America-Iran War: మళ్లీ మొదలైన అమెరికా-ఇరాన్ పోరు.. విఫలమైన ఖతార్ రాయబారం.. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
అమెరికా, ఇరాన్(America-Iran War)ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ చేసిన దౌత్య రాయబార ప్రయత్నాలు మళ్లీ విఫలమయ్యాయి.
- V Santhosh Kumar
- Published on- September 30, 2026 / 07:59 AM IST
Us iran tensions qatar mediation fails donald trump rejects deal proposal
America-Iran War: అమెరికా, ఇరాన్‌ల మధ్య గత కొంతకాలంగా పెరుగుతున్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ చేసిన దౌత్య రాయబార ప్రయత్నాలు మళ్లీ విఫలమయ్యాయి. ఈ వారంలో న్యూయార్క్, వాషింగ్టన్‌లలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశాల్లో ఎలాంటి పురోగతి లభించలేదు. ఇరాన్‌పై ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేయగా, ఇరాన్ తన అణు కార్యక్రమాలను పూర్తిగా పరిమితం చేసుకోవాలని అమెరికా పట్టుబట్టింది. ఇరు దేశాలు తమ మొండి వైఖరిని వీడకపోవడంతో ఖతార్ ప్రతిపాదించిన రెండు పేజీల ఒప్పందం ముందుకు సాగలేదు.
ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ పోస్ట్‌తో తలకిందులైన చర్చల ప్రక్రియ:
ఖతార్ ప్రతినిధి అలీ అల్-థవాదీ వాషింగ్టన్‌లో అమెరికా అధికారులతో చర్చలు జరుపుతున్న సమయంలోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (America-Iran War)సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సీన్ మార్చేశారు. తాము ఇరాన్‌కు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదని ట్రంప్ తేల్చిచెప్పడంతో చర్చలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. దీంతో మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ ప్రతినిధులతో పాటు పాకిస్తాన్, ఈజిప్ట్ వంటి ప్రాంతీయ దేశాల ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు మళ్లీ మొదటికొచ్చాయి.
ఇరు దేశాల తీవ్ర హెచ్చరికలు – మళ్లీ ముంచుకొస్తున్న యుద్ధ మేఘాలు:
రెండు దేశాల నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ట్రంప్ సరిగ్గా నిర్ణయం తీసుకోలేక ఊబిలో చిక్కుకున్నారని ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహ్సిన్ రజాయీ ఎద్దేవా చేయగా, ఇరాన్ త్వరలోనే లొంగిపోతుందని, వారి వద్ద అణు ఆయుధం లేకుండా చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. మిడ్-టర్మ్ ఎన్నికల తర్వాత అమెరికా పెద్ద ఎత్తున సైనిక చర్యలకు దిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో దౌత్య పరిష్కారం దొరకడం కష్టంగా మారి మళ్లీ యుద్ధ మేఘాలు అలముకున్నాయి.
