక్కులు కల్పిస్తాం అని కొద్దిరోజులుగా చెబుతూ వచ్చిన తాలిబన్లు ఇప్పుడు తాము పాత తాలిబాన్లమే అని వారి చర్యల ద్వారా చెబుతున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన తాలిబన్ ప్రభుత్వంలో అందరూ పురుషులే. 20ఏళ్ల పాటు అమెరికా,దాని మిత్రదేశాలపై నిర్విరామంగా పోరాటం చేసిన వారికి ప్రభుత్వంలో పెద్దపీట వేశారు.

ఆపద్ధర్మ ప్రధాని ముల్లా హసన్​ అఖుంద్​ నేతృత్వంలో పాలన సాగనుంది. 2001లో తాలిబన్ల ప్రభుత్వం కుప్పకూలిన సమయంలోనూ ఈయనే ప్రధానిగా ఉన్నారు. మరోవైపు అమెరికా బలగాల ఉపసంహరణ ఒప్పందంపై చర్చలు సాగించిన, తాలిబన్​ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్​ ఘని బరాదర్​కు కేబినెట్​లో ఉప ప్రధాని బాధ్యతలను అప్పగించారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఎంత కాలం కొనసాగుతుందనే విషయంపై తాలిబన్లు స్పష్టతనివ్వలేదు. ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న ప్రశ్నకూ సమాధానం లేదు. తాలిబన్​యేతర సభ్యులను కేబినెట్​లో చేర్చుకోవాలని అంతర్జతీయ సంగం అనేకమార్లు డిమాండ్​ చేసింది. కానీ వాటిని తాలిబన్లు చాలా వరకు విస్మరించినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తాము చేపట్టబోయే పరిపాలనా విధానంపై బుధవారం తాలిబన్ కీలక ప్రకటన చేసింది. తాలిబన్‌ సుప్రీం లీడర్‌ మౌల్వీ హిబైతుల్లా అఖుంద్‌ జాదా పేరుతో వెలువడిన ఈ ప్రకటనలో…భవిష్యత్తు గురించి ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అన్ని సమస్యలను సరైన మార్గంలో పరిష్కరిస్తాం. గడిచిన 20 ఏళ్లుగా..అఫ్ఘానిస్తాన్ నుంచి విదేశీ సేనలను పంపించి వేయడం, దేశంలో పూర్తి స్థాయి సుస్థిర ఇస్లామిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం అనే రెండు లక్ష్యాలతోనే మేము పనిచేశాం. భవిష్యత్తులో దేశ పాలన, అఫ్ఘాన్ ల జీవితాలను ఇస్లామిక్‌ చట్టమైన షరియాను అనుసరించి క్రమబద్ధీకరిస్తాం.అఫ్ఘాన్ లు తాలిబన్లకు మద్దతు ఇచ్చి వ్యవస్థను పటిష్ఠం చేయాలి.

ప్రతిభావంతులైన విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు,ఇంజినీర్లు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదార్లకు ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ చాలా విలువనిస్తుంది. దేశానికి వారి మార్గదర్శకత్వం, సేవలు చాలా అవసరం. ప్రజలు దేశం విడిచి వెళ్లవద్దు. ఎవరితోనూ మాకు సమస్యలు లేవు అని ఆ ప్రకటనలో తాలిబన్ తెలిపింది.

తాలిబన్లు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో అఫ్గాన్ మహిళలు క్రికెట్‌తో సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనలేరు. ఎందుకంటే క్రీడలు వారి శరీరాలను బహిర్గతం చేస్తాయని.. అందుకే వాటిపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబాన్లు బుధవారం ప్రకటించారు. మహిళలకు క్రీడా కార్యకలాపాలు అవసరం లేదని తాలిబాన్ సాంస్కృతిక కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వాసిక్ మీడియాతో పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికే అనేకమంది ఆఫ్ఘన్ క్రీడాకారులు దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ మహిళా క్రికెట్ జట్టు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారికోసం తాలిబన్లు గాలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.