×
Ad

Pakistan: పాకిస్థాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో విషాదం.. కాల్పుల మోత.. ముగ్గురు మృతి.. 60మందికిపైగా గాయాలు..

పాకిస్థాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుల సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. కరాచీ నగరంలో అనేక చోట్ల గన్‌ఫైర్ తో వేడుకలు చేసుకున్నారు.

Pakistan Independence Day Celebrations

Pakistan: పాకిస్థాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల (Pakistan Independence Day Celebrations) సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. కరాచీ (Karachi) నగరంలో అనేక చోట్ల గన్‌ఫైర్ (gunfire)తో వేడుకలు చేసుకున్నారు. ఈ ఘటనల్లో ఒక వృద్ధుడు, ఎనిమిదేళ్ల బాలిక సహా ముగ్గురు మరణించారు. మరో 64మందికిపైగా గాయపడ్డారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పాకిస్థాన్ మీడియా పేర్కొంది.

పాకిస్థాన్ మీడియా కథనం ప్రకారం.. లియాఖతాబాద్, కోరంగి, లియారి, మహమూదాబాద్, అక్తర్ కాలనీ, జాక్సన్, బాల్డియా, ఓరంగి టౌన్, పపోష నగర్, షరీఫాబాద్, నార్త్ నజీమాబాద్, సుర్జాని టౌన్, జమాన్ టౌన్ తదితర ప్రాంతాల్లో కాల్పులు ఘటనలు చోటు చేసుకున్నాయి. అజీజాబాద్‌లో ఓ యువతిపై కాల్పులు జరగ్గా.. కోరంగిలో స్టీఫెన్ అనే వ్యక్తి మరణించాడు. నగరం అంతటా జరిగిన ఈ సంఘటనల్లో దాదాపు 64 మంది గాయపడ్డారు.

స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా జరిగిన కాల్పుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. పాక్ అధికారులు ఈ సంఘటనలను ఖండించారు. వీటిని నిర్లక్ష్యం, భయభ్రాంతులకు గురిచేసే చర్యలుగా అభివర్ణించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని సురక్షితమైన రీతిలో జరుపుకోవాలని పౌరులను కోరారు.

అయితే, ఈ ఘటనలపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కాల్పులకు సంబంధించిన ఇప్పటి వరకు 20 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు నుంచి అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

పాకిస్థాన్‌లో ఈరోజు అంటే ఆగస్టు 14న 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే, పాకిస్థాన్ లో వివిధ వేడుకల సందర్భంగా తుపాకులు చేతపట్టి, గాల్లోకి కాల్పులు జరుపుతూ వీరంగం సృష్టించే ఘటనలు సర్వసాధారణం. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చోటు చేసుకున్న తుపాకీ కాల్పుల్లో దాదాపు 95 మందికి గాయాలయ్యాయి. అంతకుముందు సంవత్సరం 80మందికి తీవ్ర గాయాలయ్యాయి.