Nepal Protest : నేపాల్‌లో ఆగని నిరసనలు.. 19మంది మృతి, వందల మందికి గాయాలు.. ముగ్గురు మంత్రులు రాజీనామా.. దుబాయ్‌కి ప్రధాని కేపీ ఓలీ..!

Nepal Protest : నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేదంతో ఆ దేశంలో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి.

Nepal Protest : నేపాల్‌లో ఆగని నిరసనలు.. 19మంది మృతి, వందల మందికి గాయాలు.. ముగ్గురు మంత్రులు రాజీనామా.. దుబాయ్‌కి ప్రధాని కేపీ ఓలీ..!

Nepal Protest

Updated On : September 9, 2025 / 1:02 PM IST

Nepal Protest : నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేదంతో ఆ దేశంలో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనలను అదుపు చేసేందుకు చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. సైన్యం సైతం రంగంలోకి దిగింది. నేపాల్ రాజధాని కఠ్మాండుతోపాటు తూర్పున ఉన్న ఇటాహరి నగరంలో నిరసనకారులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ మొత్తం ఘటనలో 19మంది మరణించారు. 300మందికిపైగా గాయపడ్డారు.

Also Read: Thor Pedersen: విమానం ఎక్కకుండానే ప్రపంచం మొత్తాన్ని చుట్టేశాడు.. ఎలాగంటే? ఆఫీస్ జాబ్ వదిలేసి మరీ..

సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా పెద్దెత్తున యువత నిరసనలకు దిగారు. నిరసనకారులు కమ్యూనికేషన్ మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ నివాసానికి నిప్పంటించారు. అయితే, పరిస్థితి చేయిదాటిపోయిందని గ్రహించిన ప్రభుత్వం చివరికి సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తేసినప్పటికీ దేశవ్యాప్తంగా నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి.

పరిస్థితిని అదుపు తెచ్చేందుకు అనేకచోట్ల ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. అయిన ఆ దేశ యువత రోడ్లపైకి వచ్చి తమ నిరసను తెలియజేస్తున్నారు.

ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, నిరసనలకు నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేశ్ లేఖక్ సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా వ్యవసాయశాఖ మంత్రి రామ్‌నాథ్ అధికారి, నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ కూడా రాజీనామా ప్రకటించారు.

సోషల్ మీడియాపై నిషేధం ఎందుకు..?

నేపాల్ ప్రభుత్వం గతవారం 26సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించింది. వీటిలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్రముఖ సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.

దేశంలో చట్టాలను పాటించడానికి, స్థానికంగా ఆయా సంస్థలు కార్యాలయాలను తెరవడానికి, గ్రీవెన్స్ అధికారులను నియమించడానికి సోషల్ మీడియా కంపెనీలకు వారం రోజులపాటు ప్రభుత్వం సమయం ఇచ్చినట్లు చెబుతోంది. అయితే, చైనా సోషల్ మీడియా కంపెనీ టిక్‌టాక్ ఈ షరతులను సకాలంలో పాటించిందని దీంతో టిక్‌టాక్ పై నిషేధించలేదని ప్రభుత్వం తెలిపింది.

సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై నిషేధంతో దేశంలోని యువత ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వెబ్‌సైట్లపై నిషేదం తరువాత యువత నిరసనలకు పిలుపునిచ్చారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది.

నేపాల్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ సోమవారం రాత్రి అత్యవసర కేబినెట్ సమావేశం తర్వాత సోషల్ మీడియా సైట్‌లను నిషేధించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. అయినా మంగళవారం ఉదయం దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ప్రధాని పదవికి కెపి శర్మ రాజీనామా చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రధాని కెపి శర్మ ఓలి ప్రకటన ..

సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసిన తరువాత ఆ దేశ ప్రధాని కెపి శర్మ ఓలి ఓ ప్రకటన విడుదల చేశారు. జెన్-జెడ్ తరం (1990 నుంచి 2010 మధ్య జన్మించిన వారు) పిలుపునిచ్చిన నిరసనల కారణంగా జరిగిన విషాద సంఘటన నన్ను తీవ్రంగా బాధించింది.

దేశంలోని యువత శాంతియుతంగా తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపిస్తారని మేము విశ్వసిస్తున్నప్పటికీ.. కొన్ని అరాచక మూకలు వాళ్ల ప్రయోజనాలకోసం నిరసనల్లోకి చొరబడటం వల్ల తలెత్తిన పరిస్థితి పౌరుల ప్రాణాలను కోల్పోవడానికి దారితీసింది.

సోషల్ మీడియా వాడకం ఆపడానికి ప్రభుత్వం అనుకూలంగా లేదు. కేవలం నిబంధనలు పాటించేలా ఆయా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై చర్యలో భాగంగా తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికోసం ప్రదర్శనలు చేయాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం ఘటనలపై, జరిగిన నష్టంపై 15రోజుల్లోపు నివేదికను ఇచ్చేలా దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని కెపి శర్మ ఓలి చెప్పారు.


నిరసనలు తగ్గకపోవటంతోపాటు వరుసగా మంత్రులు రాజీనామా చేస్తుండటంతో దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. మరోవైపు ప్రధాని రాజీనామా చేయాలంటూ నిరసనకారులు తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. దీంతో ప్రధాని కేపీ ఓలీ దుబాయ్‌కు వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హిమాలయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూడా ఆయన ప్రయాణం కోసం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, వైద్య చికిత్స కోసం ఆయన దుబాయ్ వెళ్తున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.