Donald Trump : భారత్‌కు బిగ్ షాకిచ్చేందుకు సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్.. మళ్లీ టారిఫ్ కొరడా..!
Donald Trump : అమెరికా భారతదేశ దిగుమతులపై 12.5శాతం అదనపు సుంకాన్ని ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని, ఇంకా ఖరారు కాలేదని కేంద్ర పేర్కొంది.
- Harish Thanniru
- Published on- June 4, 2026 / 10:26 AM IST
Donald Trump
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఒకవైపు న్యూఢిల్లీలో అమెరికా – భారత్ వాణిజ్య చర్చలు జరుగుతుండగా.. మరోవైపు అమెరికా భారతదేశ దిగుమతులపై 12.5శాతం అదనపు సుంకాన్ని ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని, ఇంకా ఖరారు కాలేదని కేంద్ర పేర్కొంది. అమెరికా ప్రభుత్వం తాజా చర్య కారణంగా న్యూఢిల్లీలో జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను క్లిష్టతరం చేసే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
తాజా పరిణామాలపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. అమెరికాలో భారతదేశం దిగుమతులపై ప్రతిపాదిత సుంకాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ చర్యపై నిర్ణయం తీసుకునే ముందు యూఎస్‌టీఆర్ ఆయా దేశాల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటుందని పేర్కొంది. సెక్షన్ 301 విచారణలో భాగంగా ఈ విషయంపై భారత్ అమెరికాతో సంప్రదింపులు కొనసాగిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొంది. వెట్టిచాకిరి కార్మిక దిగుమతులపై నిషేధం లేని 54 ఆర్థిక వ్యవస్థల జాబితాలో అమెరికా భారత్ ను కూడా చేర్చింది. అందువల్ల ప్రతిపాదత 12.5శాతం అధిక సుంకాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇండియాతోపాటు 60దేశాలపై కూడా సుంకాల విధింపు ప్రతిపాదన ఉంది.
సెక్షన్ 301 అనేది అమెరికా వాణిజ్య చట్టంలోని ఒక నిబంధన. దీని ద్వారా అమెరికా ప్రభుత్వం ఇతర దేశాల వాణిజ్య విధానాలు అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాయా లేదా అనేది విచారించి, అవసరమైతే అదనపు సుంకాలు, ఇతర ఆంక్షలు విధించవచ్చు. నిజంగా ఈ సుంకాలు అమల్లోకి వస్తే.. భారత ఎగుమతులపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అల్యూమినియం, పత్తి, సముద్ర ఆహార ఉత్పత్తులు, కాఫీ, బియ్యం వంటి రంగాలకు అమెరికా మార్కెట్లో పోటీ తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
