Australia PM Anthony Albanese : భారతీయుల జోలికెళ్లొద్దు.. వెంటనే క్షమాపణ చెప్పండి.. సెనెటర్‌కు ఆస్ట్రేలియా ప్రధాని వార్నింగ్

ఆస్ట్రేలియాలోని భారతీయ కమ్యూనిటీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సెనెటర్ పై ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ సీరియస్ అయ్యారు.

Australia PM Anthony Albanese : భారతీయుల జోలికెళ్లొద్దు.. వెంటనే క్షమాపణ చెప్పండి.. సెనెటర్‌కు ఆస్ట్రేలియా ప్రధాని వార్నింగ్

Australia PM Anthony Albanese

Updated On : September 9, 2025 / 2:09 PM IST

Australia PM Anthony Albanese : ఆస్ట్రేలియాలో గత కొంతకాలంగా వలసదారులకు వ్యతిరేకంగా పెద్దెత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ కమ్యూనిటీకి వ్యతిరేకంగా సెంటర్ రైట్ లిబరల్ పార్టీకి చెందిన సెనెటర్ జసింటా నంపిజిన్‌పా ప్రైస్ (Jacinta Nampijinpa Price) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఆమె వ్యాఖ్యలు ఆస్ట్రేలియన్ – ఇండియన్ కమ్యూనిటీలో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. వెంటనే ఆమె క్షమాపణలు చెప్పాలని వారంతా డిమాండ్ చేశారు.

Also Read: Nepal Protest : నేపాల్‌లో ఆగని నిరసనలు.. 19మంది మృతి, వందల మందికి గాయాలు.. ముగ్గురు మంత్రులు రాజీనామా.. దుబాయ్‌కి ప్రధాని కేపీ ఓలీ..!

జసింటా ప్రైస్ వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ సీరియస్ అయ్యారు. భారత కమ్యూనిటీకి చెందిన ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని సూచించారు. ‘ఆమె వెంటనే భారతీయ కమ్యూనిటీకి చెందిన ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఆమె సొంత పార్టీ నేతలు కూడా అదే చెబుతున్నారు’ అంటూ ప్రధాని పేర్కొన్నారు.

ఆస్ట్రేలియాలో భారతీయుల సంఖ్య ఎక్కువే.. 2023 నాటికి భారత సంతతికి చెందిన వారు ఆస్ట్రేలియాలో 8,45,800 మంది నివసిస్తున్నారు. ఆస్ట్రేలియాలో పెరుగుతున్న జీవన వ్యయాలకు భారతీయ కమ్యూనిటీ ప్రజలే కారణమని నిందిస్తూ సెంటర్ రైట్ లిబరల్ పార్టీకి చెందిన సెనెటర్ జసింటా ప్రైస్ విమర్శలు చేశారు. అంతేకాదు.. ఓట్ల కోసం భారతీయ వలసదారులను రప్పిస్తున్నారని ప్రధాని అల్బనీస్‌కు చెందిన ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీపైనా ఆమె విమర్శలు చేశారు. ఆస్ట్రేలియాకు వలస వచ్చిన భారతీయుల సంఖ్య భారీగా ఉంది. ఆ సంఖ్యను లేబర్ పార్టీకి వచ్చిన ఓటింగ్‌లో మనం చూడొచ్చు అంటూ జసింటా ప్రైస్ అన్నారు. జసింటా ఫ్రైస్ వ్యాఖ్యలను ఆమె సొంత పార్టీ కూడా ఖండించింది.

ఆస్ట్రేలియా వలసదారులకు వ్యతిరేకంగా స్థానికుల ఆందోళనలు ఉధృతం అవుతున్న నేపథ్యంలో న్యూసౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం పలు కమ్యూనిటీ గ్రూపులతో ఒక సమావేశం నిర్వహించింది. భారత వలసదారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

న్యూసౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్ మాట్లాడుతూ.. గత కొన్ని వారాలుగా మనం చూస్తున్న జాతి వివక్ష, విభజన భావన కలిగించే అసత్య ఆరోపణలకు మన రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ చోటు లేదు’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఆస్ట్రేలియా వలసదారులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అక్కడి పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తోంది. ఎప్పటికప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది.