Suicide Blasts in Pakistan: బాంబు పేలుళ్లతో వణికిపోయిన పాకిస్థాన్.. గంటల వ్యవధిలో రెండు ఆత్మాహుతి దాడులు, 60 మంది మృతి

అల్ఫాలా రోడ్‌లోని మదీనా మసీదు సమీపంలో మిలాద్ ఉన్-నబీ ఊరేగింపు కోసం ప్రజలు గుమిగూడుతుండగా పేలుడు సంభవించిందని మస్తుంగ్ అదనపు కమిషనర్ అతా-ఉల్-మునీమ్ డాన్‌కు తెలిపారు.

Suicide Blasts in Pakistan: పాకిస్థాన్‌లో శుక్రవారం జరిగిన రెండు ఆత్మాహుతి బాంబు పేలుళ్లలో కనీసం 60 మంది మరణించగా, 102 మంది గాయపడ్డారు. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని మస్తుంగ్ ప్రాంతంలో మొదటి పేలుడు జరిగింది. ఇందులో 52 మంది మరణించగా, డజన్ల కొద్దీ గాయపడ్డారు. అదే సమయంలో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని హంగు మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో రెండో పేలుడు సంభవించింది. డాన్ నివేదిక ప్రకారం, ఈ పేలుడు కారణంగా నలుగరు మరణించారు. 12 మంది గాయపడ్డారు.

నివేదిక ప్రకారం, పేలుడు సమయంలో మసీదులో 30 నుంచి 40 మంది ప్రార్థనలు చేస్తున్నారు. హంగు జిల్లా పోలీసు అధికారి నిసార్ అహ్మద్ ప్రాణనష్టం, గాయాలను ధృవీకరించారు. మసీదులో శుక్రవారం ఉపన్యాసం జరుగుతుండగా పేలుడు సంభవించిందని ఆయన తెలిపారు. పేలుడు కారణంగా మసీదు పైకప్పు కూలిపోయిందని, దాదాపు 30 నుంచి 40 మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని ఓ అధికారి తెలిపారు. మృతదేహాలను, క్షతగాత్రులను శిథిలాల నుంచి బయటకు తీసేందుకు భారీ యంత్రాంగాన్ని రప్పించామని అధికారి తెలిపారు.

బలూచిస్థాన్ బాంబు పేలుళ్లలో 52 మంది చనిపోయారు
అంతకుముందు, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని మసీదు సమీపంలో జరిగిన ఆత్మాహుతి పేలుడులో కనీసం 52 మంది మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. పేలుడుకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. ఇది ఆత్మాహుతి పేలుడు అని తెలిపారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో పేలుడు సంభవించిందని ఆయన చెప్పారు.

మదీనా మసీదు దగ్గర దాడి
అల్ఫాలా రోడ్‌లోని మదీనా మసీదు సమీపంలో మిలాద్ ఉన్-నబీ ఊరేగింపు కోసం ప్రజలు గుమిగూడుతుండగా పేలుడు సంభవించిందని మస్తుంగ్ అదనపు కమిషనర్ అతా-ఉల్-మునీమ్ డాన్‌కు తెలిపారు. అమరవీరుడు నవాబ్ గౌస్ బక్ష్ రైసాని మెమోరియల్ హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, డాక్టర్ సయీద్ మిర్వానీ మాట్లాడుతూ.. డజన్ల కొద్దీ ప్రజలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, 20 మందికి పైగా గాయపడిన వారిని క్వెట్టాకు రిఫర్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. అదే సమయంలో, పాకిస్తాన్ తాలిబాన్ సంస్థ తమకు సంబంధం లేదని ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు