×
Ad

ట్రంప్ గోల్డ్ కార్డ్‌తో రూ.9 కోట్లు పెడితే గ్రీన్ కార్డు వచ్చేస్తుందా?

అమెరికాలో ఉన్న రకరకాల వీసాల్లో EB5 అనేది ఒక రకం వీసా. ఇది వ్యాపారుల కోసం తెచ్చింది. అమెరికాలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారి కోసం తెచ్చింది.

Trump Gold Card: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ఓ స్కీమ్ తెచ్చారు. అమెరికాలకి డబ్బున్న వాళ్లను ఆహ్వానించడానికి తీసుకొచ్చిందే ఈ కొత్త స్కీమ్. దీనికి ట్రంప్ గోల్డ్ కార్డు అని పేరు పెట్టారు. అంటే ఇప్పుడున్న వీసాలకు కొత్తగా మరో వీసా అన్నమాట. దీనికి 1 మిలియన్ డాలర్లు కట్టాలి. అంటే మన భారత కరెన్సీలో సుమారు 9 కోట్లు కట్టాలి. కానీ, 9 కోట్లు కడితే అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చేస్తుందా అంటే రాదు. అసలు ఈ గ్రీన్ కార్డు వల్ల ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం.

అమెరికాలో ఉన్న రకరకాల వీసాల్లో EB5 అనేది ఒక రకం వీసా. ఇది వ్యాపారుల కోసం తెచ్చింది. అమెరికాలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారి కోసం తెచ్చింది. దీని ద్వారా విదేశీయులు సుమారు 8,00,000 డాలర్లు చెల్లించి అమెరికాలో వ్యాపారం పెట్టవచ్చు. అయితే, మనకు నచ్చిన వ్యాపారం పెట్టడానికి వీల్లేదు. అమెరికాలో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది దాని పేరు TEA.

అంటే టార్గెట్ ఎంప్లాయిమెంట్ ఏరియా. అమెరికాలోని మారుమూల పల్లెలు కావొచ్చు. కొన్ని దూర ప్రాంతాలు కావొచ్చు.. అక్కడ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందు రాకపోతే, అక్కడ ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి ఉద్యోగ, ఉపాధి కల్పన చేయడం కష్టం అవుతుందని ప్రభుత్వం భావిస్తే అక్కడ విదేశీయుల ద్వారా ఈ EB5 వీసాలు ఇచ్చి పెట్టుబడులు పెట్టిస్తారు.

ఇఫ్పుడు తీసుకొచ్చిన గోల్డ్ కార్డు వీసా అనేది దానికి ఓ రకంగా ప్రత్యామ్నాయం. EB5 వీసాకి 800000 డాలర్లు అయితే, దీనికి 10,00,000 డాలర్లు కట్టాలి. దీనికి అదనంగా వెరిఫికేషన్ ఫీజు పేరుతో మరో 15000 డాలర్లు కట్టాలి. అంటే సుమారు 13 లక్షలు కేవలం వెరిఫికేషన్ కోసం చెల్లించాలి. మొత్తం కలిపి 10 కోట్లు అవుతుంది. ఈ 10 కోట్లు పెడితే వీసా వచ్చేస్తుందా అంటే కన్ ఫాం కాదు.

పైన చెప్పిన TEA కేటగిరీలో మనం ఏదైనా కొత్త వ్యాపారం పెట్టడానికి ప్రాజెక్టు సిద్ధం చేసుకోవాలి. అది పనికొస్తుందనుకుంటే అక్కడ వారికి ఉపాధి లభిస్తుందనుకుంటే అప్పుడు అమెరికా ప్రభుత్వం ఈ గోల్డ్ కార్డు వీసా ఇస్తుంది.

గోల్డ్ కార్డు వీసా వచ్చిన తర్వాత అక్కడ పెట్టుబడి మళ్లీ అదనం. ఈ 10 కోట్లు జస్ట్ అక్కడికి వెళ్లడానికి. అక్కడ బిజినెస్ పెట్టడానికి ఇంకా డబ్బులు సిద్ధం చేసుకోవాలి. అది కూడా కంప్లీట్ గా వైట్ మనీ అవ్వాలి. దానికి లెక్కలు చూపించాలి. గోల్డ్ కార్డు వీసా వచ్చిందంటే వెంటనే గ్రీన్ కార్డు వచ్చినట్టు కాదు.

గ్రీన్ కార్డు కోసం ప్రాసెస్ చేసే ఇతర వీసాల కంటే ఇది కొంచెం ఫాస్ట్ ట్రాక్ లో అవుతుంది. అది సుమారు 6 నెలలు కావొచ్చు. ఏడాది కావొచ్చు. ఇప్పుడు H1b ద్వారా వెళ్లిన వాళ్లు గ్రీన్ కార్డు అప్లై చేసుకుంటే అది ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేం. ఇండియా, చైనా, మెక్సికో లాంటి దేశాల నుంచి హైడిమాండ్ ఉంది. ఇప్పుడు అప్లై చేస్తే ఏ వందేళ్లకో వాళ్ల నెంబర్ రావొచ్చు.

ఈ పది కోట్లు కడితే లైన్లో మన ఫైల్ ముందుకు వస్తుంది. అయితే, అక్కడ మళ్లీ షరతులు వర్తిస్తాయి. అమెరికా హోంలాండ్ విభాగం విధించే రూల్స్ కి లోబడే ఉండాలి. అవన్నీ ప్రాపర్ గా ఉంటే ప్రాసెస్ త్వరగా అవుతుంది. ఒకవేళ అందులో తేడా వస్తే మనం కట్టిన రూ.10 కోట్లు గంగలో పోసినట్టే. మళ్లీ వెనక్కి పంపించినా పంపేయొచ్చు. కాబట్టి రూ.10కోట్లు పెడితే గ్రీన్ కార్డు వచ్చేసినట్టు కాదు.