Ukraine President Volodymyr Zelenskyy'
Ukraine President Zelenskyy : కమెడియన్ కాదు.. ఖతర్నాక్..! అప్పుడు నవ్వించాడు.. ఇప్పుడు దేశాన్ని ముందుండి నడిపిస్తున్నాడు..! నాడు ఆనందం పంచాడు.. నేడు దేశ ప్రజల్లో యుద్ధ ఉత్సాహాన్ని నింపుతున్నాడు. తగ్గేదేలే అంటూ రణరంగంలో సైనిక అవతారమెత్తాడు.! యుక్రెయిన్‌లో 2014 వరకు ఉన్నది రష్యా అనుకూల ప్రభుత్వాలు.. కూర్చోమంటే కూర్చోవాలి.. నిలబడమంటే నిలబడాలి..! కానీ ఇవాళ యుక్రెయిన్ ప్రజలకు ఓ రాజు ఉన్నాడు..! రీల్ లైఫ్‌లో జోకర్ అయిన ఆయన.. రియల్ లైఫ్‌లో మాత్రం అసలు సిసలైన హీరో..!
ప్రపంచాన్ని శాశిస్తున్న నియంతలకు కూడా తలగ్గొని హీరో ఆయన..! ఒక్క చూపుతో ప్రపంచంపై ఆధిపత్యం చలాయించే అగ్ర దేశాధినేతలను సైతం ఎదిరించగల బాహుబలి ఆయన..! తానే పెద్ద మోనార్క్‌నంటూ విర్రవీగే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు కూడా చూక్కలు చూపించిన ప్రెసిడెంట్ ఆయన..! యుక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలో ప్రపంచం ఒక హీరోని గుర్తించింది..!
ఒకప్పుడు కామెడీ షోలతో యుక్రెయిన్ ప్రజల గుండెల్లో గిలిగింతలు పెట్టిన ఆయన.. ఇప్పుడు అదే గుండెల్లో పొంగిపొర్లే లావా రగిలిస్తున్నారు..! చరిత్రలో తన పేరు నిలిచిపోయెలా చేసుకున్నారు..! అవును..! యుక్రెయిన్ అధ్యక్షడు జెలెన్‌స్కీ ఇప్పుడు వరల్డ్‌వైడ్ సెన్సేషన్..! ఆయనో రోల్‌మోడల్..! ఆయనో స్ఫూర్తి..!
రాజంటే రాజసాన్ని ప్రదర్శించేవాడు కాదు.. తన రాజ్యాన్ని కంటికి రెప్పలా కాచుకునేవాడు. రాజంటే రాజభోగాలు అనుభవించేవాడు కాదు.. తనను నమ్మిన ప్రజలకు ఆపద ఎదురైతే తానున్నానంటూ ముందు నిలిచేవాడు. పోరాడే సమయంలో పారిపోయాడిని పిరికివాడు అంటారు.. అదే పోరాటంలో తానే ముందుకు దూకితే.. వీరుడంటారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని కూడా అలాంటి వీరుడే.
రష్యన్ ఆర్మీ బాంబు దాడులను వెరవకుండా సైనికుడిగా మారారు జెలెన్‌స్కీ. అయితే శుత్రువులకు చిక్కకుండా తన ఉనికిని రహస్యంగా ఉంచుతూ.. వ్యూహాత్మకంగా దూసుకెళ్తున్నారు. అధ్యక్షుడిగా కుర్చీకే పరిమితం కాకుండా ప్రజా రక్షణకు కదనరంగంలోకి దూకారు. సైనికులతో కలిసి రష్యన్ బలగాలను ఎదిరిస్తున్నారు ఈ యుక్రెయిన్ బాహుబలి.
తమకంటే ఎన్నోరెట్లు బలమైన రష్యాతో తలపడుతున్న జెలెన్‌స్కీ ఒకప్పుడు టీవీ సీరియళ్లలో హాస్యనటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. నటుడిగా, స్క్రిప్ట్ రైటర్‌గా, నిర్మాతగా వినోద రంగంలో రాణించారు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. నటులు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం కొత్తేమీ కాకపోయినా ఆయన ప్రస్థానం నిజంగా ఆసక్తికరం.
జెలెన్‌స్కీ 1978 జనవరి 25న అప్పటి సోవియన్ యూనియన్‌లోని క్రైవీ రిహ్ పట్టణంలో యూదు కుటుంబంలో జన్మించారు. ప్రస్తుతం ఈ పట్టణం దక్షిణ యుక్రెయిన్‌లో ఉంది. ఆయన మాతృభాష రష్యన్ అయినప్పటికీ యుక్రెయినియన్, ఇంగ్లీష్ భాషల్లోనూ మంచి పట్టు సాధించారు. ప్రాథమిక, కళాశాల విద్య అనంతరం 2000వ సంవత్సరంలో కీవ్ నేషనల్ ఎకనామిక్ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించేందుకు అర్హత ఉన్నప్పటికీ అటువైపు మొగ్గు చూపలేదు.
