×
Ad

Needle Free Vaccine: యా హూ.. నాసల్ స్ప్రే ఫ్లూ వ్యాక్సిన్‌ వచ్చేసింది..! ఇక సూది నొప్పి భయమే ఉండదు..

దేశంలో మొట్టమొదటి సూది రహిత ఇన్ ఫ్లూఎంజా వ్యాక్సిన్‌ నాసల్ స్ప్రే రూపంలో ప్రవేశపెట్టింది. ఈ నొప్పి లేని..

Needle Free Vaccine: సూదులు అంటే భయపడే వాళ్లు చాలా మందే ఉంటారు. పిల్లలే కాదు పెద్దలు కూడా సూది మందు అంటే హడలిపోతారు. ఇంజెక్షన్ వేయించుకోవడానికి భయపడతారు. ఇంజెక్షన్ వల్ల కలిగే నొప్పే అందుకు కారణం. అందుకే, సూది మందు అంటే పిల్లలు నానా యాగీ చేస్తారు. అయితే, ఇకపై ఆ బాధ లేదు. సూదులు అంటే భయపడే వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

సూది రహిత నాసల్ స్ప్రే ఫ్లూ వ్యాక్సిన్ వచ్చేసింది. యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MOHAP) దేశంలో మొట్టమొదటి ఇన్ ఫ్లూయంజా వ్యాక్సిన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇది నీడిల్ ఫ్రీ నాసల్ స్ప్రే ఫ్లూ వ్యాక్సిన్. ఇది సురక్షితమైన సులభమైన రోగనిరోధకత ఎంపికలను విస్తరించడంలో ఒక ప్రధాన ముందడుగు. ఈ కొత్త సూది రహిత వ్యాక్సిన్.. ప్రత్యేకంగా 2 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సు గల వారి కోసం తీసుకొచ్చింది. ఇది సాంప్రదాయ ఫ్లూ షాట్‌కు క్విక్(త్వరిత), నొప్పి లేని ప్రత్యామ్నాయం.

”యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలో మొట్టమొదటి సూది రహిత ఇన్ ఫ్లూఎంజా వ్యాక్సిన్‌ నాసల్ స్ప్రే రూపంలో ప్రవేశపెట్టింది. ఈ నొప్పి లేని ఎంపిక ఇప్పుడు 2 నుండి 49 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యవంతులైన వారికి అందుబాటులో ఉంది. ఇది సాంప్రదాయ ఫ్లూ షాట్‌లకు అనుకూలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది” అని అధికారులు తెలిపారు.

UAE కొత్త నాసల్ స్ప్రే ఫ్లూ వ్యాక్సిన్..

ప్రతి ఏటా అక్కడ ఫ్లూ మందు ఇస్తారు. ఇప్పుడు తీసుకొచ్చిన సూది రహిత వ్యాక్సిన్ తో లక్షలాది మంది పౌరులకు సులభంగా, వేగంగా వ్యాక్సిన్ ఇచ్చే వెసులుబాటు వచ్చింది. ఇలాంటి వ్యాక్సిన్ ను తయారు చేసి ఆమోదించిన తొలి దేశం ఇదే.

సురక్షితమైన రోగనిరోధకత ఆప్షన్స్ విస్తరించడానికి, మొత్తం టీకా కవరేజీని పెంచడానికి, కాలానుగుణ వైరస్‌లకు వ్యతిరేకంగా రక్షణను బలోపేతం చేయడానికి UAE చేపట్టిన వ్యూహాత్మక ప్రయత్నంలో ఈ అభివృద్ధి ఒక భాగం. వాణిజ్యపరంగా ఫ్లూమిస్ట్ క్వాడ్రివలెంట్ (లేదా లైవ్ అటెన్యూయేటెడ్ ఇన్ ఫ్లూయంజా వ్యాక్సిన్ – LAIV) అని పిలువబడే వ్యాక్సిన్ ను గేమ్ ఛేంజర్ గా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా ఇంజెక్షన్లు అంటే భయం ఉన్న పిల్లలు, పెద్దలకు.

ఈ టీకాతో ముక్కు రంధ్రాల్లోకి సులభంగా మందు పంపించొచ్చు. కొత్త నాసల్ స్ప్రే ప్రత్యేకంగా పరిమిత వయసు పరిధిలోని ఆరోగ్యకరమైన వ్యక్తుల కోసం ఆమోదించబడింది. 2 నుండి 17 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యకరమైన పిల్లలు మాత్రమే దీనికి అర్హులు. 18 నుండి 49 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యకరమైన పెద్దలు అర్హులు.

నాసల్ స్ప్రే ప్రాథమిక లక్ష్యం నొప్పి లేని ప్రత్యామ్నాయాన్ని అందించడం. తొమ్మిది అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న చాలా మందికి ఇది ప్రతి ఫ్లూ సీజన్‌కు ఒకే మోతాదులో (రెండు స్ప్రేలు) ఇవ్వబడుతుంది. ఇంతకు ముందు ఎప్పుడూ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోని 2 నుండి 8 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కనీసం ఒక నెల వ్యవధిలో రెండు మోతాదులు అవసరం కావొచ్చు.

కాగా, ఇది అందరికీ తగినది కాదని ఆరోగ్య అధికారులు తెలిపారు.

* 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు అనర్హులు. వారికి శ్వాసలో గురక లేదా శ్వాసకోశ ఇబ్బంది వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
* 50 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సున్న పెద్దలు అనర్హులు.
* గర్భిణులు ఈ మందు తీసుకోవడానికి అనర్హులు.
* రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు. (హెచ్ఐవీ, క్యాన్సర్, కీమోథెరపీ తీసుకుంటున్న వారు).
* తీవ్రమైన ఆస్తమాతో బాధపడే వారికి ఈ స్ప్రే ఇవ్వరు.
* రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న వారు ఇంజెక్షన్ వ్యాక్సిన్‌ను ఉపయోగించడం ఉత్తమం.
* గుడ్లు, జెలటిన్, జెంటామిసిన్, అర్జినిన్ లేదా ఏదైనా ఇతర టీకా తీసుకుంటే తీవ్రమైన అలర్జీ ఉన్న ఎవరైనా.. లేదా గతంలో తీసుకున్న ఫ్లూ టీకాకు తీవ్రమైన అలర్జీ కలిగి ఉన్న వారు ఈ నాసల్ స్ప్రేను పొందకూడదు.
* ఆస్ప్రిన్ లేదా సాలిసైలేట్ కలిగిన మందులు తీసుకుంటున్న పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు (2-17 సంవత్సరాలు) ఈ నాసల్ స్ప్రేను నివారించాలి.
* నాసల్ స్ప్రే వ్యాక్సిన్ ఇప్పుడు UAE అంతటా ఎంపిక చేసిన ప్రభుత్వ ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉంది.

Also Read: టిక్‌టాక్ స్టార్ దారుణ హత్య..! షాక్‌లో అభిమానులు.. పోలీసుల అదుపులో బాయ్ ఫ్రెండ్..