US-Iran Ceasefire Ends : అమెరికా, ఇరాన్ సీజ్‌ఫైర్‌ ఎండ్.. తరువాత ఏం జరగబోతోంది..? ఇప్పటి వరకు ఏం జరిగిందంటే..

US-Iran Ceasefire Ends : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసింది. ఇప్పుడు ఏం జరగబోతోంది అనే అంశం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది.

US-Iran Ceasefire Ends

US-Iran Ceasefire Ends : ఆపరేషన్ ఎపిక్‌ఫ్యూరీ పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద భారీ దాడులకు దిగింది. దీంతో యుద్ధం అనివార్యం అయింది. అక్కడ పేలే ప్రతీ మిస్సైల్‌.. ప్రపంచం గుండెల్లో రీసౌండ్ ఇచ్చింది. హార్ముజ్ క్లోజ్ కావడం.. చమురు రవాణా నిలిచిపోవడంతో.. మెజారిటీ దేశాలు అల్లాడిపోయాయ్‌.. చమురు సంక్షోభంతో ఒక దేశం.. ఆర్థిక సంక్షోభంలో పడిపోయి మరో దేశం.. ఇలా మిడిలీస్ట్ వార్ ఎఫెక్ట్ చాలా రకాలుగా కనిపించింది. అమెరికా, ఇరాన్‌ డిమాండ్‌లు.. మధ్యవర్తుల ప్రయత్నాలతో.. యుద్ధాన్ని ముగించేందుకు కాల్పుల విరమణకు సంబంధించి ఓ అవగాహన ఒప్పందం కుదిరింది. దీంతో అధికారికంగా దాడులు, కాల్పులు ఆగిపోయాయ్ కొన్నిసార్లు ! గత వారం రోజుల నుంచి ఒప్పందం అటకెక్కింది. మళ్లీ పశ్చిమాసియా భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయ్‌. కట్‌ చేస్తే ఇప్పుడు ఆ ఒప్పందం కూడా ముగిసింది. దీన్ని కొనసాగించేందుకు రెండు దేశాలు కూడా ఆసక్తి చూపించడం లేదు. డీల్‌ను ఉల్లంఘించింది మీరంటే మీరంటూ.. అమెరికా, ఇరాన్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయ్‌. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది.

Also Read : Houthis Red Sea Attack : ఎర్ర సముద్రంలో మళ్లీ టెన్షన్.. రెచ్చిపోయిన హౌతీలు.. అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం..

అమెరికా, ఇరాన్‌ మధ్య జూన్ 17న ఒప్పందం..
ఫిబ్రవరి 28న యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత.. పశ్చిమాసియాలో నెలల పాటు సైనిక పోరాటాలు సాగాయ్‌. ఈ ఉద్రిక్తతలకు బ్రేక్ వేస్తూ.. అమెరికా, ఇరాన్‌ మధ్య జూన్ 17న 60 రోజుల తాత్కాలిక అవగాహన ఒప్పందం కుదిరింది. ఆగస్టు 17తో అది అధికారికంగా ముగిసింది. శాశ్వత శాంతి ఒప్పందమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ ఈ డీల్‌పై సంతకాలు చేశారు. అప్పటికే మూడు నెలలకు పైగా కొనసాగిన యుద్ధానికి ముగింపు పలకడం.. ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. ఈ వార్‌లో వేలాది మంది చనిపోగా.. గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్యం, ముఖ్యంగా చమురు, గ్యాస్ ఎగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇరాన్ అణు కార్యక్రమంలాంటి క్లిష్టమైన అంశాలను తర్వాత చర్చించాలని నిర్ణయిస్తూ.. మొదట యుద్ధాన్ని ఆపేందుకు తక్షణ రాజకీయ పరిష్కారం కనుగొనాలని డీల్‌లో నిర్ణయించారు. దీంతో పాటు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను కూడా ముగించే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. ఐతే ఇందులో ఏదీ కూడా వర్కౌట్ కాలేదు. పశ్చిమాసియాలో మళ్లీ మంటలు రేగడం స్టార్ట్ అయ్యాయ్‌.

