US Election 2024 Updates (Photo Credit : Google)
US Election 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పోలింగ్ ప్రక్రియ మంగళవారం జరగనుంది. డెమోక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అత్యంత హోరాహోరీగా తలపడుతున్నారు. దాంతో వారిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
మరో రెండు రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధ్యక్ష అభ్యర్థులు తుది దశ ప్రచారంలో తలమునకలయ్యారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో హీట్ ఎక్కిస్తున్నారు. హోరాహోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న హోరాహోరి ప్రచారాలతో అమెరికా ఎన్నికలు కాక రేపుతున్నాయి.
అమెరికాలో గెలుపోటములను నిర్ణయించే అత్యంత కీలక రాష్ట్రాలు ఏడు ఉన్నాయి. వీటినే స్వింగ్ స్టేట్స్ గా పిలుస్తారు. జార్జియా, మిచిగాన్, పెన్సిల్వేనియా, ఆరిజోనా, విస్కాన్ సిన్, నెవెడా, ఫ్లోరిడా రాష్ట్రాల ఓటర్లే అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించనున్నారు.
రెండు దఫాలుగా ఈ రాష్ట్రాల ప్రజల తీర్పు నిర్ణయాత్మకంగా ఉంటోంది. శ్వేతసౌధంలో అడుగు పెట్టాలనుకునే వారికి ఈ రాష్ట్రంలో గెలుపు అత్యంత కీలకం. ఇక, మంగళవారం ఎన్నికలు ఉండటంతో ఇద్దరు అభ్యర్థులు ఈ ప్రాంతాల్లో హోరాహోరిగా ప్రచారం చేస్తున్నారు. స్వింగ్ స్టేట్స్ లో కమలా హారిస్, ట్రంప్ విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇక నార్త్ కరోలినాలో ప్రచారం నిర్వహించిన హారిస్.. మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు.
మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ముగియాలని అందరూ కోరుకున్నట్లు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజల్లో విద్వేషాలు రేకెత్తిస్తున్నారని మండిపడ్డారు. అమెరికాకు ట్రంప్ కంటే మెరుగైన అధ్యక్షుడు అవసరమని అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాకుండా తన రాజకీయ ప్రత్యర్థులపై పగ, ప్రతీకారం తీర్చుకోవడంపై ట్రంప్ దృష్టి పెడతారని హారిస్ విమర్శించారు.
మరోవైపు మిచిగాన్ లో ట్రంప్ ప్రచారం నిర్వహించారు. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హారిస్ పై విరుచుకుపడ్డారు. ఆర్థిక విధానాల్లో హారిస్ పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. కమలా హారిస్ అధికారంలోకి వస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధించి అధికారంలోకి వస్తే దేశంలో సరికొత్త ఆర్థిక అద్భుతాలను సృష్టిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.
Also Read : ప్రతీకారం తీర్చుకున్న ఇజ్రాయెల్..! హెజ్బొల్లా టాప్ కమాండర్ ఖతం..!