24 గంటల్లో.. భారత్‌పై టారిఫ్ రేట్లను మరింత పెంచుతా.. ఎందుకంటే?: మరో బాంబ్ వేసిన డొనాల్డ్ ట్రంప్

“భారత్ సరైన ట్రేడింగ్ పార్ట్‌నర్ కాదు. వాళ్లు మనతో ఎక్కువగా బిజినెస్ చేస్తున్నారు. కానీ మనం వాళ్లతో చేయడం లేదు. అందుకే 25 శాతంపై సెటిల్ అయ్యాం కానీ, ఇప్పుడు అది చాలా భారీగా పెంచనున్నాను" అని అన్నారు.

Donald Trump and Modi

భారత్‌పై టారిఫ్ రేట్లను మరింత పెంచుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. మంగళవారం సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ సరైన ట్రేడింగ్ పార్ట్‌నర్ కాదని అన్నారు. భారత్‌పై టారిఫ్‌లు వచ్చే 24 గంటల్లో పెంచుతానని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే భారత్‌పై అమెరికా 25 శాతం టారిఫ్ రేటు విధించింది. ఇది ఆగస్ట్ 7 నుంచే అమల్లోకి రావాల్సి ఉంది.

“భారత్ సరైన ట్రేడింగ్ పార్ట్‌నర్ కాదు. వాళ్లు మనతో ఎక్కువగా బిజినెస్ చేస్తున్నారు. కానీ మనం వాళ్లతో చేయడం లేదు. అందుకే 25 శాతంపై సెటిల్ అయ్యాం కానీ, ఇప్పుడు అది చాలా భారీగా పెంచనున్నాను. ఎందుకంటే వాళ్లు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. యుక్రెయిన్‌లో యుద్ధం కొనసాగేలా ఆజ్యం పోస్తున్నారు” అని ట్రంప్ ఇంటర్వ్యూలో అన్నారు. భారత్ అత్యధిక టారిఫ్‌లు విధిస్తుంటుందని చెప్పారు.

ట్రంప్ సోమవారం కూడా ట్రూత్ సోషల్‌లో ఓ పోస్ట్ చేశారు. “రష్యా నుంచి భారత్ భారీగా ఆయిల్ కొనుగోలు చేస్తోంది, అంతేగాక కొంత ఆయిల్ ఓపెన్ మార్కెట్‌లో ఎక్కువ లాభాల కోసం అమ్ముతోంది. యుక్రెయిన్‌లో ఎంతమంది చనిపోతున్నారో పట్టించుకోవడం లేదు. అందుకే భారత్ అమెరికాకు చెల్లించే టారిఫ్‌ను భారీగా పెంచనున్నాను” అని చెప్పారు.

కొన్ని రోజుల క్రితమే ట్రంప్ అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్ సమీపంలో ఉందని చెప్పారు. కానీ అగ్రికల్చర్, డైరీ, జీఎం పంటల విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి.

టారిఫ్‌లపై భారత్ స్పందిస్తూ.. ప్రస్తుత గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా దేశ ప్రజలకు చౌకగా, స్థిరంగా ఎనర్జీ అందించడమే లక్ష్యంగా తమ ఎనర్జీ ప్రొక్యూర్మెంట్ జరుగుతోందని తెలిపింది. విమర్శలు చేసే దేశాలే రష్యాతో ట్రేడ్ కొనసాగిస్తున్నాయని, కానీ భారత్ విషయంలో ఇది జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా, రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ దిగుమతులు కొనసాగుతున్నాయి.