చివరి ఒప్పందంతో అన్ని రంగాల్లో యుద్ధం ముగింపు..
ఒప్పందం ప్రకారం.. అమెరికా, ఇరాన్ వెంటనే సైనిక చర్యలను నిలిపివేయాలి. చివరి ఒప్పందం ద్వారా.. అన్ని రంగాల్లో యుద్ధం శాశ్వతంగా ముగిసినట్లు ప్రకటించాలి. ఈ తుది ఒప్పందానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం పొందాలి. 60రోజుల్లో ఈ ఒప్పందాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. రెండు దేశాలు అంగీకరిస్తే ఈ గడువును పొడిగించవచ్చు. ఐతే డీల్ కుదిరిన తర్వాత.. పరిస్థితి మారిపోయింది. రెండు మూడులు అంతా బాగానే ఉన్నా.. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ మంటలు పుట్టాయ్‌. దీంతో శాంతి చర్చలు పూర్తిగా నిలిచిపోవడంతో పాటుగా.. పశ్చిమాసియా ప్రాంతంలో మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయ్‌. ఐతే అమెరికాతో చర్చలు తిరిగి ప్రారంభించాలా లేదా అనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ అంటోంది. ఐతే మధ్యవర్తులుగా ఖతార్‌, పాకిస్థాన్‌.. ఇరాన్‌తో సంప్రదింపులు కొనసాగిస్తున్నాయ్‌. ఇక అటు హార్ముజ్ జలసంధిలో కొత్త నౌకాయాన మార్గాలపై ఒమన్‌తో ఇరాన్ ప్రత్యేక ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

60 రోజుల్లోగా సమగ్ర ఒప్పందాన్ని రూపొందించాలి..
అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం ప్రకారం రెండు దేశాలు వెంటనే సైనిక చర్యలను నిలిపివేసి.. 60 రోజుల్లోగా సమగ్ర ఒప్పందాన్ని రూపొందించుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా అమెరికా 30 రోజుల్లో నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తూ.. ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను సడలించడం, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, 3వందల బిలియన్‌ డాలర్ల పునర్నిర్మాణ ప్యాకేజీని అందించడానికి అంగీకరించింది. ఇక అటు హార్ముజ్ జలసంధిలోని మైన్లను తొలగించి.. ఎలాంటి రుసుము లేకుండా వాణిజ్య నౌకల ప్రయాణానికి అనుమతించడం.. అణ్వాయుధాలు తయారు చేయబోమని హామీ ఇచ్చి.. యురేనియం శుద్ధి అంశాలపై చర్చలు జరపాల్సి ఉంది. ఐతే ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే.. పరస్పర ఆరోపణలతో రెండు వర్గాలు తమ కట్టుబాట్ల నుంచి తప్పుకున్నాయ్‌. హార్ముజ్‌ను ఇరాన్ తిరిగి తెరవలేదని అమెరికా ఆరోపించగా.. దిగ్బంధనం ఆంక్షల ఎత్తివేత వాగ్దానాలను అమెరికా నెరవేర్చలేదని ఇరాన్ విమర్శించింది. ఇలాంటి వివాదాల మధ్య సీన్ మళ్లీ మొదటికి వచ్చింది.

ఆగస్ట్‌ 17 అనేది సాంకేతిక ముగింపు మాత్రమే..
నిజానికి జూలై 7నాటికే ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించగా.. ఇరాన్ కూడా బాధ్యతల నుంచి వైదొలిగింది. ఆగస్ట్‌ 17తో గడువు ముగియడం కేవలం ఒక రకమైన సాంకేతిక ముగింపు మాత్రమేనని.. ఆచరణలో ఈ ఒప్పందం ఇప్పటికే ఫెయిల్ అయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్‌. ఐతే ఇప్పుడు అధికారికంగా ఒప్పందం ముగియడంతో.. ఏం జరగబోతోందనే చర్చ కూడా జరుగుతోంది. దీని ప్రభావం ఏంటి అనేది.. అమెరికా, ఇరాన్ అడుగుల మీదే ఆధారపడి ఉంటుంది. ఇస్లామాబాద్‌లో కుదిరిన ఎంవోయూ కాల్పుల విరమణ కోసం కాదు.. యుద్ధాన్ని ముగించేందుకు సంబంధించిందని ఇరాన్ అంటోంది. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా దాడులు కొనసాగించడంతో.. డీల్‌ను పొడగించే పరిస్థతి అసలు కనిపించడం లేదని చెప్తోంది. ఇక అటు ఇరాన్‌ జాతీయ భద్రతా వ్యవస్థలో జరిగిన కొన్ని మార్పులు.. భవిష్యత్‌లో అమెరికాతో చర్చల విషయంలో ఇరాన్ మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని సూచిస్తున్నాయ్‌. మరీ ముఖ్యంగా హార్ముజ్‌ జలసంధిపై నియంత్రణను వదులుకోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్‌.