17 ఏళ్లకే కామెడీ షోల్లో పాల్గొని సత్తా చాటారు జెలెన్‌స్కీ. తర్వాత 1997లో క్వర్తల్-95 అనే సంస్థను నెలకొల్పారు. ఈ క్వర్తల్-95 ప్రఖ్యాత కామెడీ గ్రూప్‌గా పేరుపొందింది. ఈ హాస్య బృందంలో సభ్యుడిగా ఉంటూ ఒకప్పటి సోవియట్ యూనియన్ దేశాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రదర్శనలు ఇచ్చారు జెలెన్‌స్కీ. 2003లో టీవీ షో నిర్మాతగా.. తర్వాత 2008లో నటుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.
2014లో యుక్రెయిన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశంలోని రష్యన్ కళాకారులను నిషేధించాలి అనుకున్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. 2015లో రష్యా కళాకారులు, ప్రదర్శనలు, వారి సాంస్కృతిక ఆనవాళ్లను యుక్రెయిన్ ప్రభుత్వం నిషేధించింది. దీంతో తన దృష్టిని రాజకీయాలవైపు పెట్టారు జెలెన్‌స్కీ. మరోవైపు సినిమాల్లో ఇటు టీవీ షోల్లో నటిస్తూ, షోలు నిర్మిస్తూ మంచి పేరు సంపాదించారు జెలెన్ స్కీ. అదే సమయంలో తన ప్రదర్శనలతో ప్రభుత్వ విధానాలను విమర్శించారు.
Also Read : Elon Musk: యుక్రెయిన్ కు ఇంటర్నెట్ సదుపాయం అందించిన ఎలాన్ మస్క్
2015-2019 మధ్య ప్రసారమైన ‘సర్వెంట్ ఆఫ్ ది పీపుల్’ అనే టీవీ షో జెలెన్‌స్కీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ షోలో జెలెన్‌స్కీ ఓ హైస్కూల్ హిస్టరీ టీచర్‌గా నటించాడు. అప్పటి యుక్రెయిన్ ప్రభుత్వ వైఖరిని కడిగిపారేసిన షో అది. ప్రభుత్వంలో అవినీతిని బహిర్గతం చేసి ఉతికారేసిన ఆ షో దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యింది. ఆ వీడియోలు దేశ ప్రజల్ని ఎంతో ప్రభావితం చేశాయి. సర్వెంట్ ఆఫ్ ది పీపుల్’ షో తర్వాత జెలెన్‌స్కీ 2019లో యుక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేశాడు.
అప్పటి అధ్యక్షుడు పోరోషెంకోపై 73శాతం మెజారిటీతో గెలిచి దేశాధ్యక్షుడిగా అత్యున్నత పీఠం అధిరోహించాడు. 2019, మే 20న యుక్రెయిన్ 6వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రష్యా సంస్కృతి పరిరక్షణ కోసం యుక్రెయిన్ ప్రభుత్వానికి ఎదురు నిలిచిన ఆయన.., యాంటీ యుక్రెయినియన్‌గా ముద్రవేసుకున్నారు జెలెన్‌స్కీ.. అధ్యక్షుడు అవతాడని ఎవరూ ఊహించి ఉండరు..!
యుక్రెయిన్ రాజకీయాల్లో జెలెన్‌స్కీ ఎంట్రీ యుక్రెయిన్ చరిత్రలో ఏర్పడిన గందరగోళాన్ని పక్కకు నెట్టింది. కానీ, సామ్రాజ్యవాదం, అంతర్జాతీయంగా అమెరికా రాజకీయల కారణంగా ఇప్పుడు నలిగిపోయింది. అయితే జెలెన్‌స్కీ యోధుడు కదా..! ఏం మాత్రం అదరలేదు బెదరలేదు..! యుక్రెయిన్‌ను ఒంటరి చేసిన ప్రపంచ అగ్రదేశాలను వెక్కిరిస్తూ.. సమర యోధుడై యుద్ధభూమిలోకి దిగారు..! రష్యా బలగాలకు ఎదురొడ్డి నిలుస్తున్నారు..! ఈ యుద్ధంలో యుక్రెయిన్ గెలవచ్చు.. ఓడిపోవచ్చు..! కానీ జెలెన్‌స్కీ పేరు మాత్రం చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుంది..! ఆయన నింపిన పోరాట స్ఫూర్తి యుక్రెయిన్ ప్రజల్లో నిత్యం రగులుతూనే ఉంటుంది..! యుక్రెయిన్-రష్యా వార్‌లో జెలెన్‌స్కీ గురించే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.