×
Ad

మూడో ప్రపంచ దేశాల ప్రజలు అమెరికాకు రావద్దని బాంబ్ పేల్చిన ట్రంప్.. థర్డ్‌ వరల్డ్‌ దేశాలు అంటే? అందులో ఇండియా?

సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత ‘థర్డ్‌ వరల్డ్‌’ పదం వాడుకలో అంతగా లేదు. ఇప్పుడు ఆ పదానికి స్పష్టమైన నిర్వచనం లేదు.

US President Donald Trump

Trump’s migration pause: వైట్‌హౌస్‌ సమీపంలో ఇద్దరు నేషనల్‌ గార్డ్‌ల మృతికి దారి తీసిన కాల్పుల ఘటన తర్వాత “థర్డ్‌ వరల్డ్‌ దేశాల” నుంచి వలసలను నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కాల్పల ఘటనను అమెరికా “ఉగ్ర చర్య”గా పేర్కొంది. దాడిచేసిన వ్యక్తి అఫ్ఘాన్‌ జాతీయుడని తేలడంతో ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

“అమెరికా వ్యవస్థ పూర్తిగా కోలుకునే వరకు అన్ని థర్డ్‌ వరల్డ్‌ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా ఆపుతాను. పరిస్థితిని పూర్తిగా సరిచేయడానికి ఉన్న ఏకైక మార్గం రివర్స్‌ మైగ్రేషన్‌ మాత్రమే” అని ట్రంప్‌ చెప్పారు. (Trump’s migration pause)

అయితే ట్రంప్‌ “థర్డ్‌ వరల్డ్‌ దేశాలు”గా ఏ దేశాలను సూచిస్తున్నారో వివరించలేదు. ఈ పదాన్ని కోల్డ్‌ వార్‌ కాలంలో వాడారు. ప్రస్తుత కాలంలో పేదరికం ఎక్కువగా ఉన్న దేశాలను సూచించడానికి కొందరు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు.

యూఎస్‌ ఇమిగ్రేషన్‌ విభాగం ప్రకారం ‘థర్డ్‌ వరల్డ్‌ దేశాలు’ అనే పదానికి నిర్వచనం ఏదీ లేదు. మరి ఏయే దేశాలు ట్రంప్‌ చర్యలకు ప్రభావితమవుతాయన్న చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోంది.

Also Read: Amaravati: చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ.. సెకండ్ పేజ్ ల్యాండ్ పూలింగ్‌కు ఆమోదం తెలపనున్న క్యాబినెట్

థర్డ్‌ వరల్డ్‌ దేశాలు అంటే ఏమిటి?
ఈ పదం ఎలా వచ్చిందో స్పష్టంగా తెలియకపోయినా, 1952లో అల్ఫ్రెడ్‌ సావీ రాసిన ‘త్రీ వరల్డ్స్‌, వన్‌ ప్లానెట్‌’ వ్యాసంలో మొదట కనబడిందని చరిత్రకారులు చెబుతున్నారు. కోల్డ్‌ వార్‌లో దేశాలను మూడు వర్గాలుగా విడదీయడానికి ఈ భావన వచ్చింది. అయితే, అప్పట్లో ఈ పదం వచ్చినది ధనిక దేశం, పేద దేశం అనే అర్థంలో కాదు.

కోల్డ్‌ వార్‌ కాలంలో దేశాలను మూడు వర్గాలుగా విభజించారు. ఫస్ట్‌ వరల్డ్‌ దేశాలు, సెకండ్‌ వరల్డ్‌ దేశాలు, థర్డ్‌ వరల్డ్‌ దేశాలు.

ఫస్ట్‌ వరల్డ్‌ దేశాల్లో, అమెరికా, వెస్ట్రన్‌ యూరప్‌, మిత్రదేశాలు (క్యాపిటలిస్ట్‌ బ్లాక్‌) ఉన్నాయి. ఇవి మూలధన ఆర్థిక వ్యవస్థను అనుసరించిన దేశాలు.

సెకండ్‌ వరల్డ్‌ దేశాల్లో సోవియట్‌ యూనియన్‌, చైనా, ఈస్ట్రన్‌ బ్లాక్‌ (కమ్యూనిస్ట్‌ బ్లాక్‌) ఉన్నాయి. ఇవి ప్రభుత్వ నియంత్రణలో నడిచే కమ్యూనిస్టు వ్యవస్థ ఉన్న దేశాలు.

థర్డ్‌ వరల్డ్‌ దేశాలు అంటే ఏ బ్లాక్‌లోనూ లేని దేశాలు (ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా). అందువల్ల “థర్డ్‌ వరల్డ్‌” అనే పదాన్ని మొదట పేద దేశాలు అనే అర్థంలో వాడలేదు.

ప్రస్తుతం థర్డ్‌ వరల్డ్‌ దేశాలు అంటే?
సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత ‘థర్డ్‌ వరల్డ్‌’ పదం వాడుకలో అంతగా లేదు. ఇప్పుడు ఆ పదానికి స్పష్టమైన నిర్వచనం లేదు. ప్రస్తుత కాలంలో ఆర్థికంగా వెనుకబడిన దేశాలను సూచించడానికి కొందరు ఉపయోగిస్తున్నారు. యునైటెడ్‌ నేషన్స్‌ వీటిని లీస్ట్‌ డెవలప్డ్‌ కంట్రీస్‌ లేదా ఎల్‌డీసీగా వర్గీకరిస్తుంది.

ప్రస్తుతం యూఎన్‌ ఎల్‌డీసీ జాబితాలో 44 దేశాలు ఉన్నాయి. అందులో 32 ఆఫ్రికా, 8 ఆసియా (అఫ్ఘాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌ సహా), కరేబియన్‌లో హైతీ, పసిఫిక్‌లో సోలమన్‌ ఐలాండ్స్‌, కిరిబాటి, తువాలు ఉన్నాయి.

ఇండియా స్థానం?
ట్రంప్‌ ఏ దేశాలను సూచిస్తున్నారో చెప్పలేదు. కాబట్టి అంచనాలు వేయడం సరైంది కాదు. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు, లో ఇన్కమ్‌ దేశాలు, లోయర్‌ మిడిల్‌ ఇన్కమ్‌ దేశాలు వంటి పదాలను వాడుతున్నారు.

ప్రస్తుతం ఇండియా అభివృద్ధి చెందుతన్న దేశాల జాబితాలో ఉంది. భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎకానమీగా ఉంది. ఇటీవల జపాన్‌ను దాటేసింది.