ఇరాన్‌ భద్రతా మండలి అధిపతిగా రెజాయీ..
ఐఆర్‌జీసీ మాజీ అధినేత రెజాయీని.. ఇరాన్‌ అత్యున్నత భద్రతా మండలి అధిపతిగా నియమించారు. సైనిక, పౌర వ్యవస్థల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ఈ మార్పులు చేసినట్లు కనిపిస్తోంది. అమెరికాతో మళ్లీ కొత్తగా చర్చలు జరిగితే.. ఇరాన్ మరిన్ని డిమాండ్లను ముందుకు తెచ్చే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయ్‌. గాజాలో యుద్ధాన్ని ముగించడం, ఇరాన్‌పై ఆంక్షలు తొలగించడం, యెమెన్‌పై దిగ్బంధనం ఎత్తివేయడం, ఇజ్రాయెల్ అణ్వాయుధాలను తొలగించే చర్యలు చేపట్టడంలాంటి డిమాండ్లను ఇరాన్ ముందు పెట్టే చాన్స్ ఉంది. ఒప్పందం గడువు ముగియడంతో నెక్ట్స్ ఏంటనే చర్చ ప్రపంచదేశాల్లో వినిపిస్తోంది.

హార్ముజ్‌ తమ కంట్రోల్‌లోనే ఉంటుందన్న ఇరాన్ ..
ప్రస్తుతం అమెరికా, ఇరాన్ వివాదానికి.. హార్ముజ్‌ కేంద్రబిందువుగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ జలమార్గం.. కేవలం తమ నియంత్రణలోనే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. 60రోజుల గడువు ముగిసినంత మాత్రాన.. వాణిజ్య నౌకల ప్రయాణం సాధారణ స్థితికి రాదని తేల్చిచెప్పింది. హార్ముజ్ తెరవాలన్నా.. క్లోజ్ కావాలన్నా.. దానికి ఆదేశించాల్సింది తామే అంటోంది ఇరాన్‌. ఇది అమెరికాకు ఎదురైన అతిపెద్ద ఓటమి అని.. ఈ వాస్తవాన్ని ఆ దేశం అంగీకరించాలని డిమాండ్ చేస్తోంది. ఇక అటు హార్ముజ్ జలసంధిపై అమెరికా ఆధిపత్యం, భద్రతా నియంత్రణ కొనసాగుతాయని ట్రంప్ అంటున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఈ జలమార్గం మరింత కీలకంగా మారే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయ్. ఇదంతా ఎలా ఉన్నా.. హార్ముజ్ దగ్గర పరిణామాలతో.. అంతర్జాతీయ ఇంధన మార్కెట్ తీవ్ర అభద్రతకు గురయింది. ఈ జలమార్గంలో వాణిజ్య నౌకల ప్రయాణానికి అంతరాయం ఏర్పడటంతో.. క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోయి, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇరాన్‌ను ఓడించి హార్ముజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటన..
హార్ముజ్ జలసంధి విషయంలో ట్రంప్‌ సర్కార్ ఘాటైన ప్రకటనలు చేస్తోంది. ఇరాన్‌ను ఓడించిన తర్వాత.. హార్ముజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తామని ట్రంప్ అంటున్నారు. ఇరాన్‌పై ఇప్పటివరకు చూడని స్థాయిలో ఆంక్షలు విధిస్తామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సంచలన కామెంట్స్ చేశారు. నిజానికి వెనెజువెలా పరిణామాలతో ఇరాన్‌ను కూడా తమ దారిలోకి తెచ్చుకోవాలని.. గుప్పిట్లో పెట్టుకోవాలని ట్రంప్ ప్రయత్నించగా.. సీన్ రివర్స్ అయింది. టెహ్రాన్‌ను కార్నర్ చేసేందుకు చేసిన ప్రతీ ప్రయత్నం బెడిసికొట్టింది. అలాంటిది ఇప్పుడు ఇరాన్‌ మీద మరింత ఒత్తిడి తీసుకురావడానికి ట్రంప్ దగ్గర ప్రస్తుతం పెద్దగా మార్గాలు లేనట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్‌. అమెరికా దగ్గర ప్రస్తుతం కొన్ని రక్షణ క్షిపణుల నిల్వలు భారీగా తగ్గిపోయాయ్‌. ఇక అటు వ్యూహాత్మక చమురు నిల్వలు కూడా తగ్గిపోయాయ్‌. విమాన వాహక నౌకలు సహా.. కీలకమైన సైనిక పరికరాలను ప్రణాళిక కంటే ఎక్కువ కాలం సముద్రంలో ఉంచాల్సి వచ్చింది. దీంతో ఇరాన్‌పై మరిన్ని సైనిక చర్యలు చేపట్టే అవకాశాలు అమెరికాకు పరిమితంగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

