ఇరాన్‌కు నో ఎంట్రీ అంటోన్న టర్కీ, జోర్డాన్, అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్

ఇరాన్ నుంచి రాకపోకలు నిలిపివేస్తూ టర్కీ ఆదివారం సరిహద్దులు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జోర్డాన్, పాకిస్తాన్‌లు ఇప్పటికే రాకపోకలు నిలిపేశాయి. మరోవైపు ఇరాన్‌కు విమాన సర్వీసులు రద్దు చేసేసింది అఫ్ఘనిస్తాన్. ఇన్ఫెక్షన్ సోకకుండా తమ ప్రజలను కాపాడుకోవడానికి తాత్కాలికంగా మూసివేస్తున్నామని అన్ని దేశాలు ముక్త కంఠంతో సమాధానమిస్తున్నాయి. 

‘ఇరాన్‌లో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నందున తాత్కాలికంగా దేశ సరిహద్దులని మూసివేయాలని అనుకుంటున్నాం’ అని టర్కీ ఆరోగ్య మంత్రి అన్నారు. రోడ్డు మార్గాలతో పాటు రైల్వే బోర్డర్లు కూడా ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుంచి మూసివేశారు. ఇరాన్ నుంచి టర్కీకి వెళ్లే విమాన సర్వీసులను రాత్రి 8గంటలకే ఆపేశారు. ఇరాన్‌కు వెళ్లే వాళ్లకు మాత్రం అభ్యంతరాలేమీ లేకుండా వెళ్లవచ్చు. 

కరోనా వైరస్ కేసులు నమోదు కాని దేశాలతోనే సంబంధాలు కొనసాగిస్తాం. ముందు జాగ్రత్త కోసమే కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడుకోవాలని అఫ్ఘనిస్తాన్ అన్ని సర్వీసులను రద్దు చేస్తుంది. ఇరాన్ నుంచి రోడ్డు, విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. అని అఫ్ఘన్ ప్రభుత్వం ప్రకటించింది. 

ఆదివారం నాటికి ఇరాన్‌లో 8మంది కరోనా కారణంగా మృతి చెందినట్లు తెలిసింది. చైనా తర్వాత ఎక్కువ మరణాలు నమోదైన ఇరాన్ చూసి పక్క దేశాలు భయపడుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమీనీ విదేశీ మీడియా కావాలనే ఇదంతా పుట్టిస్తుందని ఆరోపించారు.