Pegasus
Pegasus Spyware ఇజ్రాయెల్ సంస్థ NSO గ్రూప్ కు అమెరికా షాక్ ఇచ్చింది. మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టే స్పైవేర్ పెగాసస్ ను తయారు చేసే NSO గ్రూప్ ను అమెరికా బ్లాక్‌లిస్ట్‌లోకి చేర్చింది.కాగా,పెగాసస్ స్పై వేర్‌తో చాలా మంది ప్రముఖలపై నిఘా పెట్టారనే వార్తలు.. భారత్‌తోపాటు ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు రేపుతున్న సమయంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు అమెరికా వాణిజ్య విభాగం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో..”విదేశీ ప్రభుత్వాలను అంతర్జాతీయంగా అణచివేసేందుకు ఈ సాధనాలు వీలు కల్పించాయి. అసమ్మతివాదులు, జర్నలిస్టులు, అధికారులు, ఇతరులను అధికారంలో ఉన్న ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకుని వారి గళాన్ని నొక్కివేసేందుకు ఈ స్పైవేర్ ఒక సాధనంగా మారింది. అందుకే స్పైవేర్ పెగాసస్‌ను తయారు చేసి విక్రయిస్తున్న ఇజ్రాయెల్ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూప్ ను పరిమిత కంపెనీల జాబితాలో చేర్చాం”అని అమెరికా పేర్కొంది.
కాగా, పార్లమెంట్ సమావేశాలకు ఒక్క రోజు ముందు భారత్ లో పెగాసస్ ప్రకంపనలు చెలరేగిన విషయం తెలిసిందే. మోదీ సర్కార్ స్పైవేర్ పెగాసస్‌ను ఇజ్రాయెల్ సంస్థ నుంచి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. భారత్‌లో 300 మందికిపైగా ప్రముఖుల ఫోన్ నంబర్లను పెగాసస్ స్పైవేర్ ద్వారా టార్గెట్ చేశారని ‘ది వైర్’ వెబ్‌సైట్ సంచలన కథనాన్ని వెలువరించింది. ఇలా టార్గెట్ అయిన వారిలో పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు,పలువురు కేంద్ర మంత్రులు ఉన్నారని తెలిపింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, కొత్త ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయని ప్రచారం జరిగింది.
దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించడంతోపాటు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేసిన పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. పెగాసస్ అంశంపై దాఖలైన పలు పిటిషన్లపై గత నెల 27న విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం..ఈ వ్యవహారంపై ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. కాగా,సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీకి..సుప్రీం రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్.వి. రవీంద్రన్ నేతృత్వం వహించనున్నారు.నిపుణుల కమిటీ పనితీరును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుంది. పెగాసస్‌పై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించి.. నివేదికను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు కమిటీని ఆదేశించింది.
ALSO READ Punjab Election : కాంగ్రెస్ కోసం రంగంలోకి పీకే..సంకేతాలిచ్చిన సీఎం