ఇరాన్ ఎన్నిరోజులు యుద్ధాన్ని కొనసాగించగలదు..
ఆర్థిక ఒత్తిడి విషయంలో.. ఇరాన్ తన మార్క్‌ చూపిస్తోంది. హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను అడ్డుకోవడం ద్వారా.. గ్లోబల్‌ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపగల సామర్థ్యం తమకు ఉందని ఇరాన్‌ ప్రపంచానికి పరిచయం చేసింది. ఐతే ఇప్పుడు ఒప్పందం ముగిసింది.. అమెరికా మళ్లీ దాడులు ముమ్మరం చేస్తే.. ఇరాన్ ఎన్నిరోజులు యుద్ధాన్ని కొనసాగించగలదు.. అగ్రరాజ్యం మీద ఎంతవరకు ఒత్తిడి తీసుకురాగలదనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయ్‌. ఇరాన్ రక్షణ పరిశ్రమ రంగాలు, క్షిపణి ఉత్పత్తి కేంద్రాలపై దాడులు జరిగినప్పటికీ.. జరిగిన నష్టం ఎంతనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఐతే ఒకటి మాత్రం క్లియర్‌. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా.. ఇప్పటివరకు ఇరాన్‌ వెనక్కి తగ్గలేదు. సైనిక, ఆర్థిక, రాజకీయ పరిమితులలో ఏ ఒక్కటి కూడా.. ఇరాన్‌ను యుద్ధాన్ని కొనసాగించకుండా ఆపలేకపోయింది. ఐతే ఈ సంఘర్షణ ఎంతకాలం కొనసాగితే, ఇరాన్‌ మీద అంతర్గత ఆర్థిక ఒత్తిడి అంత పెరుగుతుంది. ఇరాన్ ప్రాంతీయ సంబంధాలు అంతగా క్షీణిస్తాయనేది మాత్రం నిజం. దీంతో ఇప్పుడు టెహ్రాన్ అడుగులు కూడా కీలకం కాబోతున్నాయ్‌.

ఒప్పందం ముగిసింది. పశ్చిమాసియాలో నెక్ట్స్ ఏంటి..
ఒప్పందం ముగిసింది. మరి పశ్చిమాసియాలో నెక్ట్స్ ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తోంది. ప్రస్తుతం అమెరికా మీద ఇరాన్‌ చాలా కోపంతో ఉంది. జూన్‌లో కుదిరిన ఎంవోయూలో ఇచ్చిన ఏ హామీలను అమెరికా నెరవేర్చలేదని.. టెహ్రాన్ భావిస్తోంది. అందుకే హార్ముజ్ జలసంధిని గుప్పిట్లో పెట్టుకొని.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ఐతే ఇప్పుడు ఇరాన్ వెనక్కి తగ్గాలన్నా.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ముగియాలన్నా.. ఒకటే మార్గం. యుద్ధానికి ఇరాన్‌కు పరిహారం లభించేలా.. హార్ముజ్‌ మీద ఆ దేశానికి నియంత్రణ ఉండేలా ఒక కొత్త ఒప్పందం తీసుకురావడమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. మరి దీనిపై అగ్రరాజ్యం రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తి రేపుతోంది. అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత.. ఈ వివాదానికి పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయనేది మరికొందరి వాదన. ఇరాన్‌, అమెరికా శాంతిస్తాయా.. చర్చలకు మళ్లీ సిద్ధం అవుతాయా.. అదే జరిగితే ఈసారి తెరపైకి వచ్చే డిమాండ్లు ఏంటి.. ఏం జరగబోతుందనేది.. చూడాలి మరి.