Tourist Bus Crashes: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు.
బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
పర్యాటకుల్లో ఎక్కువ మంది భారత్, చైనా, ఫిలిప్పీన్స్ కు చెందిన వారు ఉన్నారు.
పెంబ్రోక్ దగ్గర ఇంటర్ స్టేట్ 90 పై టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈస్ట్ ఆఫ్ బఫెలోకి 40 కిలోమీటర్ల దూరంలో ఇది జరిగింది. పర్యాటకులు ప్రముఖ నయాగరా ఫాల్స్ ను చూసేందుకు వెళ్లారు. తిరిగి న్యూయార్క్ కు వస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది.
డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని అధికారులు తెలిపారు.
ప్రమాదానికి గురైన బస్సులో మొత్తం 54 మంది ఉన్నారు. వారిలో 52 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు.
క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యల కోసం నాలుగు హెలికాప్టర్లను వినియోగించారు.
Also Read: భారత్ సంచలన నిర్ణయం.. అమెరికాకు ఆ సర్వీసులు సస్పెండ్..
అమెరికా-కెనడా సరిహద్దులోని ప్రధాన పర్యాటక కేంద్రమైన నయాగరా జలపాతం నుండి దాదాపు 40 మైళ్ల దూరంలో వాహనం నియంత్రణ కోల్పోయి బోల్తా పడడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారు.
”వాహనంలో ఉన్న 52 మందిలో ఎక్కువ మంది భారత్, చైనా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. కొందరు వాహనం నుండి విసిరివేయబడ్డారు. మరికొందరు చాలా గంటలపాటు లోపల చిక్కుకున్నారు. చాలా మంది సీటు బెల్టులు ధరించ లేదు. బఫెలో నగరానికి తూర్పున 30 మైళ్ళ దూరంలో ఉన్న పెంబ్రోక్ పట్టణానికి సమీపంలో ఉన్న ప్రమాద స్థలానికి అంబులెన్స్‌లు, వైద్య హెలికాప్టర్లను పంపారు. ప్రమాదంపై దర్యాఫ్తు జరుగుతోంది. ప్రమాదానికి గల కారణం ఏంటో తెలుసుకుంటాం. బస్సు తూర్పు వైపు వెళుతుండగా నియంత్రణ కోల్పోయింది. ఆ తర్వాత గుంతలోకి దూసుకెళ్లింది” అని అధికారులు వెల్లడించారు.
ప్రయాణికుల్లో పిల్లలు, వృద్ధులు ఉన్నారు. స్థానిక ఆసుపత్రిలో 24 మంది రోగులను చేర్చారు. వారు పూర్తిగా కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. 16 ఏళ్లలోపు ప్రాణాలతో బయటపడిన వారిని పిల్లల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.