×
Ad

Andrew Mountbatten Windsor: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ సోదరుడు అరెస్ట్

ఆండ్రూ మౌంట్‌బాటన్-విండ్సర్‌తో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి జెఫ్రీ ఎప్ స్టీన్ ఒక మహిళను UKకి అక్రమంగా రవాణ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.

  • Published On : February 19, 2026 / 07:18 PM IST

Andrew Mountbatten Windsor Representative Image (Image Credit To Original Source)

  • బ్రిటన్ మాజీ ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్
  • ప్రభుత్వ కార్యాలయంలో తప్పుడు ప్రవర్తన కింద అరెస్ట్
  • జెఫ్రీ ఎప్ స్టీన్ కు కీలకమైన వాణిజ్య నివేదికలు పంపినట్లు ఆరోపణలు

Andrew Mountbatten Windsor: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III తమ్ముడు, బ్రిటన్ మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్‌బాటన్ విండ్సర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో దుష్ప్రవర్తనకు పాల్పడ్డారన్న అనుమానంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆండ్రూ గతంలో UK వాణిజ్య రాయబారిగా ఉన్నారు. ఈస్టర్న్ ఇంగ్లండ్ లోని ఆండ్రూ నివాసానికి 6 కార్లలో వచ్చిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో తప్పుడు ప్రవర్తన కింద అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అమెరికా లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్ స్టీన్ కు ఆండ్రూ కీలకమైన వాణిజ్య నివేదికలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఆండ్రూ అరెస్ట్ పై కింగ్ చార్లెస్ III ఒక ప్రకటన విడుదల చేశారు. తన తమ్ముడి అరెస్ట్ గురించి తెలిసి ఆందోళనకు గురయ్యాయని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోవాలని తేల్చి చెప్పారు.

ఆండ్రూ మౌంట్‌బాటన్-విండ్సర్‌తో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి జెఫ్రీ ఎప్ స్టీన్ ఒక మహిళను UKకి అక్రమంగా రవాణ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆండ్రూ UK వాణిజ్య రాయబారిగా పని చేస్తున్న సమయంలో సున్నితమైన సమాచారాన్ని ఎప్ స్టీన్ తో పంచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కాగా, తనపై వచ్చిన అన్ని ఆరోపణలను మాజీ యువరాజు ఆండ్రూ ఖండించారు. అందులో నిజం లేదన్నారు. ఎప్ స్టీన్ ఆరోపించబడిన ప్రవర్తనను తాను ఎప్పుడూ చూడలేదన్నారు.

”ఈ ఉదయం నార్ఫోక్‌లోని సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లో కింగ్ చార్లెస్ సోదరుడిని అరెస్ట్ చేశాం. మాజీ యువరాజు దివంగత లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్ స్టీన్‌తో రహస్య విషయాలను పంచుకున్నారనే ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నాం” అని థేమ్స్ వ్యాలీ పోలీసులు తెలిపారు. పుట్టిన రోజు నాడు ఆండ్రూ అరెస్ట్ కావడం గమనార్హం. ఆయనకు 66 ఏళ్లు నిండాయి. కాగా, ఎప్ స్టీన్ విషయానికి సంబంధించి తాను ఎటువంటి తప్పు చేయలేదని గతంలోనే ఆండ్రూ చెప్పారు. విండ్సర్ గ్రేట్ పార్క్‌లోని ఆండ్రూ పాత ఇంట్లో కూడా పోలీసులు సోదాలు జరిపారు. ఆండ్రూ ప్రస్తుతం పోలీసుల కస్టడీలోనే ఉన్నారు.

Also Read: ఇదేం సంస్కృతి? దేశం ఎటుపోతోంది? మేలుకోవాల్సిన సమయం వచ్చింది..! రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్