Un Chief Says Afghanistan Spinning Out Of Control
UN chief says Afghanistan spinning out of control : అఫ్గానిస్థాన్ మహిళల దయనీయ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మహిళలు, బాలికల పరిస్థితి దయనీయంగా మారినట్లు వస్తోన్న వార్తలపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్గాన్ పై తాలిబాన్లు రోజు రోజుకు పట్టుసాధిస్తున్నారు. ఇప్పటికే పలు నగరాలను వారి అదుపులోకి తెచ్చుకున్నారు. ఈక్రమంలో మహిళలపై అత్యంత దారుణ దురాగతాలకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రాబల్యం పెంచుకుంటున్న తాలిబన్ల అరాచకాలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. సాధారణ ప్రజలపై దాడులకు పాల్పడటంతోపాటు మహిళలను ఉగ్రవాదులకు ‘భార్యలు’గా మారాలని నిర్బంధిస్తున్నారని అమెరికన్ మీడియా తెలిపింది. ముఖ్యంగా అవివాహిత మహిళలను తమ భార్యలుగా మారాలని బలవంతపెడుతున్నారని తెలిపింది. ఇలా ఆఫ్గాన్ లోని మహిళల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది.
తాలిబాన్ల ఆధీనంలోని ప్రాంతాల్లో మహిళలు, పాత్రికేయులను లక్ష్యంగా చేసుకొని.. మానవ హక్కులపై ఆంక్షలు విధిస్తున్నారనే నివేదికలతో కలత చెందానని ఆయన అన్నారు. తాలిబన్ల దురాక్రమణలతో అఫ్గానిస్థాన్ నియంత్రణ కోల్పోతోందని..తాలిబాన్లు తక్షణమే దాడులు నిలిపివేయాలని ఆయన పిలుపునిచ్చారు. బలప్రయోగం సుదీర్ఘమైన అంతర్యుద్ధానికి దారితీస్తుందని, దేశాన్ని ఒంటరిని చేస్తుందన్నారు.
అఫ్గాన్ వాసుల ప్రయోజనాల కోసం తాలిబాన్లు వెంటనే ఈ దాడుల్ని నిలిపివేయాలి. చర్చలు జరిగిన అక్కడి పరిస్థితిని చక్కబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. బలప్రయోగం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది సరైన మార్గం కాదనీ..ఇటువంటి పరిస్థితులు సుదీర్ఘమైన అంతర్యుద్ధానికి దారి తీస్తాయని అన్నారు. అధికారం కోసం యుద్ధమార్గాన్ని అవలంబిస్తోన్న వారికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలంటూ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా అమెరికా సేనలు హఠాత్తుగా అఫ్గాన్‌ను వీడటంతో తాలిబాన్లు తమ ఉనికి చాటడం ప్రారంభించారు. దేశంపై పట్టుకోసం అరాచకాలకు పాల్పడుతున్నారు. మహిళలు చిన్నారులని కూడా కూడా వారి బలాన్ని ప్రయోగిస్తూ అంత్యంత దారుణాలకు పాల్పడుతున్నారు. అలా అమెరికా సేనలు వీడాయో లేదో ఇలా తాలిబన్లు విరుచుపడ్డారు. ఇప్పటికే 60 శాతానికి పైగా దేశం వారి వశమైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. మరోవారంలో దేశం మొత్తాన్ని హస్తగతం చేసుకుంటామని వారు ఇప్పటికే ప్రకటించారు.
ఈ క్రమంలో ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో ప్రజల హక్కులు అణచివేతకు గురైనట్లు నివేదికలు వెలువడుతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు, బాలికల పరిస్థితి దయనీయంగా మారినట్లు వస్తోన్న వార్తలపై గుటెరస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘తాలిబాన్ల ఆధీనంలోని ప్రాంతాల్లో మహిళల పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. పౌరులపై దాడులకు తెగబడటం అంతర్జాతీయ మానవతా చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. అది యుద్ధనేరానికి ఏ మాత్రం తీసిపోదు’ అని గుటెరస్ హెచ్చరించారు.