Uber CEO
Uber CEO: ఉబర్ సీఈవో (Uber CEO) దారా ఖోస్రోషాహి (Dara Khosrowshahi) తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. కరోనా సమయంలో డ్రైవర్లు పడుతున్న కష్టాలను అర్థం చేసుకోవడానికి తాను ఉబర్ డ్రైవర్ గా కొన్ని నెలల పాటు పనిచేశారని చెప్పారు. ఆ అనుభవం ఎంతగానో ఉపయోగపడిందని, కంపెనీ విషయంలో తమ ఆలోచనా తీరును పున:పరిశీలించేలా చేసిందని తెలిపారు.
దీంతో తమ యాప్ లో పలు ముఖ్యమైన మార్పులను చేశామని చెప్పారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొలో తాను డ్రైవర్ గా పనిచేశానని వివరించారు. ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డానని అన్నారు. తాను డ్రైవర్ గా పనిచేస్తున్న సమయంలో రైడ్లను తిరస్కరించిన కారణంగా జరిమానా కట్టాల్సి వచ్చిందని చెప్పారు. ముందుగా కస్టమర్లు టిప్ ఎక్కువ ఇస్తామని చెప్పి, ఆ తర్వాత తగ్గించి ఇవ్వడం వంటి సమస్యలు తనకూ ఎదురయ్యాయని తెలిపారు.
దానితో పాటు డ్రైవర్లు ఎదుర్కొనే మరికొన్ని సవాళ్ల గురించి కూడా తెలుసుకున్నానని చెప్పారు. అంతేగాక, తోటి ఉబర్ డ్రైవర్లు (Uber Drivers)దురుసుగా ప్రవర్తించడం వంటి సమస్యలూ ఎదుర్కొన్నానని తెలిపారు. లాభాల నుంచి తమకు ఇచ్చే మొత్తాన్ని పెంచాలంటూ కొన్నాళ్ల నుంచి ఉబర్ సీఈవోపై పెట్టుబడిదారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు.
కరోనా తగ్గుముఖం పట్టాక 2021లో ఉబర్ డ్రైవర్ల కొరతను ఎదుర్కొంది. డ్రైవర్లకు బోనస్ ప్రయోజనాల కంటే ఇంకా ఎక్కువగా ఏదైనా చేయాలని ఉబర్ భావించింది. అందుకోసం అనేక మార్పులను తీసుకువచ్చింది. చివరకు 2022లో ఉబర్ షేర్-రైడ్ రెవెన్యూ రెండు రెట్లు పెరిగింది. అమెరికాలో 74 శాతం రైడ్-షేర్ మార్కెట్ ఉబర్ దే. 2020లో ఆ శాతం 62గా ఉండేది.